ఆఫీస్.. అదరగొట్టింది

Office properties continue to dominate investor interest in India’s real estate sector. According to a recent Colliers report, office assets accounted for more than 40% of total real estate investments in India during H1 2026.

Aug 31, 2026 - 01:56
 0  6
ఆఫీస్.. అదరగొట్టింది
india-office-real-estate-investment-colliers-report-2026
  • మొత్తం పెట్టుబడుల్లో 40 శాతం వాటా
  • కొలియర్స్ నివేదిక వెల్లడి

భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆఫీస్‌ ప్రాపర్టీలకు పెట్టుబడిదారుల నుంచి భారీ ఆదరణ కొనసాగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశ రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతానికి పైగా ఆఫీస్‌ ఆస్తులకే దక్కినట్లు కొలియర్స్‌ తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దేశీయ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మూలధనం ఈ విభాగానికి ప్రధాన బలంగా నిలిచింది. 2022 నుంచి ఇప్పటివరకు భారత ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో దాదాపు 14 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రతి ఏడాది దేశ రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చే సంస్థాగత పెట్టుబడుల్లో ఆఫీస్‌ ఆస్తులు సుమారు 40–50 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. నాణ్యమైన ఆఫీస్‌ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్‌, స్థిరమైన అద్దె ఆదాయం, దీర్ఘకాలిక రాబడులపై నమ్మకం ఈ పెట్టుబడులకు కారణమవుతున్నాయి.

2026 తొలి త్రైమాసికంలోనే భారత రియల్‌ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు 1.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇందులో దేశీయ పెట్టుబడులు 1.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడు వంతులు దేశీయ సంస్థాగత పెట్టుబడుల నుంచే వచ్చాయి. అదే సమయంలో ఆఫీస్‌ విభాగం ఒక్కటే 800 మిలియన్‌ డాలర్లను ఆకర్షించి మొత్తం పెట్టుబడుల్లో సగం వాటాను దక్కించుకుంది. ఆఫీస్‌ ఆస్తుల్లో పెట్టుబడులకు ప్రధానంగా రెడీ-టు-ఆక్యుపై, గ్రేడ్‌-ఏ కార్యాలయ భవనాలు ఆకర్షణగా మారుతున్నాయి. విభిన్న కంపెనీలను అద్దెదారులుగా కలిగి ఉండటం, స్థిరమైన నగదు ప్రవాహాలు, దీర్ఘకాలిక రాబడులపై స్పష్టత ఉండటం వల్ల పెట్టుబడిదారులు ఈ ప్రాపర్టీలను తక్కువ రిస్క్‌ అవకాశాలుగా చూస్తున్నారు.

గ్లోబల్‌ మార్కెట్‌లోనూ ఆఫీస్‌ రంగానిదే ఆధిపత్యం

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోనూ 2026 తొలి ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు 105 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2022 తర్వాత ఇదే అత్యుత్తమ తొలి అర్ధ సంవత్సర పనితీరు. ఇందులో ఆఫీస్‌ ఆస్తులు 40.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగా.. రిటైల్‌ ఆస్తులు 26.7 బిలియన్‌ డాలర్లు, పారిశ్రామిక ప్రాపర్టీలు 22.8 బిలియన్‌ డాలర్లు పొందాయి. డేటా సెంటర్లలోనూ 6.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. భారత్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) విస్తరిస్తుండటం ఆఫీస్‌ మార్కెట్‌కు మరింత ఊతమిస్తోంది. 2026 తొలి ఆరు నెలల్లో జీసీసీలు సుమారు 16.6 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్థలాన్ని లీజ్‌ చేసుకున్నాయి. మొత్తం గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ డిమాండ్‌లో ఇది 46 శాతం వాటా.

బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు జీసీసీ డిమాండ్‌లో ముందంజలో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో జీసీసీల వార్షిక ఆఫీస్‌ లీజింగ్‌ 35–40 మిలియన్‌ చదరపు అడుగుల స్థాయికి చేరొచ్చని కొలియర్స్‌ అంచనా వేస్తోంది. మరోవైపు పెట్టుబడిదారులు క్రమంగా మిక్స్‌డ్‌-యూజ్‌ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్‌-లాజిస్టిక్స్‌, రిటైల్‌, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై కూడా దృష్టి పెడుతున్నారు. దీర్ఘకాలిక డిమాండ్‌, మెరుగైన రిస్క్‌-రిటర్న్‌ అవకాశాలు ఇందుకు కారణం. మొత్తంగా చూస్తే.. ఉద్యోగాలు, జీసీసీలు, ఐటీ-బీపీఎం విస్తరణతో నాణ్యమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో భారత కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులకు కీలక గమ్యస్థానంగా మారుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0