అనధికార నిర్మాణాలకు ‘ప్రీమియం ఎఫ్‌ఏఆర్’తో చట్టబద్ధత వద్దు
The Supreme Court has clarified that unauthorised buildings cannot be regularised through Premium FAR (Floor Area Ratio).
- సుప్రీంకోర్టు స్పష్టీకరణ
అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ప్రీమియం ఎఫ్‌ఏఆర్ (ఫ్లోర్ ఏరియా రేషియో) ద్వారా క్రమబద్ధీకరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీమియం ఎఫ్‌ఏఆర్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టంలోని సెక్షన్ 18-బీ కింద ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అదనపు నిర్మాణ హక్కులు పొందే విధానాన్ని తీసుకొచ్చింది.
2025 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా నిర్ణీత నిబంధనలకు లోబడి భవనాల్లో అదనపు ఫ్లోర్ ఏరియాను నిర్మించుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ విధానం గతంలో ఉన్న ‘అక్రమ-సక్రమ’ తరహా అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు పరోక్ష మార్గంగా మారే అవకాశం ఉందని ‘సిటిజన్స్ యాక్షన్ ఫోరం’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రీమియం ఎఫ్‌ఏఆర్‌కు రోడ్డు వెడల్పును ప్రధాన ప్రమాణంగా మార్చడం వల్ల బెంగళూరులో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న రోడ్లు, ట్రాఫిక్, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై మరింత భారం పడుతుందని పిటిషనర్లు వాదించారు.
ప్రస్తుత విధానం ప్రకారం కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్థలాలకు అదనపు ఎఫ్‌ఏఆర్ పొందే అవకాశం ఉంది. 9 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లకు ఆనుకుని ఉన్న స్థలాల్లో నిర్దిష్ట పరిమితుల్లో అదనపు నిర్మాణ హక్కులు పొందవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. గరిష్ఠంగా సాధారణ ఎఫ్‌ఏఆర్‌లో 0.6 రెట్లు అదనపు ఎఫ్‌ఏఆర్ పొందే అవకాశం ఉందని కోర్టు ముందు వివరించారు. ఇందులో ప్రీమియం ఎఫ్‌ఏఆర్ ద్వారా 0.4 వరకు, మిగిలిన 0.2ను టిడీఆర్ ద్వారా వినియోగించే విధానం ఉందని వివరించారు.
అయితే, అదనపు అంతస్తులు నిర్మించేందుకు అనుమతులు ఇస్తున్నప్పుడు నీరు, విద్యుత్, పార్కింగ్, మురుగునీటి వ్యవస్థ, రహదారులు వంటి మౌలిక వసతులు సరిపోతున్నాయా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మౌలిక వసతులను పెంచకుండా ఒకే స్థలంలో అంతస్తుల సంఖ్యను పెంచితే భవిష్యత్తులో అక్కడ నివసించే కుటుంబాలే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మౌలిక వసతుల సామర్థ్యానికి మించి జనాభా, నిర్మాణాలు పెరగడం సమస్యగా మారవచ్చన్న ఆందోళనను ధర్మాసనం వ్యక్తం చేసింది. గ్రేటర్ నోయిడా వంటి ప్రణాళికాబద్ధ నగరాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చిన విధానాన్ని సీజేఐ ప్రస్తావించారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ విధానం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చింది కాదని స్పష్టం చేసింది. అదనపు ఎఫ్‌ఏఆర్ పొందినా పార్కింగ్, సెట్‌బ్యాక్ తదితర తప్పనిసరి నిబంధనల నుంచి మినహాయింపు ఉండదని తెలిపింది.
ఈ విధానం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక మౌలిక వసతుల నిధికి మళ్లించి పట్టణ సదుపాయాలను మెరుగుపరుస్తామని కోర్టుకు వివరించింది. పట్టణాల్లో స్థలం పరిమితంగా ఉన్నందున నిలువుగా అభివృద్ధి చేయడం అవసరమని కూడా ప్రభుత్వం వాదించింది. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ, తుది తీర్పు వచ్చే వరకు ప్రీమియం ఎఫ్‌ఏఆర్‌ను ఉపయోగించి అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించరాదని మధ్యంతరంగా ఆదేశించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0