రీసేల్ లగ్జరీ ఇళ్లకూ డిమాండ్

The luxury resale housing market in Greater Hyderabad is witnessing rising demand, particularly in West Hyderabad’s IT corridors such as Gachibowli, Financial District, Narsingi, Kokapet, Tellapur, Puppalaguda and Khajaguda.

Aug 23, 2026 - 03:53
 0  7
 రీసేల్ లగ్జరీ ఇళ్లకూ డిమాండ్
hyderabad-luxury-resale-flats-demand

గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొనుగోలుదారుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కొత్తగా ప్రారంభమయ్యే ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వారు.. ఇప్పుడు లగ్జరీ రీసేల్ ఫ్లాట్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నర్సింగి, కోకాపేట, తెల్లాపూర్, పుప్పాలగూడ, ఖాజాగూడ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఐదేళ్లలోపు నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్పున‌కు ప్రధాన కారణం కొత్త ప్రాజెక్టుల ధరలు భారీగా పెరగడమే. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌ లో కొత్తగా లాంచ్ అవుతున్న లగ్జరీ ప్రాజెక్టుల ధరలు చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతున్నాయి. దీనికి జీఎస్టీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇంటీరియర్ వ్యయం కూడా కలవడంతో మొత్తం పెట్టుబడి మరింత పెరుగుతోంది. అంతేకాకుండా నిర్మాణం పూర్తయ్యే వరకు రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు వేచి చూడాల్సి రావడం కూడా కొనుగోలుదారులను వెనక్కు తగ్గిస్తోంది.

రెడీ-టు-మూవ్ ఇళ్లకే ప్రాధాన్యం

ఇప్పటికే నిర్మాణం పూర్తయి, మంచి నిర్వహణలో ఉన్న రీసేల్ ఫ్లాట్ల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ఐదేళ్లలోపు నిర్మించిన లగ్జరీ ఫ్లాట్లు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.8,500 నుంచి రూ.9,500 మధ్య లభిస్తుండటంతో కొత్త ప్రాజెక్టులతో పోలిస్తే గణనీయమైన ధరల ప్రయోజనం లభిస్తోంది. కొనుగోలు చేసిన వెంటనే గృహప్రవేశం చేసే అవకాశం ఉండటంతో పాటు క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కులు, 24 గంటల భద్రత వంటి అన్ని సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉండటం కూడా ప్రధాన ఆకర్షణగా మారింది.

ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలే ప్రధాన కొనుగోలుదారులు

పశ్చిమ హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలు, పెద్ద ఇంటికి మారాలనుకునే అప్‌గ్రేడ్ కొనుగోలుదారులు ఈ రీసేల్ మార్కెట్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం లొకేషన్‌లో నాణ్యమైన ఇల్లు దక్కుతుండటంతో రీసేల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.

బిల్డర్లకు కొత్త సవాల్

రీసేల్ మార్కెట్ నుంచి పెరుగుతున్న పోటీ కొత్త ప్రాజెక్టుల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బిల్డర్లు ధరల్లో సడలింపులు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లు, ప్రీ-ఈఎంఐ ఆఫర్లు, రిజిస్ట్రేషన్ లేదా ఇంటీరియర్ ప్యాకేజీలు ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విలువ కే ఓటేస్తున్న మార్కెట్

ఐటీ రంగ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బలంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం కొనుగోలుదారులు కొత్త ప్రాజెక్టు కంటే ధరకు తగిన విలువ ఉన్న రెడీ-టు-మూవ్ ఇల్లు కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పశ్చిమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో రీసేల్ సెగ్మెంట్ కొత్త ఊపును సంతరించుకుంటోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0