ఆల‌స్య‌మైన ఆదిత్యా క్యాపిట‌ల్ హైట్స్‌.. బ‌య్య‌ర్‌కు రూ.ల‌క్ష ప‌రిహారం!

A buyer of a flat in Aditya Capital Heights, Hafeezpet, approached TG-RERA after waiting more than six years for possession. After examining the case, TG-RERA awarded ₹1 lakh as compensation for mental agony and ₹20,000 towards legal expenses. The authority directed the developer to pay the total ₹1.20 lakh within 60 days, failing which 10% annual interest would apply on the outstanding amount.

Sep 29, 2026 - 09:48
 0  69
ఆల‌స్య‌మైన ఆదిత్యా క్యాపిట‌ల్ హైట్స్‌.. బ‌య్య‌ర్‌కు రూ.ల‌క్ష ప‌రిహారం!

- టీజీ రెరా కీలక ఉత్తర్వులు

ఫ్లాట్‌ కొనుగోలు కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి, ఏళ్ల తరబడి స్వాధీనం కోసం ఎదురు చూసిన కొనుగోలుదారుకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (టీజీ రెరా) ఊరటనిచ్చింది. ఇంతకాలం ఆయన పడిన మానసిక వేదనకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని నిర్మాణసంస్థను ఆదేశించింది. 

అమెరికాలో నివసిస్తున్న వంశీధర్‌ మోతిపల్లి 2018 మార్చి 23న హఫీజ్‌పేటలోని ఆదిత్య క్యాపిటల్‌ హైట్స్‌ ప్రాజెక్టులో బి-బ్లాక్‌, 11వ అంతస్తులో 2,125 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఫ్లాట్‌ మొత్తం విలువ రూ.1,02,62,500గా నిర్ణయించారు. రెండు కార్ల పార్కింగ్‌ స్థలాలు కూడా ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. కొనుగోలుదారు ఇప్పటివరకు రూ.85,55,367 చెల్లించారు. ఒప్పందంలో భాగంగా ‘ప్రీ-ఈఎంఐ’ పథకాన్ని ఎంచుకున్నట్లు కొనుగోలుదారు తెలిపారు. ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు రుణానికి సంబంధించిన ఈఎంఐలను నిర్మాణ సంస్థే చెల్లించాల్సి ఉండగా, సంస్థ ఆ చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. దీంతో తానే బ్యాంకుకు ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నిర్మాణ సంస్థ ఈ ఆరోపణలను ఖండించింది. కొనుగోలుదారుడే విడతల వారీగా చెల్లించాల్సిన మొత్తాల్లో విఫలమయ్యారని, అందువల్ల ప్రీ-ఈఎంఐ పథకం వర్తించదని వాదించింది. నిర్మాణంలో జాప్యానికి కొవిడ్‌ పరిస్థితులు కూడా కారణమయ్యాయని తెలిపింది. 


ఒప్పందం కుదుర్చుకున్న ఆరేళ్లకు పైగా గడిచినా ఫ్లాట్‌ తనకు అప్పగించలేదని వంశీధర్‌ రెరాను ఆశ్రయించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ విషయంలోనూ జాప్యం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తాను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మానసిక వేదనకు రూ.10 లక్షలు, అంచనా అద్దె ఆదాయం కోల్పోయినందుకు రూ.18 లక్షలు, మోసం ఆరోపణలకు రూ.10 లక్షలు, న్యాయ ఖర్చుల కింద రూ.2 లక్షలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ మొత్తాలన్నింటినీ టీజీ రెరా అంగీకరించలేదు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా మానసిక వేదనకు రూ.1 లక్ష, న్యాయ వ్యయాలకు రూ.20 వేలు మాత్రమే మంజూరు చేసింది. అంచనా అద్దె ఆదాయం నష్టానికి, మోసం ఆరోపణలకు పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆ అభ్యర్థనలను తిరస్కరించింది. రూ.1.20 లక్షల పరిహారాన్ని ఉత్తర్వుల తేదీ నుంచి 60 రోజుల్లోగా చెల్లించాలని, నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే బకాయి మొత్తంపై చెల్లించే వరకు ఏటా 10 శాతం వడ్డీ వర్తిస్తుందని టీజీ రెరా స్పష్టం చేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0