సిబిల్ రికార్డుల్లో తప్పు, ఎల్ఐసీ కి రూ.2.45 లక్షల జరిమానా
The Hyderabad District Consumer Commission has directed LIC Housing Finance to pay ₹2.45 lakh for failing to update a former co-applicant’s details in CIBIL records even after removing his name from a home loan account.
- కో-అప్లికెంట్‌గా తొలగించినా సిబిల్‌కు సమాచారం ఇవ్వని సంస్థ
- బాధితుడికి పరిహారం చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశం
గృహ రుణం తీసుకున్నప్పుడు సహ దరఖాస్తుదారుగా (కో-అప్లికెంట్) ఉన్న వ్యక్తి పేరును రుణ ఖాతా నుంచి తొలగించినా.. ఆ విషయాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (సిబిల్)కు తెలియజేయకపోతే ఆర్థిక సంస్థలపై బాధ్యత తప్పదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. రుణ ఖాతాలో మార్పులు చేసినప్పుడు వాటిని సిబిల్ రికార్డుల్లోనూ సరిచేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థదేనని పేర్కొంది.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు బాధితుడికి రూ.2.20 లక్షల పరిహారం, మరో రూ.25 వేల న్యాయపరమైన ఖర్చులు కలిపి మొత్తం రూ.2.45 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సిబిల్ రికార్డుల్లో తప్పులు వినియోగదారుల ఆర్థిక విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.
విడాకుల తర్వాత తొలగించాల్సిన పేరు
వీరా నరేందర్ రెడ్డి వై అనే వ్యక్తి మాజీ భార్య 2016లో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.31 లక్షల గృహ రుణం తీసుకున్నారు. ఆ రుణానికి నరేందర్ రెడ్డిని సహ దరఖాస్తుదారుగా చేర్చారు. అయితే 2016 మార్చిలో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో గృహ రుణ ఖాతా నుంచి తన పేరును తొలగించాలని నరేందర్ రెడ్డి సంస్థను కోరారు. ఇందుకోసం విడాకుల ఉత్తర్వుల ప్రతిని సమర్పించారు.
సంస్థ కోరిన మేరకు ఆయన మాజీ భార్య కూడా తన పేరును తొలగించేందుకు అంగీకారం తెలిపారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2017 జనవరిలో రుణ ఖాతా నుంచి ఆయన పేరును తొలగించింది. అదే ఏడాది అక్టోబర్ 17న రుణ ఖాతాను కూడా పూర్తిగా మూసివేసింది.
అయితే, రుణ ఖాతా నుంచి పేరు తొలగించినప్పటికీ.. ఆ సమాచారాన్ని సిబిల్‌కు తెలియజేయడంలో సంస్థ విఫలమైంది. ఫలితంగా 2019 నుంచి 2025 వరకు సిబిల్ క్రెడిట్ రికార్డుల్లో నరేందర్ రెడ్డి పేరు సహ దరఖాస్తుదారుగా కొనసాగింది.
ఈ కారణంగా తాను వివిధ బ్యాంకుల్లో గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అవి తిరస్కరణకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. సిబిల్ రికార్డుల్లో తన పేరు తప్పుగా కొనసాగుతున్న విషయాన్ని సంస్థ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
దీనివల్ల తీవ్ర మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు, అవమానం ఎదుర్కొన్నానని చెబుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఇదీ చదవండి: ఇటుకలు, సిమెంట్ దాటి రియల్ పెట్టుబడులు
సంస్థ వాదనను తోసిపుచ్చిన కమిషన్
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. 2017 జనవరిలోనే ఫిర్యాదుదారుడి పేరును అంతర్గత రుణ ఖాతా నుంచి తొలగించామని, అదే ఏడాది అక్టోబర్‌లో రుణాన్ని పూర్తిగా మూసివేశామని వివరించింది. సిబిల్ స్కోరులో తలెత్తిన వ్యత్యాసాలు తమ పరిధిలోకి రావని వాదించింది.
ఫిర్యాదుదారు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సిబిల్‌ను సంప్రదించి రికార్డులను పరిశీలించి సరిచేయాలని కోరినట్లు తెలిపింది. అయితే సంస్థ వాదనతో కమిషన్ ఏకీభవించలేదు.
రుణ ఖాతాలో సహ దరఖాస్తుదారుడి పేరును తొలగించడంతోనే సంస్థ బాధ్యత పూర్తికాదని స్పష్టం చేసింది. ఖాతా స్థితిలో వచ్చిన మార్పులను సిబిల్‌కు తెలియజేసి, అక్కడి రికార్డులను కూడా సరిచేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత సంస్థపై ఉందని పేర్కొంది. తప్పు సమాచారం కొనసాగడం వల్ల వినియోగదారుడి క్రెడిట్ స్కోరు, రుణం పొందే అర్హతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.
అయితే సిబిల్ రికార్డుల్లో తప్పు సమాచారం ఉండటం వల్లే ఇతర బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించాయని నిరూపించే తగిన పత్రాలను ఫిర్యాదుదారు సమర్పించలేకపోయారని కమిషన్ పేర్కొంది. ప్రత్యక్షంగా ఎంత ఆర్థిక నష్టం జరిగిందో కూడా నిరూపించలేకపోయారని తెలిపింది.
అయినప్పటికీ 2019 నుంచి 2025 వరకు సిబిల్ రికార్డుల్లో తన పేరు తప్పుగా కొనసాగడం వల్ల ఎదురైన మానసిక వేదన, అసౌకర్యం, ఆందోళనకు పరిహారం పొందేందుకు ఆయన అర్హుడని స్పష్టం చేసింది. దీంతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.2.20 లక్షల పరిహారంతో పాటు రూ.25 వేల న్యాయపరమైన ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లను నిర్మిస్తున్నదెవరు?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0