పీజీలో చేరుతున్నారా? ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి
For students and working professionals moving to cities, PG accommodation is a convenient option because it is relatively affordable and often includes furniture, food and Wi-Fi.
చదువు, ఉద్యోగం కోసం నగరాలకు వెళ్లేవారికి పీజీ వసతి సౌకర్యవంతమైన ఎంపిక. అద్దె తక్కువగా ఉండటం, ఫర్నిచర్, భోజనం, వైఫై వంటి సదుపాయాలు అందుబాటులో ఉండటంతో చాలామంది పీజీలను ఎంచుకుంటున్నారు. అయితే గది ఎలా ఉంది? అద్దె ఎంత? అనే విషయాలకే పరిమితం కాకుండా.. ఆ భవనం సురక్షితమేనా? చట్టబద్ధంగా నిర్మించారా? అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న భవనం కూలిన ఘటన ఈ అంశాలపై మరోసారి దృష్టి సారించాల్సిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీజీలో చేరే ముందు ఈ ఐదు అంశాలను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
1. భవనంలో అదనపు అంతస్తులు ఉన్నాయా?
పీజీ కోసం చూస్తున్నప్పుడు భవనంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయో ముందుగా గమనించాలి. ముఖ్యంగా టెర్రస్‌పై కొత్తగా నిర్మించిన గదులు, అదనపు అంతస్తులు, తాత్కాలిక గదులు ఉన్నాయా అనేది చూడాలి. అవి అధికారికంగా అనుమతి పొందినవేనా? అన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఆమోదించిన భవన ప్రణాళికకు, ప్రస్తుతం కనిపిస్తున్న నిర్మాణానికి మధ్య తేడా ఉంటే అది ప్రమాద సంకేతంగా భావించాలి.
2. గోడలు, పైకప్పుపై పగుళ్లు ఉన్నాయా?
గోడలపై పెద్ద పగుళ్లు, పైకప్పు నుంచి ప్లాస్టర్ ఊడిపోవడం, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడల్లో తేమ, నీరు కారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. తలుపులు, కిటికీలు సరిగ్గా మూసుకోకపోవడం లేదా నేల ఒకవైపు వాలినట్లు కనిపించడం కూడా నిర్మాణ సమస్యలకు సంకేతం కావచ్చు. చిన్న పగులు కనిపించిందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ పగుళ్లు పెద్దవిగా ఉండటం, పెరుగుతూ ఉండటం లేదా వాటితో పాటు తేమ, వంగిన గోడలు వంటి సమస్యలు కనిపిస్తే నిపుణుల అభిప్రాయం తీసుకోవడం మంచిది.
3. ఫైర్ సేఫ్టీ ఉందా?
పీజీలో ఎంతమంది ఉంటున్నారు? ప్రమాదం జరిగితే బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉందా? మెట్లు ఖాళీగా ఉన్నాయా? ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయా? అత్యవసర నిష్క్రమణ ద్వారాలకు తాళాలు వేయలేదా? వంటి విషయాలను పరిశీలించాలి. కేవలం గోడకు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వేలాడదీసి ఉండటం మాత్రమే భద్రతకు హామీ కాదు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే మార్గం అందుబాటులో ఉండటం అత్యంత కీలకం.
4. ఒక గదిలో ఎంతమందిని ఉంచుతున్నారు?
చిన్న గదిలో ఎక్కువ పడకలు ఏర్పాటు చేయడం కూడా ప్రమాదకరమే. గదులను తాత్కాలిక పార్టిషన్లతో విభజించడం, కారిడార్లను సామానుతో నింపడం, మెట్ల మార్గాలను ఆక్రమించడం వంటివి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అందువల్ల పీజీలో చేరే ముందు గదుల సంఖ్య మాత్రమే కాదు.. మొత్తం భవనంలో నివసిస్తున్న వారి సంఖ్య, అందుబాటులో ఉన్న మెట్లు, కారిడార్లు, ఎగ్జిట్ మార్గాలు కూడా గమనించాలి.
5. భవనం చట్టబద్ధమేనా?
పీజీ నిర్వహిస్తున్న భవనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఆక్యుపెన్సీ లేదా కంప్లీషన్ సర్టిఫికెట్ ఉందా? అవసరమైన చోట ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందారా? వంటి వివరాలను యజమానిని అడగాలి. విద్యుత్ కనెక్షన్ ఉండటం, ఆస్తి పన్ను చెల్లించడం లేదా భవనం చాలా సంవత్సరాలుగా వినియోగంలో ఉండటం మాత్రమే దాని నిర్మాణం పూర్తిగా చట్టబద్ధమైనదని నిరూపించవు. ముఖ్యంగా టెర్రస్‌పై అదనపు నిర్మాణాలు, అనధికార మార్పులు ఉంటే మరింత జాగ్రత్త అవసరం.
గుర్తుంచుకోండి..
పీజీ ఎంపికలో అద్దె కంటే ముందు భద్రతను చూడాలి. తక్కువ అద్దె కోసం అనుమానాస్పద భవనంలో ఉండటం కంటే, కొంచెం ఎక్కువ చెల్లించి సురక్షితమైన వసతిని ఎంచుకోవడం మంచిది. భవనంలో తీవ్రమైన నిర్మాణ లోపాలు కనిపిస్తే.. యజమాని ఎంత ఒత్తిడి చేసినా వెంటనే చేరకుండా ప్రత్యామ్నాయ వసతి చూసుకోవడం ఉత్తమం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0