- రియల్ ఎస్టేట్‌లో హృతిక్ రోషన్ మరో భారీ ఒప్పందం
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటుడిగానే కాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముంబైలోని తన వాణిజ్య కార్యాలయ స్థలాన్ని ప్రముఖ బయోటెక్ సంస్థ క్లియర్‌సింథ్ ల్యాబ్స్ లిమిటెడ్కు ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.17 లక్షల అద్దె లభించనుండగా, అనంతర రెండేళ్లలో అద్దెను రూ.19.55 లక్షలకు పెంచనున్నారు.
ఈ ఒప్పందంతో హృతిక్‌కు ఐదేళ్ల కాలంలో కోటి రూపాయల ఆదాయం సమకూరనుంది. ఈ వాణిజ్య కార్యాలయం ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉంది. సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రీమియం ఆఫీస్ స్పేస్‌ను క్లియర్‌సింథ్ ల్యాబ్స్ లీజుకు తీసుకుంది. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం లీజు కాలం 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు కొనసాగుతుంది.
అద్దె పెంపు నిబంధనను కూడా ఒప్పందంలో చేర్చారు. లీజు ఒప్పందంలో భాగంగా క్లియర్‌సింథ్ ల్యాబ్స్ కంపెనీ భారీ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించినట్లు ఆస్తి పత్రాలు వెల్లడించాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలిక ఒప్పందాలకు ఇలాంటి డిపాజిట్ విధానం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో యజమానికి స్థిరమైన ఆదాయం, అద్దెదారుకు దీర్ఘకాలిక వ్యాపార భద్రత లభిస్తుంది.
హృతిక్ రోషన్ గత కొన్నేళ్లుగా వాణిజ్య ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ముంబైలోని గోరేగావ్‌లో ఒక కమర్షియల్ ఆఫీస్‌ను లీజుకు ఇచ్చి అద్దె ఆదాయం పొందుతున్నారు. అలాగే పుణెలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న కార్యాలయ స్థలాన్ని కూడా గతంలో దీర్ఘకాలిక లీజుతో అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు అంధేరిలోని కొత్త ఒప్పందంతో ఆయన కమర్షియల్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో మరింత బలపడింది.