ఇళ్ల అమ్మకాలు జోరు

India’s residential real estate market remained strong in the first half of 2026, with home sales across seven major cities rising 3% year-on-year to 1,38,382 units, according to JLL.

Aug 22, 2026 - 08:22
 0  61
ఇళ్ల అమ్మకాలు జోరు
india-home-sales-h1-2026-bengaluru-chennai-hyderabad
  • దేశవ్యాప్తంగా 1.38 లక్షల ఇళ్లు విక్రయం..
  • బెంగళూరు టాప్‌, చెన్నైలో అత్యధిక వృద్ధి

దేశీయ రెసిడెన్షియల్ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇళ్ల కొనుగోళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. 2026 తొలి అర్ధభాగంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1,38,382 అపార్ట్‌మెంట్‌లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 3 శాతం పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్‌ తాజా నివేదికలో వెల్లడించింది. అధిక ధరల ఇళ్లకు డిమాండ్‌ పెరగడం, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.

 బెంగళూరు ఈ ఏడాది గృహ విక్రయాల్లో దూసుకెళ్లింది. జనవరి-జూన్‌ మధ్య 35,017 ఇళ్ల విక్రయాలతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 16 శాతం పెరిగాయి. కొత్త ఇళ్ల సరఫరా కూడా 41 శాతం పెరిగి 48,748 యూనిట్లకు చేరింది. అమ్మకాల పరిమాణంలో బెంగళూరు ముందున్నప్పటికీ, వృద్ధి రేటులో చెన్నై అగ్రస్థానంలో ఉంది.

అక్కడ ఇళ్ల అమ్మకాలు 27 శాతం పెరిగి 8,587 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 20,761 ఇళ్లు అమ్ముడవగా, వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ లో 28,518 ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక విక్రయాలు నమోదైన మార్కెట్లలో ఇది రెండో స్థానంలో ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గాయి. మరోవైపు కొత్త ఇళ్ల ప్రారంభాలు మాత్రం 18 శాతం పెరిగాయి.

హైదరాబాద్‌లో 16,067 ఇళ్ల అమ్మకాలు

దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ కీలక మార్కెట్‌గా కొనసాగుతోంది. జేఎల్ఎల్‌ గణాంకాల ప్రకారం 2026 జనవరి-జూన్‌ మధ్య హైదరాబాద్‌లో 16,067 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 14 శాతం తగ్గి 17,281 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ నగరంలో గృహ మార్కెట్‌పై నమ్మకం కొనసాగుతోందని జేఎల్ఎల్‌ విశ్లేషణ సూచిస్తోంది.

రూ. కోటి పైబడిన ఇళ్లకే ఎక్కువ డిమాండ్‌

కొనుగోలుదారులు తక్కువ ధరల ఇళ్ల కంటే ప్రీమియం, లగ్జరీ ఇళ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 2026 తొలి అర్ధభాగంలో రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లు మొత్తం అమ్మకాలలో 71 శాతం వాటాను ఆక్రమించాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాటా 62 శాతంగా ఉంది. ముఖ్యంగా రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.

 ఏడు ప్రధాన నగరాల్లో 2026 తొలి ఆరు నెలల్లో 1,68,507 కొత్త ఇళ్లను ప్రారంభించారు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం ఎక్కువ. బెంగళూరులో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు అత్యధికంగా 41 శాతం పెరిగాయి. ఇళ్ల అమ్మకాలు మాత్రమే కాకుండా ధరలు కూడా పెరుగుతున్నాయి. జేఎల్ఎల్‌ ప్రకారం తొలి అర్ధభాగంలో ఏడు ప్రధాన నగరాల్లో నివాస ఆస్తుల ధరలు వార్షికంగా 6 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. బెంగళూరులో అత్యధికంగా 15 శాతం ధరల పెరుగుదల నమోదైంది. చెన్నై, కోల్‌కతాల్లో 13 శాతం చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లోనూ ధరలు పెరుగుతున్న ధోరణి కొనసాగుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0