ఫిన్‌టెక్‌ సంస్థకు సైఫ్‌ అలీఖాన్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజు

Bollywood actor Saif Ali Khan has leased two commercial office units in Mumbai’s Andheri East to fintech firm Durva Fintech Private Limited for five years, earning a starting monthly rent of ₹22.76 lakh.

Oct 27, 2026 - 01:16
Oct 28, 2026 - 07:26
 0  91
ఫిన్‌టెక్‌ సంస్థకు సైఫ్‌ అలీఖాన్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజు
ఫిన్‌టెక్‌ సంస్థకు సైఫ్‌ అలీఖాన్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజు.
  • నెలకు రూ.22.76 లక్షల అద్దె
  • ఐదేళ్లలో రూ.14 కోట్లకు పైగా ఆదాయం

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ తన రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల ద్వారా భారీ అద్దె ఆదాయాన్ని పొందనున్నారు. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఉన్న రెండు వాణిజ్య కార్యాలయ యూనిట్లను ఓ ఫిన్‌టెక్‌ సంస్థకు ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చారు. వీటి ద్వారా నెలకు రూ.22.76 లక్షల అద్దె లభించనుంది. ఐదేళ్లలో అద్దె రూపంలో రూ.14 కోట్లకు పైగా ఆదాయం వచ్చేలా ఒప్పందం కుదిరింది.

ముంబైలోని అంధేరీ ఈస్ట్‌ చకలా ప్రాంతంలో అంధేరీ-కుర్లా రోడ్డుపై ఉన్న కనాకియా వాల్‌ స్ట్రీట్‌ భవనంలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. రెండు యూనిట్ల మొత్తం రెరా కార్పెట్‌ ఏరియా 5,692 చదరపు అడుగులు. వీటిని దుర్వా ఫిన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం చదరపు అడుగుకు నెలకు సుమారు రూ.400 అద్దె లభించనుంది. ఈ లీవ్‌ అండ్‌ లైసెన్స్‌ ఒప్పందం 2026 సెప్టెంబర్‌ 29న రిజిస్టర్‌ అయింది.

2026 మే 10 నుంచి 2031 మే 9 వరకు ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా అద్దెదారు రూ.2.36 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. కార్యాలయాల్లో ఇంటీరియర్‌ పనులు, అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు 2026 మే 10 నుంచి జులై 9 వరకు రెండు నెలల అద్దె మినహాయింపు ఇచ్చారు. జులై 10 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభమయ్యేలా ఒప్పందం రూపొందించారు. అద్దె ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ లెక్కన ఐదేళ్లలో మొత్తం అద్దె ఆదాయం రూ.14 కోట్లను దాటనుంది.

సైఫ్‌ అలీఖాన్‌ ఈ రెండు కార్యాలయ యూనిట్లను 2025 నవంబర్‌లో కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ పత్రాల ప్రకారం, రెండింటి మొత్తం కొనుగోలు విలువ రూ.30.75 కోట్లు. అపికోర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి వీటిని కొనుగోలు చేయగా, లావాదేవీలు నవంబర్‌ 18న రిజిస్టర్‌ అయ్యాయి.

కొనుగోలు చేసిన ఏడాదిలోపే వాటిని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం గమనార్హం. కాగా, సైఫ్‌ అలీఖాన్‌కు ముంబైలోని బాంద్రా ప్రాంతంలోనూ నివాస ఆస్తులు ఉన్నాయి. బాంద్రా వెస్ట్‌లోని సత్‌గురు శరణ్‌ భవనంలో 6,500 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్‌ను 2012లో సుమారు రూ.23.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆస్తి పత్రాలు వెల్లడిస్తున్నాయి. గతంలో బాంద్రాలోని ఫార్చ్యూన్‌ హైట్స్‌లోనూ మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.  

ఇదీ చదవండి: అద్దెల ఆదాయం.. దీర్ఘకాలిక సంపదే లక్ష్యం!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0