లాంచింగ్ నాడే ఆ పెంట్ హౌస్ లన్నీ అమ్మకం
Three luxury penthouses designed by Gauri Khan, wife of Bollywood superstar Shah Rukh Khan, were sold on the launch day at Danube Properties’ Shahrukhz Residences in Dubai Maritime City.
- దుబాయ్ మేరిటైమ్ సిటీలో ప్రాజెక్టు
- ప్రాజెక్టు డిజైనర్ గా షారుక్ భార్య గౌరీఖాన్
దుబాయ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ డీల్ నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ రూపకల్పన చేసిన అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు ప్రారంభించిన రోజే అమ్ముడయ్యాయి. ఒక్కో పెంట్‌హౌస్ ధర సుమారు రూ.50 కోట్లుగా ఉండటం ఈ విక్రయాల ప్రత్యేకత. దుబాయ్ మెరీటైమ్ సిటీలో డాన్యూబ్ ప్రాపర్టీస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.
'షారుఖ్‌జ్ రెసిడెన్సెస్' పేరుతో చేపట్టిన ఈ 60 అంతస్తుల భవనంలో స్టూడియో అపార్ట్‌మెంట్లతో పాటు ఒకటి, రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లు, ప్రత్యేక పెంట్‌హౌస్‌లు అందుబాటులో ఉంటాయి. గౌరీ ఖాన్ రూపొందించిన మూడు ప్రత్యేక పెంట్‌హౌస్‌లు ప్రారంభమైన రోజే అమ్ముడైనట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
వీటిలో ఒక్కో దాని ధర రూ.50 కోట్లు (సుమారు 19.6 మిలియన్ దిర్హామ్‌లు). ప్రాజెక్టు ప్రారంభానికి ముందే సుమారు 500 మంది కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు డాన్యూబ్ గ్రూప్ ఛైర్మన్ రిజ్వాన్ సాజన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో నివాసితుల కోసం 40కి పైగా ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
అత్యాధునిక ఫిట్‌నెస్ కేంద్రం, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా హాల్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్‌లు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా క్రయోథెరపీ, హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ, రెడ్‌లైట్ థెరపీ, ఇన్‌ఫ్రారెడ్ సౌనా వంటి సదుపాయాలతో ప్రత్యేక వెల్‌నెస్ లాంజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
రూఫ్‌టాప్‌లో 'కింగ్స్ క్లబ్', నివాసితుల కోసం ప్రత్యేక యాచ్ సదుపాయం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
30:70 చెల్లింపు విధానం
ఈ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్ల ధరలు 16.5 లక్షల దిర్హామ్‌ల (సుమారు రూ.4.2 కోట్ల) నుంచి ప్రారంభమవుతున్నాయి. కొనుగోలుదారులకు 30:70 చెల్లింపు విధానాన్ని అందిస్తున్నారు. నిర్మాణ దశలో 30 శాతం, గృహాల అప్పగింత సమయంలో మిగిలిన 70 శాతం చెల్లించాలి. 2029 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసి అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
షారుఖ్ ఖాన్ పేరుతో డాన్యూబ్ గతంలో నిర్మించిన వాణిజ్య భవనం కూడా 2025లో ప్రారంభించిన రోజే అమ్ముడైంది. తాజాగా నివాస ప్రాజెక్టులోనూ పెంట్‌హౌస్‌లు తొలిరోజే అమ్ముడవడం దుబాయ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఇంటికి ఇన్సూరెన్స్ అవసరమా?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0