రియల్ ఎస్టేట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వాలి
CREDAI President-Elect Gummi Ram Reddy has called for the Central Government to officially recognise real estate as a key economic sector, given its significant contribution to economic growth and employment generation.
- దేశ ఆర్థిక అభివృద్ధిలో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది
- క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గుమ్మి రామ్‌రెడ్డి
దేశ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కీలక ఆర్థిక రంగంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గుమ్మి రామ్‌రెడ్డి అన్నారు. కేవలం ఇళ్ల నిర్మాణం, విక్రయాలకే ఈ రంగాన్ని పరిమితం చేయకుండా.. దీనితో అనుసంధానమైన అనేక పరిశ్రమలు, భారీ ఉద్యోగ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కోల్‌కతాలో జరిగిన క్రెడాయ్ నాట్కాన్ 2026 సందర్భంగా రామ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
రియల్ ఎస్టేట్ కార్యకలాపాల ప్రభావం నిర్మాణ రంగానికే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, పెయింట్స్, టైల్స్, శానిటరీ ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ సామగ్రి, ఫర్నిచర్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వంటి అనేక రంగాలు రియల్ ఎస్టేట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుసంధానమై ఉన్నాయని వివరించారు. అందువల్ల ఈ రంగం వృద్ధి చెందితే దాని ప్రభావం అనేక అనుబంధ పరిశ్రమలపై ఉంటుందని, అదే సమయంలో రియల్ ఎస్టేట్‌లో మందగమనం ఏర్పడితే దాని ప్రభావం కూడా విస్తృతంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్
క్రెడాయ్ నాట్కాన్ లో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 2025లో సుమారు 600 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. పట్టణీకరణ, ఆదాయాల పెరుగుదల, గృహాలకు డిమాండ్, వాణిజ్య స్థలాల అవసరం, గ్లోబల్ కంపెనీల కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు, 2025లో దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నివాస ప్రాజెక్టుల విలువ 430 బిలియన్ డాలర్లకు చేరినట్లు క్రెడాయ్–అనరాక్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2019లో నమోదైన 235 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
రియల్ ఎస్టేట్ రంగానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని క్రెడాయ్ కోరడానికి ప్రధాన కారణాల్లో ఉపాధి కల్పన కూడా ఒకటి. నిర్మాణ కార్మికుల నుంచి ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, ప్రాజెక్టు మేనేజర్లు, సేల్స్ సిబ్బంది, ఆర్థిక నిపుణులు, లీగల్ కన్సల్టెంట్లు, ఆస్తి నిర్వహణ సిబ్బంది వరకు విస్తృత స్థాయిలో ఉద్యోగాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. అదే సమయంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా రోడ్లు, రవాణా, విద్యుత్, నీటి సరఫరా, వాణిజ్య కార్యకలాపాలు వంటి మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీంతో ఒక ప్రాజెక్టు చుట్టూ ఏర్పడే ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని రామ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
2047పై దృష్టి పెట్టాలి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర మరింత పెరగనుందని రామ్‌రెడ్డి పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా కొత్త ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, మౌలిక వసతులు అవసరమవుతాయని తెలిపారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగాన్ని దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో కీలక భాగంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గత కొన్నేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో నియంత్రణ పరంగా కూడా గణనీయమైన మార్పులు వచ్చాయని రామ్‌రెడ్డి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్–రెరా, జీఎస్టీ అమల్లోకి రావడంతో డెవలపర్ల కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయని తెలిపారు. భవిష్యత్తులో వినియోగదారుల నమ్మకం, నాణ్యత, సమయపాలన మరింత కీలకం కానున్నాయని చెప్పారు. అలాగే దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కూడా రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలను తెస్తున్నాయని రామ్‌రెడ్డి పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0