ట్రిపుల్ ఆర్ శంకుస్థాపన ఎప్పుడు?
The Regional Ring Road (RRR) around Hyderabad is once again attracting strong attention, with expectations that the mega project could soon move towards the foundation-stone ceremony.
హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ దిశను పూర్తిగా మార్చేస్తుందనే అంచనాలున్న రీజినల్ రింగ్ రోడ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా ఫైళ్లకే పరిమితమైన ఈ మెగా ప్రాజెక్టు ఇప్పుడు శంకుస్థాపన దశకు చేరువవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయన్న ప్రచారం సాగుతుండటంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో మళ్లీ కదలికలు మొదలయ్యాయి.
ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ దాదాపు పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టెండర్ ప్రక్రియ కూడా చివరి దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీపై పడింది. కేంద్ర కేబినెట్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? శంకుస్థాపన ఎప్పుడు జరుగుతుంది? అనే చర్చే రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రధాన అంశంగా మారింది.
మళ్లీ వేడెక్కుతున్న ట్రిపుల్ ఆర్ కారిడార్.
గతంలో రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ప్రకటించిన సమయంలో సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేయగా పెట్టుబడిదారులు కూడా ఎకరాల కొద్దీ భూములు తీసుకున్నారు. అయితే ప్రాజెక్టు పురోగతి నెమ్మదించడంతో మార్కెట్ కూడా కాస్త చల్లబడింది. ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్ చర్చలోకి రావడంతో అదే ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సర్వేలు పెరిగినట్లు సమాచారం. లేఔ ట్లు, వెంచర్లు, ఫామ్‌ల్యాండ్లు, ఇండస్ట్రియల్ భూములపై విచారణలు పెరిగాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్‌చేంజ్‌లపైనే పెట్టుబడిదారుల ఫోకస్
సాధారణంగా రింగ్ రోడ్ నిర్మాణంలో ఎక్కువ విలువ పెరిగేది ఇంటర్‌చేంజ్‌ల చుట్టుపక్కల ప్రాంతాలకే. అందుకే ట్రిపుల్ ఆర్ లో ప్రతిపాదిత జంక్షన్లు, కనెక్టివిటీ పాయింట్లపై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ సాగుతోంది. భవిష్యత్తులో లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులు, పరిశ్రమలు, టౌన్‌షిప్‌లు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో డెవలపర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
భూముల ధరలు మళ్లీ పరుగెడతాయా?
శంకుస్థాపన జరిగితే మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల విలువ పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. అయితే గతంలోలాగే ఊహాగానాల ఆధారంగా పెట్టుబడులు పెట్టడం కంటే.. అధికారిక అలైన్‌మెంట్, ఇంటర్‌చేంజ్‌లు, జోనింగ్ వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
శంకుస్థాపన ఎప్పుడంటే?
ప్రస్తుతం ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదమే కీలకంగా మారింది. ఆమోదం వచ్చిన వెంటనే శంకుస్థాపన కార్యక్రమం జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ రెండవ వారంలో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మార్కెట్‌లో ఒక్కటే చర్చ.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భూముల ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారుల చూపు ఔటర్ కారిడార్‌ను దాటి ట్రిపుల్ ఆర్ వైపు మళ్లుతోంది. ఈసారి నిజంగానే పనులు మొదలవుతాయా? లేక మరోసారి ప్రకటనలకే పరిమితమవుతుందా? అనే చర్చ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో జోరుగా సాగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా శంకుస్థాపనపై పెరుగుతున్న అంచనాలు మాత్రం హైదరాబాద్ చుట్టూ పక్కల భూములు మార్కెట్‌లో మరోసారి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0