పరిహారం తీసుకున్నాక మళ్లీ అదనపు డబ్బు అడగలేరు

MahaRERA has dismissed a homebuyer’s complaint seeking additional compensation for a 171-day possession delay at Gera Developments’ Planet of Joy Project-2 in Pune.

Nov 19, 2026 - 02:15
Nov 19, 2026 - 05:29
 0  37
పరిహారం తీసుకున్నాక మళ్లీ అదనపు డబ్బు అడగలేరు
పరిహారం తీసుకున్నాక మళ్లీ అదనపు డబ్బు అడగలేరు: మహారెరా.
  • బిల్డర్‌ సెటిల్‌మెంట్‌ను అభ్యంతరం లేకుండా అంగీకరించిన గృహ కొనుగోలుదారుకు రెరా షాక్‌

ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత బిల్డర్‌ నుంచి పరిహారం స్వీకరించి, దానిని పూర్తి పరిష్కారంగా అంగీకరించిన గృహ కొనుగోలుదారులు.. ఆ తర్వాత మరింత పరిహారం కోరలేరని మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) స్పష్టం చేసింది. పరిహారం తీసుకునే సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా, భవిష్యత్తులో అదనపు పరిహారం కోరే హక్కును కూడా రిజర్వు చేసుకోకపోతే తదుపరి డిమాండ్‌ చేయడానికి వీలుండదని పేర్కొంది. పుణెలోని ఓ గృహ కొనుగోలుదారు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ, నవంబర్‌ 13న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

పుణెలోని గెరా డెవలప్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 'ప్లానెట్‌ ఆఫ్‌ జాయ్‌ ప్రాజెక్ట్‌-2'లో ఓ మహిళ 2022 జూన్‌ 10న ఫ్లాట్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఫ్లాట్‌ మొత్తం విలువ రూ.81.13 లక్షలు కాగా, అందులో సుమారు రూ.77.07 లక్షలు (దాదాపు 95 శాతం) చెల్లించారు. ఒప్పందం ప్రకారం 2025 డిసెంబర్‌ 31 నాటికి ఫ్లాట్‌ అప్పగించాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) రావడంలో జాప్యం జరిగింది. 2026 మే 29న భవనానికి పాక్షిక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లభించింది.

జూన్‌ 2న బిల్డర్‌ ఫ్లాట్‌ స్వాధీనానికి సిద్ధంగా ఉందని సమాచారం ఇచ్చారు. జూన్‌ 20న కొనుగోలుదారు ఫ్లాట్‌ స్వాధీనం తీసుకున్నారు. అయితే అప్పటికే జాప్యం 171 రోజులు జరిగిందని, దీనికి పరిహారంగా బిల్డర్‌ కేవలం 27 రోజులకే లెక్కగట్టి రూ.30,984 మాత్రమే ఆఫర్‌ చేశారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రెండు వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి

అనుమతుల ప్రక్రియలో జాప్యం

పుణె మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎంఆర్‌డీఏ) నుంచి పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ (పీఎంసీ)కు అధికార పరిధి మారడం వల్ల అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని బిల్డర్‌ వివరించారు. నిర్మాణం, ఇతర నిబంధనల పరంగా అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే ఓసీ కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. 

ఆలస్యంగా చెల్లించిన వాయిదాలపై విధించిన కొంత వడ్డీని కూడా మినహాయించామని పేర్కొన్నారు. రూ.30,984 పరిహారాన్ని ఆఫర్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ వివాదాన్ని పరిశీలించిన మహారెరా కొనుగోలుదారు బిల్డర్‌ ఇచ్చిన పరిహారాన్ని పూర్తి, తుది పరిష్కారంగా స్వచ్ఛందంగా అంగీకరించారని పేర్కొంది. 

ఫ్లాట్‌ స్వాధీనం సమయంలో భవిష్యత్తులో అదనపు పరిహారం కోరే హక్కును రిజర్వు చేసుకున్నట్లు పత్రాల్లో ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపింది. పరిహారాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వీకరించినట్లు నిరూపించే ఆధారాలను కూడా కొనుగోలుదారు సమర్పించలేకపోయారని మహారెరా పేర్కొంది.  దీంతో అదనపు పరిహారం కోరుతూ దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేసింది.

ఈ తీర్పు నేపథ్యంలో ఫ్లాట్‌ స్వాధీనం సమయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బిల్డర్‌ నుంచి ఆలస్యానికి సంబంధించిన పరిహారం తీసుకుంటున్నప్పుడు అది పూర్తి, తుది పరిష్కారమా? లేక పాక్షిక చెల్లింపా? అనేది స్పష్టంగా తెలుసుకోవాలి.

పరిహారంపై అభ్యంతరాలు ఉంటే వాటిని రాతపూర్వకంగా నమోదు చేయాలి. అదనపు పరిహారం కోరే హక్కును వదులుకోవడం లేదని సంబంధిత పత్రాల్లో స్పష్టం చేయడం మంచిది. మౌనంగా పరిహారాన్ని అంగీకరించడం భవిష్యత్తులో న్యాయపరమైన హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ కేసు సూచిస్తోంది.

ఇదీ చదవండి: పార్కింగ్‌ వివాదంలో కొనుగోలుదారుడికి మహారెరా షాక్‌

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0