20 అడుగుల రూల్‌.. ఇళ్ల యజమానులకు షాక్

Hyderabad’s 20-feet road-width rule is creating difficulties for homeowners seeking to reconstruct old houses on small plots, particularly in older colonies and the Old City, where 60–70 square-yard plots are common.

Nov 14, 2026 - 00:46
Nov 16, 2026 - 02:22
 0  18
20 అడుగుల రూల్‌.. ఇళ్ల యజమానులకు షాక్

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులకు.. భవన నిర్మాణ నిబంధనలు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాత కాలనీల్లో చిన్న స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇప్పుడు 20 అడుగుల నిబంధన షాక్ ఇస్తోంది.

దాదాపు 14 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన భవన నిర్మాణ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కఠినంగా అమలు చేయడంతో పాత ఇళ్ల పునర్నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చిన్న స్థలాల్లో ఉన్న ఇళ్లను కూల్చి తిరిగి నిర్మించుకోవాల‌ని భావించే ఇంటి యజమానులకు బిల్డ్‌నౌ పోర్టల్‌లో దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడంతో ఆందోళన మొదలైంది.

రియల్టర్లు, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తూ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించినంత మాత్రాన నిర్మాణ అనుమతి వచ్చినట్లు కాదని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: విదేశాల్లో సంపాదన..స్వదేశంలో సొంతిల్లు

14 ఏళ్ల నాటి జీవో

 తెలంగాణ ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో జారీ చేసిన జీవో నంబర్ 168లో భవన నిర్మాణాలకు సంబంధించి పలు నిబంధనల్ని  పొందుపరిచింది. వీటిలో 20 అడుగుల కంటే తక్కువ వెడల్పు ఉన్న నివాస స్థలాలకు సంబంధించిన నిబంధన కూడా చర్చకు వచ్చింది.

ఇలాంటి స్థలాల్లో నిర్మాణ అనుమతుల విషయంలో పరిమితులు ఉండటంతో చిన్న ప్లాట్ల యజమానులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నిబంధన దాదాపు 14 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అంత కఠినంగా అమలు కాలేదు. చిన్న స్థలాల్లోనూ నిర్మాణాలకు అనుమతులు లభించేవి.

అయితే ఇటీవల బిల్డ్‌నౌ ఆన్‌లైన్ భవన అనుమతుల వ్యవస్థలో మార్పులు చేయడంతో నిబంధనలను ఆటోమేటిక్‌గా అమలు చేసే పరిస్థితి ఏర్పడింది. 20 అడుగుల కంటే తక్కువ వెడల్పున్న స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు సాఫ్ట్‌వేర్‌లో తిరస్కరణకు గురవడంతో పాత ఇళ్ల యజమానులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

60, 70 గజాల స్థలాల యజమానులకు

హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు పలు పాత నివాస కాలనీల్లో 60 నుంచి 70 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దశాబ్దాల క్రితమే నిర్మించిన ఇళ్లు ఇలాంటి చిన్న ప్లాట్లలోనే ఉన్నాయి. కాలక్రమేణా కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం, భవనాలు పాతబడటం, మరమ్మతుల ఖర్చులు అధికం కావడంతో వాటిని కూల్చి కొత్తగా నిర్మించుకోవాలనే ఆలోచన యజమానుల్లో పెరుగుతోంది.

అయితే కొత్త నిబంధనల అమలుతో పాత ఇళ్ల పునర్నిర్మాణానికి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పెద్ద స్థలాలు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో ఉన్న స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నాయి.

ఇలాంటి వారికి అనుమతి లభించకపోతే సొంతింటి కల మరింత భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమైంది.

ఇదీ చదవండి: మంచిరేవుల‌లో మంచి డిమాండ్‌

బిల్డర్ల ఆందోళన.. 

20 అడుగుల నిబంధనను కఠినంగా అమలు చేయడంపై రియల్ ఎస్టేట్ రంగం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన పాత కాలనీల్లో రహదారుల వెడల్పు, స్థలాల ఆకృతి, ప్లాట్ల విభజన వంటి అంశాలు భిన్నంగా ఉంటాయని రియల్టర్లు చెబుతున్నారు.

పాత ఇళ్ల పునర్నిర్మాణానికి కొత్తగా ఈ నిబంధనలను వర్తింపజేస్తే.. వేలాది మంది యజమానులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. మరోవైపు చిన్న స్థలాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు జరగకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని అధికారులు వాదిస్తున్నారు.

పెద్ద స్థలాలను చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి నిబంధనలను తప్పించుకునే ప్రయత్నాలను అడ్డుకోవడం, పట్టణ ప్రణాళికను క్రమబద్ధీకరించడం ఈ నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశమని వివరిస్తున్నారు.

నిరసనలతో వెసులుబాటు..

నిబంధనల అమలుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న పాత భవనాల పునర్నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేలా బిల్డ్‌నౌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేప‌ట్టామ‌ని మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు. 20 అడుగుల కంటే తక్కువ వెడల్పున్న స్థలాలకు కూడా దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని  కల్పించారు.

అయితే అనుమతులు మంజూరు చేసే ముందు టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలిస్తారు. స్థలం స్వరూపం, పాత నిర్మాణం, యాజమాన్య పత్రాలు, భవన నిర్మాణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు.

అంటే ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ.. అన్ని చిన్న స్థలాలకు ఆటోమేటిక్‌గా అనుమతులు లభిస్తాయని భావించడానికి వీల్లేదు.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్ కారిడార్‌లో లగ్జరీ విల్లాలు.. 

75 గజాల ప్లాట్ల‌కు?

మరోవైపు 75 చదరపు గజాల వరకు ఉన్న స్థలాల్లో.. గ్రౌండ్ లేదా గ్రౌండ్ ప్లస్ వన్ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం, 2019లో ప్రత్యేక మినహాయింపు ఉంది. ఈ నిబంధన ప్రకారం నిర్దేశిత షరతులకు లోబడి బిల్డింగ్ పర్మిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం ఉండదు.

అయితే ఆన్‌లైన్‌లో నమోదు, స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి. ప్రభుత్వ లేదా నిషేధిత భూములు, వివాదాస్పద స్థలాలకు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అలాగే 75 గజాలకు మించిన స్థలాలను ఈ ప్రయోజనం కోసం కృత్రిమంగా విభజించడానికీ అనుమతి లేదు.

దీంతో చిన్న స్థలాల యజమానులు తమ స్థలం విస్తీర్ణం, నిర్మాణ అంతస్తులు, యాజమాన్య పత్రాల ఆధారంగా వర్తించే నిబంధనలను ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

ప్రస్తుతం బిల్డ్‌నౌలో దరఖాస్తుల స్వీకరణకు వెసులుబాటు కల్పించినప్పటికీ అసలు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించిందా అన్న ప్రశ్న మిగిలే ఉంది. పాత ఇళ్ల పునర్నిర్మాణానికి అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తారు? చిన్న స్థలాల్లో భద్రత, గాలి, వెలుతురు, డ్రైనేజీ, పార్కింగ్ వంటి అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? పాత భవనాల పునర్నిర్మాణం, కొత్తగా ప్లాట్లు విభజించి నిర్మాణాలు చేపట్టడం మధ్య తేడాను ఎలా గుర్తిస్తారు? అన్నది కీలకంగా మారింది.

మొత్తంగా 20 అడుగుల నిబంధన హైదరాబాద్ నిర్మాణ రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. ఒకవైపు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం, మరోవైపు పాత ఇళ్ల యజమానులకు ఇబ్బందులు లేకుండా చూడటం ప్రభుత్వానికి సవాలుగా మారింది. బిల్డ్‌నౌలో దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైనా.. తుది అనుమతుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రావాలని సామాన్యులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మేడ్చ‌ల్‌లో లేక్‌ఫ్రంట్ విల్లా లివింగ్..

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0