- 10 వేల చదరపు అడుగుల డూప్లెక్స్‌లో ఆధునికత–సంప్రదాయం సమ్మేళనం
- ఆర్ట్, సహజ కాంతి, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్‌పుత్ నివసిస్తున్న ముంబై విలాసవంతమైన నివాసం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా నిర్వహించిన ప్రత్యేక హోమ్ టూర్‌లో ఈ జంట తమ ఇంటి తలుపులు ప్రేక్షకుల కోసం తెరిచారు.
సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నాలుగు బెడ్‌రూమ్‌ల డూప్లెక్స్ ఇంటి రూపకల్పన, అలంకరణ, కళాత్మకత, కుటుంబ జీవనశైలి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముంబైలోని వర్లీలో ఉన్న ఈ డూప్లెక్స్ ఇంటి ప్రధాన ఆకర్షణ సహజ కాంతి. ఇంటి ప్రతి మూలలో సూర్యరశ్మి ప్రసరించేలా పెద్ద గాజు కిటికీలు, ఓపెన్ స్పేస్‌లను ఏర్పాటు చేశారు. నలుపు రంగు జ్యామితీయ మెట్లు ఇంటి మధ్యభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ మెట్ల చుట్టూ లివింగ్, డైనింగ్, కుటుంబ సభ్యుల కోసం విశాలమైన ప్రదేశాలను తీర్చిదిద్దారు.
మీరా అభిరుచి.. షాహిద్ అభిప్రాయం
ఇంటి ఇంటీరియర్ రూపకల్పనలో మీరా, షాహిద్ ఇద్దరి అభిరుచులకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. మీరాకు ప్రకాశవంతమైన, సహజ వెలుతురుతో కూడిన వాతావరణం ఇష్టమైతే.. షాహిద్‌కు మసకబారిన, ఆహ్లాదకరమైన లైటింగ్ అంటే ఇష్టం. ఈ రెండు అభిరుచులను సమన్వయం చేస్తూ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంటి సీలింగ్ డిజైన్‌పైనే మొత్తం బడ్జెట్‌లో గణనీయమైన భాగం ఖర్చు చేశామని మీరా వెల్లడించారు.
ఇంట్లో కనిపించే అనేక అలంకరణ వస్తువులు విదేశీ పర్యటనల నుంచి తెచ్చినవేని చెప్పారు. స్పెయిన్, ఇటలీ, ఇంగ్లండ్, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ తదితర ప్రాంతాల నుంచి సేకరించిన టేబుల్ అలంకరణలు, కాఫీ టేబుల్ పుస్తకాలు, శిల్పాలు, కళాఖండాలు ఇంటికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. మీరా తండ్రి సేకరించిన పుస్తకాలతో రూపొందించిన లైబ్రరీ కార్నర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీరా రాజ్‌పుత్ కళాప్రియురాలు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆమె స్వయంగా కొనుగోలు చేసిన ప్రముఖ శిల్పి రాధాకృష్ణన్ రూపొందించిన శిల్పాన్ని ఏర్పాటు చేశారు. అలాగే యువ కళాకారుల పెయింటింగ్‌లు, సుభోధ్ కెర్కర్ రూపొందించిన ప్రత్యేక కళాఖండాలు డైనింగ్ ఏరియాలో అలంకరించారు. ఇంటి ప్రతి గోడ ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీని తలపించేలా ఉంటుంది.
కుటుంబం కోసం ప్రత్యేక ప్రదేశాలు
ఇంటి పై అంతస్తులో అతిథుల కోసం ప్రత్యేక గది, మీరా కోసం గ్లామ్ రూమ్, షాహిద్ కోసం కార్యాలయం, హోమ్ థియేటర్, డీజే కన్సోల్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిన్న ప్యాంట్రీ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పిల్లలు మీషా, జైన్ ఆడుకునేందుకు విశాలమైన ప్రదేశం కూడా కేటాయించారు. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి గడిపేలా ఇంటి ప్రణాళిక రూపొందించారు.
ప్రకృతి రంగులే ప్రధాన థీమ్
తెలుపు, బూడిద, చెక్క రంగుల కలయికతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. ఇంట్లో తాజా పూలు, ఇండోర్ మొక్కలు, సహజ పదార్థాలతో తయారైన ఫర్నిచర్, శిల్పాకృతుల లైట్లు ఇంటికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. విలాసవంతమైన ఇంటైనా అతిగా అలంకరించకుండా, సౌకర్యవంతమైన కుటుంబ గృహంలా కనిపించేలా డిజైన్ చేశారు.
ఈ ఇంటి ఇంటీరియర్ రూపకల్పన బాధ్యతలను ప్రముఖ డిజైనర్ అంకుర్ ఖోస్లాకు అప్పగించారు. తమ అభిరుచులను అర్థం చేసుకుని, కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఇంటిని రూపొందించారని షాహిద్–మీరా తెలిపారు. సంప్రదాయం, ఆధునికత రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రతి మూలను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులు తమ ఇళ్లను కేవలం విలాసవంతమైన నివాసాలుగా కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. షాహిద్–మీరా నివాసం కూడా అదే కోవకు చెందినదిగా డిజైన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కళ, కుటుంబ జీవనం, సహజ వాతావరణం, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా ఈ ఇల్లు నిలిచిందని పేర్కొంటున్నారు.