అద్దెకు స్వస్తి.. సొంతింటి వైపు జెన్-జెడ్ అడుగులు
Despite rising property prices and interest rates, Gen Z is showing growing interest in owning homes.
ఇల్లు కొనాలంటే ముందుగా స్థిరపడాలి.. ఆ తర్వాతే ఆలోచించాలి అనే పాత ధోరణికి యువతరం క్రమంగా భిన్నంగా ఆలోచిస్తోంది. ముఖ్యంగా జెన్-జెడ్ లో సొంతింటిపై ఆసక్తి పెరుగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. పెరుగుతున్న ఇళ్ల ధరలు, అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో వచ్చే పెట్టుబడి లాభాలను సొంతింటి కొనుగోలుకు ఉపయోగించాలని యువత ఎక్కువగా యోచిస్తున్నట్టు అనరాక్ రియల్ ఎస్టేట్ హోమ్‌బయ్యర్ సర్వేలో వెల్లడైంది. వివిధ తరాలకు చెందిన పెట్టుబడిదారుల్లో 45 శాతం మంది తమ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలను ఇంటి కొనుగోలుకు వినియోగించాలని భావిస్తున్నారు.
ఇందులో మిలీనియల్స్ 71 శాతంతో ముందుండగా.. జెన్-జెడ్‌లో 49 శాతం మంది సొంతింటి కోసం పెట్టుబడి లాభాలను ఉపయోగించాలని చెప్పారు. జెన్-ఎక్స్‌లో 44 శాతం, బేబీ బూమర్స్‌లో 21 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే యువతలో ఇల్లు కేవలం నివాస అవసరంగా కాకుండా దీర్ఘకాలిక ఆస్తి, ఆర్థిక భద్రతకు మార్గంగా కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇతర పెట్టుబడుల్లో డబ్బు పెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో ఆ లాభాలను రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించే ఆలోచన కనిపిస్తోంది.
ఇంటితో పాటు వ్యాపారంపైనా ఆసక్తి
జెన్-జెడ్ ఆలోచనలో మరో ముఖ్యమైన అంశం వ్యాపారంపై ఆసక్తి. సర్వేలో 39 శాతం మంది జెన్-జెడ్ తమ పెట్టుబడి లాభాలను వ్యాపారం ప్రారంభించేందుకు ఉపయోగించాలని చెప్పారు. మిలీనియల్స్‌లో ఈ శాతం 21గా ఉంది. మొత్తంగా అన్ని తరాలను కలిపి చూస్తే 25 శాతం మంది పెట్టుబడి లాభాలను వ్యాపారానికి మళ్లించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో 17 శాతం మంది అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, 11 శాతం మంది పదవీ విరమణ కోసం నిధులు సమకూర్చుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేవలం 2 శాతం మంది మాత్రమే పెట్టుబడి లాభాలను విహారయాత్రలకు ఉపయోగించాలని పేర్కొన్నారు. 1997–2012 మధ్య జన్మించిన వారిని సాధారణంగా జెన్-జెడ్‌గా పరిగణిస్తారు. ఈ తరంలో ఇల్లు కొనుగోలు చేయడం, సొంత వ్యాపారం ప్రారంభించడం వంటి లక్ష్యాలకు ప్రాధాన్యం కనిపించింది. మరోవైపు 1981–1996 మధ్య జన్మించిన మిలీనియల్స్‌లో సొంతింటి కొనుగోలుపై అత్యధిక ఆసక్తి నమోదైంది. అదే సమయంలో వయసు పెరిగే కొద్దీ పెట్టుబడుల వినియోగంలో మార్పు కనిపిస్తోంది. జెన్-ఎక్స్ వర్గంలో 44 శాతం మంది ఇంటి కొనుగోలును లక్ష్యంగా పెట్టుకోగా.. బేబీ బూమర్స్‌లో అత్యధిక ప్రాధాన్యం అత్యవసర నిధులు, రిటైర్మెంట్ భద్రతకు ఉంది.
రియల్ ఎస్టేట్‌కు కొత్త తరం డిమాండ్
జెన్-జెడ్ సొంతింటి కోసం చూస్తున్నప్పటికీ.. వారి అవసరాలు పాతతరం కొనుగోలుదారులతో పోలిస్తే భిన్నంగా ఉండొచ్చని రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. పని చేసే ప్రదేశానికి దగ్గరగా ఉండటం, మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాలు, డిజిటల్ వర్కింగ్‌కు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు యువ కొనుగోలుదారులకు ప్రాధాన్యంగా మారుతున్నాయి. దీంతో డెవలపర్లు కూడా యువత అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0