పార్కింగ్‌ డిపాజిట్‌ తిరిగివ్వాల్సిందే!

The Mumbai Cooperative Court has ruled that housing societies cannot retain parking deposits merely by labelling them “non-refundable”.

Oct 27, 2026 - 04:27
Oct 28, 2026 - 07:16
 0  74
పార్కింగ్‌ డిపాజిట్‌ తిరిగివ్వాల్సిందే!
పార్కింగ్‌ డిపాజిట్‌ తిరిగివ్వాల్సిందే: ముంబై కోర్టు కీలక తీర్పు.
  • ‘నాన్‌ రిఫండబుల్‌’ అని పేరు పెట్టినంత మాత్రాన డబ్బు ఉంచుకోలేరు
  • ముంబై కోర్టు కీలక తీర్పు

ఫ్లాట్‌ కొనుగోలు చేసేటప్పుడు లేదా యాజమాన్య బదిలీ సమయంలో అపార్ట్‌మెంట్‌ సొసైటీలు వసూలు చేసే పార్కింగ్‌ డిపాజిట్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక మొత్తానికి ‘నాన్‌ రిఫండబుల్‌’ (తిరిగి చెల్లించనవసరం లేనిది) అని పేరు పెట్టినంత మాత్రాన దాన్ని శాశ్వతంగా తమ వద్దే ఉంచుకోలేరని ముంబై కోఆపరేటివ్‌ కోర్టు స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని నిలుపుకోవడానికి చట్టబద్ధమైన కారణాలు, ఆధారాలు ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు కాందివలిలోని ఓ హౌసింగ్‌ సొసైటీ ఇద్దరు సభ్యులకు రూ.50 వేల పార్కింగ్‌ డిపాజిట్‌ను 6 శాతం వార్షిక సాధారణ వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ముంబైలోని కాందివలి వెస్ట్‌లో ఉన్న ఆర్‌ఎన్‌ఏ రీజెన్సీ పార్క్‌ టవర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో జిగ్నేశ్‌ ఖిరాయా, కుసుమ్‌ కె. ఖిరాయా అనే దంపతులు ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. 2017 జూన్‌లో ఫ్లాట్‌ యాజమాన్య బదిలీ సమయంలో స్టిల్ట్‌ పార్కింగ్‌ కోసం రూ.75 వేల నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్‌ను చెల్లించారు.

ఫ్లాట్‌ బదిలీ ప్రీమియంగా మరో రూ.25 వేలు కూడా చెల్లించినట్లు వారు తెలిపారు. అయితే, పార్కింగ్‌ డిపాజిట్‌గా తీసుకున్న రూ.75 వేల మొత్తంలో రూ.25 వేలను మాత్రమే సొసైటీ వారి మెయింటెనెన్స్‌ ఖాతాలో జమ చేసింది.

మిగిలిన రూ.50 వేల మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన దంపతులు, ఆ మొత్తాన్ని నిలుపుకోవడానికి సొసైటీకి చట్టబద్ధమైన హక్కు లేదని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు.

పార్కింగ్‌ డిపాజిట్ల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని భవనంలోని ప్రధాన మరమ్మతుల కోసం వినియోగించామని సొసైటీ కోర్టుకు తెలిపింది. ఈ పనుల కోసం సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అయితే, ఆ ఖర్చులకు సంబంధించిన వాదనను నిరూపించే పత్రాలను సమర్పించలేకపోయింది.

ఇదీ చదవండి: భారత రియల్‌ ఎస్టేట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు

చట్టబద్ధమైన ఆధారాలు లేవు: కోర్టు 

దంపతులు సమర్పించిన రసీదులు, సొసైటీ సర్వసభ్య సమావేశ తీర్మానం, ఇరుపక్షాల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించిన కోర్టు.. రూ.50 వేల మొత్తాన్ని నిలుపుకోవడానికి తగిన చట్టబద్ధమైన ఆధారాలు లేవని నిర్ధారించింది.

సొసైటీ రిజిస్టర్డ్‌ బైలాస్‌ (నిబంధనలు), ప్రత్యేక ఒప్పందం లేదా ప్రతిఫలంగా అందించిన సేవల ఆధారంగా కూడా ఈ వసూలును సమర్థించలేకపోయిందని పేర్కొంది. సొసైటీలో సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానం ఉందనే కారణంతో చట్టం అనుమతించని మొత్తాలను సభ్యుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఫ్లాట్‌ యాజమాన్య బదిలీకి సంబంధించిన వసూలును పార్కింగ్‌ డిపాజిట్‌గా పేర్కొన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదని తెలిపింది. అనధికారికంగా వసూలు చేసిన మొత్తాలను భారత కాంట్రాక్టు చట్టం, 1872లోని సెక్షన్‌ 72 ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సెప్టెంబరు 22న తీర్పు వెలువరించింది.

దంపతులకు రూ.50 వేలతో పాటు, వారు 2022 జనవరి 30న తిరిగి చెల్లించాలని కోరుతూ రాతపూర్వకంగా డిమాండ్‌ చేసిన తేదీ నుంచి మొత్తం చెల్లించే వరకు ఏడాదికి 6 శాతం సాధారణ వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. అలాగే వారి న్యాయపరమైన ఖర్చులను కూడా సొసైటీ భరించాలని తెలిపింది.

ఇదీ చదవండి: లగ్జరీ టవర్‌ నిర్మాణంపై వివాదం

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0