ఫ్యూచర్ సిటీకి మాస్టర్ ప్లాన్ రెడీ?
The master plan for the proposed Future City in South Hyderabad, spread across approximately 1.80 lakh acres, is reportedly ready.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఐటీ, పారిశ్రామిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ కీలక ముందడుగు వేస్తోంది. దక్షిణ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక నగరాన్ని నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు సమాచారం.
సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ రూపొందించిన ఈ ప్రణాళికలో పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, విద్య, వైద్యం, ఏఐ, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలకు ప్రత్యేక జోన్లు ప్రతిపాదించారు. 71 రెవెన్యూ గ్రామాలు, ఏడు మండలాలు, సుమారు 867 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించనున్న ఈ ప్రాజెక్టు.. దాదాపు 1.80 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చెందనుంది.
అంటే ఇది కేవలం మరో ఐటీ హబ్ కాదు.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు, నివాసాలు, ఉపాధి, రవాణా, పర్యావరణాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చే భారీ పట్టణ ప్రణాళిక.
సింగపూర్ డిజైన్
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నగర విస్తరణను క్రమబద్ధీకరించడం, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.
2047 నాటికి పెరిగే జనాభా, పారిశ్రామిక అవసరాలు, రవాణా రద్దీని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కోర్టు ధిక్కరణ.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
లైఫ్ సైన్సెస్ నుంచి ఏఐ వరకు
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించేలా ప్రత్యేక పారిశ్రామిక జోన్లను ప్రతిపాదించారు.
ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. మరోవైపు ఉద్యోగులకు నివాస సౌకర్యాలు, నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా రెసిడెన్షియల్, హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌లను కూడా ప్రణాళికలో చేర్చారు.
ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపులు ఇలా:
అభివృద్ధి జోన్ ప్రతిపాదిత విస్తీర్ణం
లైఫ్ సైన్సెస్ హబ్ 4,000 ఎకరాలు
నివాస ప్రాంతాలు 2,477 ఎకరాలు
ఈవీ, ఎనర్జీ పార్కులు 1,976 ఎకరాలు
హెల్త్ సిటీ 594 ఎకరాలు
ఏఐ సిటీ 403 ఎకరాలు
డేటా సెంటర్ హబ్ 313 ఎకరాలు
ఎడ్యుకేషన్ హబ్ 255 ఎకరాలు
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రవాణా అనుసంధానత అత్యంత కీలకం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రేడియల్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులతో అనుసంధానం కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
కేవలం రోడ్ల నిర్మాణమే కాకుండా అంతర్గత రవాణా, పారిశ్రామిక లాజిస్టిక్స్, సరకు రవాణా వ్యవస్థలను కూడా సమన్వయం చేయనున్నారు. దీనివల్ల పరిశ్రమలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడం సులభతరం కానుంది.
ఇదీ చదవండి: నీటి వాడకంలో 20 శాతం కోత పెడితే 100 ఎంజీడీల నీరు ఆదా
పర్యావరణానికి పెద్దపీట.. రైతుల్లో టెన్షన్
భారీ పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించారు. చెరువులు, నాలాలు, అటవీ ప్రాంతాలు, సహజ జలవనరులను కాపాడేలా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు.
అయితే ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాల్లో భూయజమానులకు మాత్రం కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. తమ భూములు ఏ జోన్ పరిధిలోకి వస్తాయి? వ్యవసాయ భూముల పరిస్థితి ఏమిటి? భూసేకరణ ఉంటుందా? పరిహారం ఎలా నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు పర్యావరణ అనుమతులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లోనూ అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి కీలక సవాలుగా మారనుంది.
దక్షిణ హైదరాబాద్‌పై ఫోకస్
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌తో దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరోసారి ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్మాసిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, పారిశ్రామిక కారిడార్ల కారణంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులపై చర్చ జరుగుతోంది.
ఇప్పుడు ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ వంటి ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఉద్యోగ అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు, నివాస అవసరాలు పెరిగే అవకాశం ఉంది. జోనింగ్ నిబంధనలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, అనుమతులు, భూ వినియోగ మార్పులు, ప్రాజెక్టుల అమలు వేగం ఆధారంగానే వాస్తవికంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం ఉంటుంది.
మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌కు పశ్చిమ దిశలో ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక వృద్ధి ఇంజిన్‌గా మారితే.. దక్షిణ దిశలో ఫ్యూచర్ సిటీ మరో భారీ ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ కలల నగరం కేవలం మాస్టర్ ప్లాన్‌కే పరిమితం కాకుండా.. భూముల యజమానుల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అమలులో ఎంత పారదర్శకత చూపిస్తుందన్నదే అసలు పరీక్ష.
ఇదీ చదవండి: 50 ఎకరాల్లో అన్విత పార్క్‌సైడ్!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0