వైద్య సేవల మౌలిక వసతులకు భారీ డిమాండ్

India will need an additional 2.6 billion sq. ft. of healthcare real estate by 2035, along with approximately 2.9 million additional hospital beds, according to a CBRE South Asia report.

Oct 26, 2026 - 08:57
Oct 28, 2026 - 07:37
 0  72
వైద్య సేవల మౌలిక వసతులకు భారీ డిమాండ్
వైద్య సేవల మౌలిక వసతులకు భారీ డిమాండ్
  • 2035 నాటికి 260 కోట్ల చదరపు అడుగులు అవసరం
  • దేశంలో 29 లక్షల అదనపు ఆసుపత్రి పడకలు కావాలి

దేశంలో పెరుగుతున్న వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా 2035 నాటికి అదనంగా 260 కోట్ల చదరపు అడుగుల ఆరోగ్య సంరక్షణ స్థిరాస్తులు అవసరమవుతాయని సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ప్రపంచ సగటు స్థాయికి చేరుకోవాలంటే దేశంలో సుమారు 29 లక్షల అదనపు ఆసుపత్రి పడకలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుతం భారత్‌లో ప్రతి వెయ్యి మందికి సగటున 1.6 ఆసుపత్రి పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ సగటు 3.3 పడకలుగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే వైద్య మౌలిక వసతులను గణనీయంగా విస్తరించాల్సి ఉంటుంది.

2025 నాటికి దేశంలో ఆరోగ్య సంరక్షణ స్థిరాస్తుల విస్తీర్ణం సుమారు 210 కోట్ల చదరపు అడుగులుగా ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. పెరుగుతున్న జనాభా, వైద్య సేవల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సేవల కేంద్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది.

దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన వసతులు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయని నివేదిక తెలిపింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలతో పాటు కుటుంబాల ఆదాయ స్థాయులు కూడా అధికంగా ఉండటం ప్రత్యేక వైద్య సేవల విస్తరణకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలు, సమగ్ర వైద్య సేవల వ్యవస్థల అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో వ్యాధుల భారంతో పోలిస్తే ఆసుపత్రి పడకల లభ్యత తక్కువగా ఉందని నివేదిక గుర్తించింది.

ఈ ప్రాంతాల్లో ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలకు తీరని డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఆసుపత్రుల విస్తరణ, వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఇదీ చదవండి: 2050 నాటికి ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది పట్టణాల్లోనే నివాసం

ఆసుపత్రులకే పరిమితం కాని వైద్య రియల్‌ ఎస్టేట్‌

ఆరోగ్య సంరక్షణ రంగంలో సంప్రదాయ ఆసుపత్రులతో పాటు ఇతర ప్రత్యేక సేవల కేంద్రాలకూ డిమాండ్‌ పెరుగుతోంది. డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, డే కేర్‌ శస్త్రచికిత్స కేంద్రాలు, ఆరోగ్య పరీక్షల కేంద్రాలు, పునరావాస క్లినిక్‌లు, కంటి వైద్య కేంద్రాలు, ఐవీఎఫ్‌ కేంద్రాలు, టీకాల కేంద్రాలు, వెల్‌నెస్‌ సదుపాయాలు ముఖ్యమైన విభాగాలుగా ఎదుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

కొన్ని నగరాల్లో ఇప్పటికే వైద్య సేవల రంగంలో పోటీ తీవ్రంగా ఉండటంతో, కొత్తగా ప్రవేశించే సంస్థలు సొంతంగా ఆసుపత్రులు నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఆసుపత్రులను కొనుగోలు చేయడం లేదా వాటి నిర్వహణ వ్యవస్థలను వినియోగించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి.

దీనివల్ల లైసెన్సులు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, రోగుల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని వేగంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుంది.

మెడికల్‌ ఆఫీస్‌ భవనాలకూ అవకాశాలు

భారత్‌లో ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న మెడికల్‌ ఆఫీస్‌ భవనాల విభాగం భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఒకే భవనంలో డయాగ్నస్టిక్స్‌, దంత వైద్యం, కంటి వైద్యం, పునరావాసం, పిల్లల అభివృద్ధి సేవలు, ఐవీఎఫ్‌, వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల రోగులకు ఒకేచోట వివిధ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు భవనంలోని స్థల వినియోగం కూడా మెరుగుపడుతుంది.

మొత్తంగా, 2035 నాటికి దేశంలో ఆరోగ్య సంరక్షణ స్థిరాస్తుల అవసరం భారీగా పెరగనుండటంతో ఆసుపత్రుల నిర్మాణం, ప్రత్యేక వైద్య కేంద్రాలు, సమగ్ర వైద్య సముదాయాల అభివృద్ధికి అవకాశాలు విస్తరించనున్నాయి.

ఇదీ చదవండి: భారత రియల్‌ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0