వాసవి రియల్టర్స్‌కు టీజీ రెరా షాక్‌..  10.70% శాతం వ‌డ్డీ క‌ట్టాల్సిందే..!

TG RERA has directed Vasavi Realtors LLP to pay 10.70% annual interest for delayed possession of a flat in the Vasavi Lake City West project in Hafeezpet, Hyderabad.

Aug 30, 2026 - 06:53
Aug 31, 2026 - 05:37
 0  18
వాసవి రియల్టర్స్‌కు టీజీ రెరా షాక్‌..  10.70% శాతం వ‌డ్డీ క‌ట్టాల్సిందే..!
tg-rera-vasavi-realtors-10-70-percent-interest-delayed-possession
* యాభై మందికి పైగా ఫిర్యాదులు
* పొజిషన్ ఆలస్యంపై చర్యలు.. 
 
హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లోని వాసవి లేక్ సిటీ వెస్ట్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి పొజెషన్‌ ఆలస్యం చేసినందుకు వాసవి రియల్టర్స్ ఎల్ఎల్‌పీ 10.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే 50కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంటూ.. ఇకపై నిబంధనలు పాటించకపోతే రెరా చట్టంలోని సెక్షన్‌ 63 కింద చర్యలు తీసుకుంటామని డెవలపర్‌ను హెచ్చరించింది.
 
అసలేం జరిగింది?
ఫిర్యాదుదారుడు పైడి రాజేంద్ర అల్లంకి 2021 జూలైలో వాసవి లేక్ సిటీ వెస్ట్‌లోని టవర్‌-5లో 2,240 చదరపు అడుగుల ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం 2023 ఆగస్టు 31లోపు ఫ్లాట్‌ పొజెషన్‌ ఇవ్వాలి. దీనికి అదనంగా ఆరు నెలల గ్రేస్‌ పీరియడ్‌ కూడా ఉంది. ఫ్లాట్‌ కోసం కొనుగోలుదారుడు సుమారు రూ.1.12 కోట్లు చెల్లించారు.
స్టాంప్‌ డ్యూటీ, జీఎస్టీ, కార్పస్‌ ఫండ్‌, అడ్వాన్స్‌ మెయింటెనెన్స్‌ తదితరాలకు మరో రూ.16.08 లక్షలు చెల్లించారు. అయితే 2024 జనవరిలో ఫ్లాట్‌ ఆయన పేరుపై రిజిస్టర్‌ చేసినప్పటికీ.. చట్టబద్ధమైన పొజెషన్‌ మాత్రం ఇవ్వలేదు. ఇంకా ఫ్లాట్‌లో బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌, నీటి కనెక్షన్‌, డ్రైనేజీ, విద్యుత్‌ మీటర్లు, ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌, పార్కింగ్‌, కామన్‌ ఏరియాలు వంటి అనేక పనులు పూర్తికాలేదని కొనుగోలుదారుడు ఆరోపించారు.
దీనిపై డెవలపర్‌ స్పందిస్తూ.. కోవిడ్‌ కారణంగా పనులు ఆలస్యమయ్యాయని, కార్మికులు వలస వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. అయితే ఈ వాదనను టీజీ రెరా  అంగీకరించలేదు. రెరా రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించడం లేదా టీజీ రెరా పోర్టల్‌లో కొత్త పొజెషన్‌ తేదీని నమోదు చేయడం వల్ల.. కొనుగోలుదారుతో చేసుకున్న అగ్రిమెంట్‌లో ఉన్న అసలు పొజెషన్‌ తేదీ మారదని అథారిటీ స్పష్టం చేసింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ అయిపోయిందంటేనే చట్టబద్ధమైన పొజిషన్‌ ఇచ్చినట్లు కాదని టీజీ రెరా స్పష్టం చేసింది. నిర్మాణం పూర్తి కాకపోతే, అవసరమైన ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ లేకపోతే.. పొజెషన్‌ పూర్తయినట్లుగా పరిగణించలేమని పేర్కొంది. అయితే కొనుగోలుదారుడు ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.  దీంతో ఆయన చెల్లించిన మొత్తంపై 2024 మార్చి 1 నుంచి చట్టబద్ధమైన పొజిషన్‌ ఇచ్చే వరకు 10.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని టీజీ రెరా ఆదేశించింది. 
వడ్డీ బకాయిలను 60 రోజుల్లోపు చెల్లించ‌డంతో పాటు ఆ తర్వాత కూడా పొజెషన్‌ ఇచ్చే వరకు ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని ఆదేశాల్ని జారీ చేసింది.  ప్రాజెక్టులో మిగ‌తా పనుల్ని పూర్తి చేసి.. చట్టబద్ధమైన గడువులోపు కొనుగోలుదారులకు ఫ్లాట్ల‌ను అప్ప‌గించాల‌ని ఆదేశించింది. ఇకపై మరోసారి నిబంధనలు ఉల్లంఘించినా, ఆదేశాలను పాటించకపోయినా లేదా కొనుగోలుదారుల నుంచి మరిన్ని ఫిర్యాదులు వచ్చినా.. రెరా చట్టంలోని సెక్షన్‌ 63 కింద చర్యల్ని తీసుకుంటామని టీజీ రెరా ఘాటుగా హెచ్చరించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0