పసిఫికా కన్‌స్ట్రక్షన్స్‌పై తెలంగాణ రెరా కొరడా
Telangana RERA has initiated penalty proceedings against Pacifica Constructions Pvt. Ltd. for allegedly booking and allotting a flat in its Aavas Hyderabad project in Miyapur before the project received RERA registration.
- రిజిస్ట్రేషన్‌కు ముందే ఫ్లాట్ కేటాయింపులు.. జరిమానా చర్యలకు ఆదేశాలు
- కొనుగోలుదారుల ఫిర్యాదుతో వెలుగులోకి ఉల్లంఘనలు
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పసిఫికా కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్పై టీజీ రెరా కొరడా ఝలిపించింది. ప్రాజెక్టును రిజిస్ట్రేషన్ చేయకముందే ఫ్లాట్‌ను బుక్ చేసి కేటాయించడం ద్వారా రియల్ ఎస్టేట్ (రెరా) చట్టంలోని సెక్షన్-3ను ఉల్లంఘించినట్లు అథారిటీ గుర్తించి చర్యలకు ఉపక్రమించింది.
మియాపూర్‌కు చెందిన 'ఆవాస్ హైదరాబాద్' ప్రాజెక్టులో 2017లోనే ఓ ఫ్లాట్‌ను బుక్ చేసి కేటాయించినట్లు విచారణలో తేలింది. అయితే ఈ ప్రాజెక్టుకు టీజీ-రెరా నమోదు మాత్రం 2019లో లభించింది. రెరా చట్టం ప్రకారం ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టునైనా నమోదు చేసుకునే వరకు ప్రచారం, బుకింగ్, విక్రయాలు లేదా కేటాయింపులు చేయడం నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘించినందున పసిఫికా కన్‌స్ట్రక్షన్స్‌పై జరిమానా ప్రక్రియ చేపట్టాలని రెరా ఆదేశించింది.
కొనుగోలుదారుల ఫిర్యాదు
బాచుపల్లికి చెందిన నితికా శరాఫ్, విశాల్ శరాఫ్ దంపతులు టీజీ-రెరాను ఆశ్రయించారు. 2019 ఏప్రిల్ 15న విక్రయ ఒప్పందం కుదిరిందని, 60 నెలల్లో ఫ్లాట్‌ను అప్పగిస్తామని బిల్డర్ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ 2024 ఏప్రిల్ నాటికి ఫ్లాట్‌ను అందజేయలేదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిర్మాణ నాణ్యత కూడా సరిగా లేదని ఆరోపించారు. గోడలు, పైకప్పు, తలుపుల్లో లోపాలు ఉన్నాయని, స్వతంత్ర నిపుణులతో నాణ్యత తనిఖీ చేయించాలని కోరారు. ఫిర్యాదుదారులు మరికొన్ని అంశాలను కూడా రెరా దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో ఫ్లాట్ బుక్ చేసిన వ్యక్తికి సంబంధించిన జరిమానాలను తమపై మోపేందుకు ప్రయత్నించారని, ఉచితంగా ఇస్తామని చెప్పిన క్లబ్ సభ్యత్వానికి తర్వాత ఛార్జీలు వసూలు చేయాలని చూశారని ఆరోపించారు. అలాగే నిర్వహణ ఛార్జీలను చదరపు అడుగుకు రూ.1.25 నుంచి రూ.3.60కు పెంచారని, అనుమతించిన లేఅవుట్‌కు భిన్నంగా బేస్‌మెంట్ పార్కింగ్‌లో మార్పులు చేశారని కూడా పేర్కొన్నారు.
అయితే, పసిఫికా కన్‌స్ట్రక్షన్స్ ఈ ఆరోపణలను ఖండించింది. కోవిడ్-19 కారణంగా ప్రాజెక్టు గడువును 18 నెలలు పొడిగించారని, అందువల్ల ఆలస్యం జరిగిందని తెలిపింది. 2025 సెప్టెంబర్‌లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభించిందని, అదే ఏడాది డిసెంబర్‌లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ కూడా పూర్తి చేశామని వాదించింది. ఫ్లాట్‌ను కొనుగోలుదారులు స్వీకరించిన తర్వాత నష్టపరిహారం కోరడం సరికాదని పేర్కొంది
ఫ్లాట్‌కు ఇప్పటికే రిజిస్టర్డ్ సేల్ డీడ్ పూర్తయినందున స్వాధీనం ఇవ్వాలన్న డిమాండ్ ప్రస్తుతం వర్తించదని టీజీ-రెరా పేర్కొంది. అయితే గత కేటాయింపుదారుకు సంబంధించిన పెనాల్టీలను కొత్త కొనుగోలుదారుల నుంచి వసూలు చేయరాదని స్పష్టం చేసింది. అదే సమయంలో, ప్రాజెక్టు నమోదు పొందకముందే ఫ్లాట్‌ను బుక్ చేసి కేటాయించడం చట్ట విరుద్ధమని తేల్చి, డెవలపర్‌పై జరిమానా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0