ఇన్వెస్టర్ల లేరు.. పూర్తయిన ఇళ్లకే మధురైలో డిమాండ్!
Madurai’s real estate market is driven primarily by end-users rather than property investors, according to Ilangovan, Managing Director of Vishal Promoters Pvt. Ltd.
సొంతింటి కొనుగోలుదారులే కీలకం అంటున్న
విశాల్ ప్రమోటర్స్ ఎండీ ఇళంగోవన్
ఆర్ఈజీ న్యూస్, చెన్నై:
గత ఏడాదిలో మదురైలో ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ.. అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా సొంతింటి కోసం చూస్తున్న స్థానిక కొనుగోలుదారులపైనే ఆధారపడి ఉంది. పెట్టుబడుల కోసం ఇళ్లు కొనేవారి కంటే.. తమ నివాస అవసరాల కోసం కొనుగోలు చేసే వారే ఎక్కువగా ఉండటంతో, కొనుగోలుదారుల బడ్జెట్‌కు సరిపోయే గృహాల నిర్మాణంపై బిల్డర్లు దృష్టి సారిస్తున్నారు. నగర పరిధిలో అందుబాటు ధరల్లో అపార్ట్‌మెంట్లు, శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత విల్లాలకు ప్రాధాన్యం పెరుగుతోందని తమిళనాడులోని మధురైకి చెందిన విశాల్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇళంగోవన్ తెలిపారు. ఆయన రియల్ ఎస్టేట్ గురుకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్న వెల్లడించారు.
‘‘మదురైలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధానంగా సొంతింటి కొనుగోలుదారులపై ఆధారపడి ఉంది. ఇది పెట్టుబడుల మార్కెట్ కాదు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు సగటు ధర సుమారు రూ.6,000గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే రూ.500 పెరిగింది. అందుబాటు ధరల్లో లభించే ఇళ్లకే విక్రయాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో కొందరు అద్దె ఆదాయం లేదా భవిష్యత్తులో ధరల పెరుగుదల ద్వారా లాభాలు పొందేందుకు ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే మధురైలో మాత్రం స్థానిక నివాసితులే ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నారు. దీంతో గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు ప్రజల కొనుగోలు సామర్థ్యం, రోజువారీ నివాస అవసరాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఇళంగోవన్ వివరించారు.
* మధురైలో ప్రాంతాన్ని బట్టి గృహాల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. నగర పరిధిలో అపార్ట్‌మెంట్లకు ప్రాధాన్యం ఉండగా.. శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత విల్లాలపై ఆసక్తి కనిపిస్తోంది. చొక్కికుళం, కేకే నగర్, అన్నా నగర్ ప్రాంతాల్లో నివాస గృహాలకు డిమాండ్ ఉందని ఇళంగోవన్ తెలిపారు. నగరంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయని, కొత్త ప్రాజెక్టుల ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
విశాల్ ప్రమోటర్స్ ఈ ఏడాది రెండు చిన్న ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరో భారీ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 200 అపార్ట్‌మెంట్లను పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘‘వచ్చే ఏడాది 200 విల్లాలు, 280 గదులతో ఒక హోటల్, వృద్ధుల నివాస అవసరాల కోసం 196 అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్రణాళిక రూపొందించాం’’ అని ఇళంగోవన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో సంప్రదాయ గృహ నిర్మాణాలకు మించి ఇతర విభాగాల్లోనూ సంస్థ విస్తరించనుంది. స్వతంత్ర గృహాలను కోరుకునేవారి కోసం విల్లాలు, వృద్ధుల కోసం ప్రత్యేక నివాస సముదాయం, పర్యాటకులు ఇతర సందర్శకుల అవసరాల కోసం హోటల్‌ను అభివృద్ధి చేయనున్నారు.
చెన్నైతో పోలిస్తే వృద్ధి తక్కువే!
మధురై రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్తుపై ఇళంగోవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ మెరుగైన వృద్ధిని నమోదు చేసే అవకాశముందని, అయితే చెన్నై స్థాయి వృద్ధి మాత్రం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్థానిక కొనుగోలుదారుల బడ్జెట్‌కు అనుగుణంగా ఇళ్లను అందించడంతోపాటు, మారుతున్న నివాస అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను చేపట్టడం బిల్డర్లకు కీలకంగా మారనుంది. ఈ అంశాలే రానున్న సంవత్సరాల్లో మదురై రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధిని ప్రభావితం చేయనున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0