కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచాలి.. బాణాల రాంరెడ్డి కుటుంబానికి అండగా నిలుద్దాం
Hyderabad builders seek greater clarity on Section 22-A, property registrations, approvals and occupancy certificates, while urging the government to strengthen buyer confidence and support the construction sector.
— మారం సతీష్ కుమార్
అధ్యక్షుడు, గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్
రియల్టర్ బాణాల రాంరెడ్డి మరణం ఎంతో బాధను కలిగించింది. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి రావాలని, కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో నిర్మాణ రంగ సంఘాలు ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ నిర్మాణ రంగం ఎదుర్కొన్న పరిస్థితులను కూడా నిర్మాణాత్మకంగా చర్చించుకోవాలి. హైడ్రా చర్యలు, సెక్షన్ 22-ఏకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో.. కొంతకాలం కొనుగోలుదారుల్లో సందేహాలు ఏర్పడ్డాయి. రెరా నమోదు, సంబంధిత అధికారుల అనుమతులు ఉన్న ప్రాజెక్టుల విషయంలోనూ కొందరు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసినట్లు పరిశ్రమలో మా అనుభవం చెబుతోంది. ఇది మార్కెట్ వేగంపై కొంత ప్రభావం చూపింది. కొనుగోలుదారులకు స్పష్టమైన సమాచారం అందడం ఎంత అవసరమో ఈ అనుభవం తెలియజేసింది.
* చెల్లుబాటు అయ్యే అనుమతులున్న అర్హమైన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం అమలులో ప్రతి దశలోనూ స్పష్టత లభిస్తే, కొనుగోలుదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు నిర్మాణ రంగం పూర్తి సహకారం అందిస్తుంది. అదే సమయంలో అనుమతులు, భూమి పత్రాలు, ప్రాజెక్టుల స్థితిపై అధికారిక సమాచారం సులభంగా అందుబాటులో ఉంటే, చట్టబద్ధమైన ప్రాజెక్టుల గురించి కొనుగోలుదారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
* నిర్మాణ రంగంపై బిల్డర్లు, డెవలపర్లతో పాటు కార్మికులు, ఇంజినీర్లు, సరఫరాదారులు, సేల్స్ సిబ్బంది సహా అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితే ఇళ్లు కొనుగోలు చేసిన వారికి మేలు జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి. ప్రభుత్వాలకూ ఆదాయం సమకూరుతుంది. అందుకే నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లపై సకాలంలో నిర్ణయాల్ని తీసుకునే విధానాలను బలోపేతం చేయాలని కోరుతున్నాం. ఈ అంశాలపై ప్రభుత్వం నిర్మాణరంగ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
* పరిశ్రమ సంఘాల బాధ్యత కూడా అంతే ముఖ్యం. సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా వినాలి. ఇబ్బందుల్లో ఉన్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలి. సమస్యలను ఆధారాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారంలో భాగస్వాములు కావాలి. బాణాల రాంరెడ్డి కుటుంబానికి మనమంతా తోడుగా నిలుద్దాం. కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచుతూ, నిర్మాణ రంగంపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు, పరిశ్రమ సంఘాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0