తెలంగాణ నిర్మాణ రంగం బంద్‌?

పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, అనుమతులలో జాప్యం, అపార్ట్‌మెంట్ల అమ్మకాలు మందగించడం, నీటి, విద్యుత్ కొరత వంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బిల్డర్లు తాత్కాలికంగా నిర్మాణాలను నిలిపివేయాలని యోచిస్తున్నారు.

Oct 16, 2026 - 23:50
Oct 22, 2026 - 02:23
 0  40
తెలంగాణ నిర్మాణ రంగం బంద్‌?
తెలంగాణ నిర్మాణ రంగం బంద్‌? (Image for representational purpose only)

* రియ‌ల్ రంగ‌మంటే ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు
* భూములు అమ్మ‌కాల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌.. ప‌రిశ్ర‌మ‌ను 
   ప్రోత్స‌హించ‌డంలో మాత్రం క‌రువు..
* మూడేళ్ల నుంచి ఈ రంగాన్ని ప‌ట్టించుకోని స‌ర్కార్‌
* ఈ రంగంపై మొద‌ట వేటు వేసింది హైడ్రానే.. 
* ఆల‌స్య‌మ‌వుతున్న అనుమ‌తులు, ఎన్వోసీలు

* 25% పెరిగిన నిర్మాణ సామ‌గ్రి ధ‌ర‌లు
* కొత్త‌గా ముంచుకొస్తున్న మంచినీటి కొర‌త‌
* ట్రాన్స్‌ఫార్మ‌ర్ల కొర‌త‌.. నిలిచిపోయిన గృహ‌ప్ర‌వేశాలు
* అమ్మ‌కాల్లేక కొంద‌రు బిల్డ‌ర్లు ఆగ‌మాగం.. 
* ట్రంప్ ఎఫెక్టు.. బ‌య్య‌ర్లు వెయిట్ అండ్ వాచ్‌

(ఆర్ఈజీ న్యూస్‌, హైద‌రాబాద్‌)

తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ మ‌రియు క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఇండ‌స్ట్రీకి చెందిన కొన్ని నిర్మాణ సంఘాలు క‌లిసి తెలంగాణ నిర్మాణ రంగాన్ని పూర్తిగా బంద్ చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నాయ‌ని తెలిసింది.

కాంగ్రెస్ స‌ర్కార్ అధికారంలోకి వచ్చిన‌ నాటి నుంచి.. రియ‌ల్ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించేందుకు ఎలాంటి సానుకూల నిర్ణ‌యాల్ని తీసుకోలేదు. పైగా, హైడ్రా దెబ్బ‌తో సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం.. హైద‌రాబాద్‌లో సొంతిల్లు కొనుక్కునేందుకు సందేహించే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఎందుకంటే, ఫ్లాటు కొన్న త‌ర్వాత‌, ఏ ప్రాజెక్టులో ఎలాంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయేమోన‌నే ఆందోళ‌న‌తో వెన‌క‌డుగు వేస్తున్నారు.

పూర్త‌యిన ప్రాజెక్టుల‌ను హ్యాండోవ‌ర్ చేయ‌డానికి అవ‌స‌ర‌మయ్యే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల‌ను జారీ చేసేందుకు స్థానిక సంస్థ‌లు ఆల‌స్యం చేస్తున్నాయి. దీంతో, సొంతిల్లు కొన్న కొనుగోలుదారులు అందులోకి అడుగుపెట్ట‌లేక ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు, కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే అనుమ‌తుల్ని స్థానిక సంస్థ‌లు మంజూరు చేయ‌క‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం. 

అమెరికా ఇరాన్ యుద్ధం కార‌ణంగా నిర్మాణ వ్య‌యం గ‌ణనీయంగా పెరిగింది. కొన్ని రకాల టైల్స్‌, ఎలక్ట్రికల్‌ వైర్ల ధరలు దాదాపు 50 శాతం దాకా  పెరిగాయి. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిర్వ‌హిస్తున్న సర్ యాక్టివిటీ వ‌ల్ల‌.. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిన ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన భ‌వ‌న నిర్మాణ కార్మికులు మ‌ళ్లీ వెన‌క్కి తిరిగిరావ‌ట్లేదు.

ఫ‌లితంగా, నిర్మాణ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో పాటు కార్మికుల‌క‌య్యే ఖ‌ర్చు కూడా పెరిగింది. మొత్తానికి, ఈ ఏడాది నుంచి నిర్మాణ వ్య‌యం సుమారు పాతిక శాతంపైగా పెరిగింది. 

టైల్స్‌, గ్లాస్‌తోపాటు పెట్రోకెమికల్‌ ముడిపదార్థాలపై ఆధారపడే పీవీసీ, సీపీవీసీ పైపులు, యూపీవీసీ విండో ప్రొఫైల్స్‌, ప్లాస్టిక్‌ ఫిట్టింగ్స్‌, పెయింట్లు, అడ్హెసివ్స్‌, వాటర్‌ప్రూఫింగ్‌ ఉత్పత్తుల ధరలు, సరఫరాలోని అనిశ్చితి పనుల ప్రణాళికను ప్రభావితం చేస్తున్నాయని ప‌లువురు బిల్డ‌ర్లు చెబుతున్నారు.

అవసరమైన సామగ్రి సకాలంలో సైట్లకు చేరకపోతే, తదుపరి పనులు కూడా ప్రభావితమై ప్రాజెక్టుల పూర్తికి అదనపు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరిగితే రవాణా ఛార్జీల భారం పెరిగింది. పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులకు ముడిపదార్థాల వ్యయం, వాటిని సైట్లకు తరలించేందుకు రవాణా వ్యయం పెరిగితే నిర్మాణ రంగంపై మరింత ఒత్తిడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు భూగర్భ జలాల లభ్యత తగ్గడంతో, నీటి కొనుగోలు వ్యయం పెరుగుతోంది. విద్యుత్‌ అంతరాయాలు ఎదురైనప్పుడు జనరేటర్ల వినియోగానికి అదనపు ఇంధన ఖర్చు అవుతోంది. పనుల వ్యవధి పెరిగే కొద్దీ బ్యాంకు వడ్డీలు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల నగదు ప్రవాహం ప్రభావితమవుతోందని డెవ‌ల‌ప‌ర్లు వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ.927 కోట్ల హోమ్‌బయ్యర్ల మోసం!

నిస్స‌హాయ స్థితిలో డెవ‌ల‌ప‌ర్లు

అమ్మ‌కాల్లేక గ‌త రెండేళ్ల నుంచి బిల్డ‌ర్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. త‌మ సిబ్బందికి జీతాలివ్వ‌లేని నిస్స‌హాయ స్థితిలోకి డెవ‌ల‌ప‌ర్లు వెళ్లిపోయారు. మొత్తానికి వ‌డ్డీ భారాలు పెరిగిపోయి తెలంగాణ నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

తాజాగా నిర్మాణ ప‌నుల్ని స‌జావుగా చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మయ్యే నీటి స‌ర‌ఫ‌రా మ‌రియు విద్యుత్తు కొర‌త ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలో.. తెలంగాణకు చెందిన ప‌లు రియ‌ల్ సంస్థలు కొంత‌కాలం ఎక్క‌డిక‌క్క‌డ నిర్మాణ ప‌నుల్ని బంద్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి.

రెండేళ్ల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉండ‌టం.. ఒక‌వైపు అమ్మ‌కాలు లేక‌పోవ‌డం.. బ్యాంకుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఎన్పీఏ ద‌శ‌కు కొంద‌రు బిల్డ‌ర్లు చేరుకుంటున్నారు. ఈ రంగానికి ప్ర‌భుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం లేక‌పోవ‌డంతో.. ఇక చేసేదేమీలేక‌.. కొంత‌కాలం పాటు నిర్మాణ కార్య‌క‌లాపాల్ని నిలిపివేయ‌డానికి.. తెలంగాణ రియ‌ల్ రంగం ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీలు), ఇతర సంబంధిత ప్రక్రియలు మరింత సులభంగా, శాఖల సమన్వయంతో పూర్తయ్యేలా ప్రభుత్వ సహకారం లభిస్తే ఎంతో ఊరట కలుగుతుందని సంఘాలు భావిస్తున్నాయి. సంబంధిత శాఖలు, నిర్మాణ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ప‌రిష్కారాల్ని చూపెట్టాల‌ని కోరుతున్నాయి. 

నిర్మాణ రంగానికి చేయూత అందించడం అంటే లక్షలాది మంది కార్మికులు, చిన్న కాంట్రాక్టర్లు, సరఫరాదారుల ఉపాధిని కాపాడటంతోపాటు కొనుగోలుదారులకు సకాలంలో గృహాలు అందించేందుకు తోడ్పడటమేనని నిర్మాణ సంఘాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: అమ్మ‌కాల్లేక జుట్టుపీక్కుంటున్న కొంద‌రు బిల్డ‌ర్లు

ప్రభుత్వ సహకారం కావాలి

ముఖ్యమంత్రి నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన సహకారం అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారాలు సాధించి, నిర్మాణ కార్యకలాపాలను సజావుగా కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడమే తమ ఆకాంక్ష అని తెలంగాణ నిర్మాణ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫ్లాట్ల‌ను కొన్న‌వారికీ తాజా ప‌రిస్థితుల్ని వివ‌రించి.. కొన్ని నెల‌ల పాటు ఫ్లాట్ల హ్యాండోవ‌ర్ ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ముందే ప‌లు నిర్మాణ సంఘాలు అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. మొత్తానికి, తెలంగాణ నిర్మాణ రంగం పూర్తి స్థాయి బంద్‌ను ప్ర‌క‌టించే దిశ‌గా ఆలోచించ‌డం ఇదే ప్ర‌ప్ర‌థ‌మం అని చెప్పొచ్చు.

కొంత‌కాలం నిర్మాణ కార్య‌క‌లాపాల్ని స్త‌బ్దు చేసేందుకు ప‌లు నిర్మాణ సంఘాలు ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేస్తున్నాయి. ఇతర సంఘాల నుంచి మ‌ద్ధ‌తును తీసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. మొత్తానికి, కొంత‌కాలం పాటు నిర్మాణ కార్య‌క‌లాపాల్ని స్తంభించే ప‌నిలో ప‌డ్డాయి.. తెలంగాణ నిర్మాణ సంఘాలు.

మ‌రి, ఇప్ప‌టికైనా మేల్కొని ఈ రంగాన్ని ప్రోత్స‌హిస్తుందా? లేక పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తందా అనే విష‌యం త్వ‌ర‌లో తేలుతుంది. 

ప్ర‌భుత్వం నుంచి నిర్మాణ సంస్థ‌లు ఏం కోరుకుంటున్నాయి?

  • డ్రైనేజీ క‌నెక్ష‌న్లు, స‌ర‌ఫ‌రాను ఆల‌స్యం చేయ‌కూడ‌దు
  • ట్రాన్స్‌ఫార్మ‌ర్ల కొర‌త‌ను పూర్తిగా తీర్చాలి
  • విద్యుత్తు క‌నెక్ష‌న్లు, శాశ్వ‌త నివాస విద్యుత్తు  స‌ర‌ఫ‌రా మార్పిడిని వేగవంతం చేయాలి
  • నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే నీటిని  అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలి
  • సిమెంటు, స్టీలు స‌ర‌ఫ‌రాలో కృత్రిమ కొర‌త సృష్టిస్తున్న సిండికేట్‌ను దారిలోకి తేవాలి
  • పూర్త‌యిన భ‌వ‌నాల ఓసీల‌ను త్వ‌ర‌గా జారీ చేయాలి
  • అమ్మ‌కాలు పెరిగేందుకు అవ‌స‌ర‌మయ్యే ప్రోత్సాహానివ్వాలి
  • స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌ను 3 శాతం త‌గ్గించాలి
  • ప్రాజెక్టుల అనుమ‌తుల్ని సులువుగా మంజూరు చేయాలి

ఇదీ చదవండి: రియల్‌ ఎస్టేట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వాలి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0