ఫ్లాట్ అప్పగింతలో జాప్యం.. బిల్డర్ 9% వడ్డీ చెల్లించాల్సిందే
The Mohali District Consumer Disputes Redressal Commission has directed Janta Land Promoters to pay 9% annual interest on ₹42.13 lakh paid by a homebuyer for delaying flat possession and failing to obtain the required Occupancy Certificate (OC) and Completion Certificate (CC).
- రూ.42.13 లక్షలపై వడ్డీతో పాటు రూ.75 వేల పరిహారం..
- ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఫ్లాట్‌ను అప్పగించినంత మాత్రాన సరిపోదు.. దానికి అవసరమైన ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్లు కూడా ఉండాలని మొహాలి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది.
అనుమతులు లేకుండా ఫ్లాట్‌ను అప్పగించిన జంటా ల్యాండ్ ప్రమోటర్స్ సంస్థ.. గృహ కొనుగోలుదారు చెల్లించిన రూ.42.13 లక్షలపై ఏడాదికి 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా మానసిక వేదన, వేధింపులు, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.75 వేల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.
మొహాలిలోని సెక్టార్ 66-ఏలో జంటా ల్యాండ్ ప్రమోటర్స్ సంస్థ ‘గెలాక్సీ హైట్స్’ పేరుతో నివాస ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టులోని బి టవర్‌లో 1,050 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కుల్దీప్ సింగ్ కొనుగోలు చేశారు. అసలు కేటాయింపు పత్రం ప్రకారం 2015 ఆగస్టు 1నుంచి 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్‌ను అప్పగించాలి. అంటే 2018 జులై 30 నాటికి స్వాధీనం చేయాల్సి ఉంది.
అయితే, ఫిర్యాదుదారుడికి 2023 మార్చి 10న మాత్రమే ఫ్లాట్‌ను అప్పగించారు. ఫ్లాట్‌లో నిర్మాణ లోపాలు ఉన్నాయని, ప్రాజెక్టు బ్రోచర్లో హామీ ఇచ్చిన సదుపాయాలు కల్పించలేదని కుల్దీప్ సింగ్ ఆరోపించారు.
అవసరమైన ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందకుండానే నిర్వహణ ఛార్జీలు వసూలు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. బిల్డర్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను సమర్పించలేకపోయిందని గుర్తించింది.
2026 మార్చి 23 నాటి సమాచారం ప్రకారం, బి టవర్‌కు సంబంధించిన పాక్షిక కంప్లీషన్ సర్టిఫికెట్ దరఖాస్తు పరిశీలనలోనే ఉంది. దీంతో అవసరమైన అనుమతులు లేకుండా ఫ్లాట్‌ను అప్పగించడం చట్టబద్ధమైన స్వాధీనంగా పరిగణించలేమని కమిషన్ పేర్కొంది.
ఇదీ చదవండి: షాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త ఆధ్యాత్మిక హబ్..
మూడునెలల్లో సదుపాయాలు కల్పించాలి
ప్రాజెక్టు బ్రోచర్, ఒప్పందాల్లో హామీ ఇచ్చిన అన్ని ప్రాథమిక సదుపాయాలను కల్పించాలని కమిషన్ బిల్డర్‌ను ఆదేశించింది. ఫ్లాట్‌లోని నిర్మాణ లోపాలను సరిచేయడంతో పాటు, సంబంధిత అధికారుల నుంచి ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందాలని స్పష్టం చేసింది.
తీర్పు ధ్రువీకరించిన ప్రతిని అందుకున్నప్పటి నుంచి మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఫ్లాట్‌కు తొలుత కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని కూడా తిరిగి అందించాలని ఆదేశించింది.
ఫిర్యాదుదారు సమర్పించిన ఫొటోల్లో ఆయనకు కేటాయించిన పార్కింగ్ స్థలం ఇతర స్థలాల కంటే ఇరుకుగా ఉన్నట్లు కనిపించిందని, దీనికి సంబంధించి ఆమోదించిన పార్కింగ్ ప్రణాళికను బిల్డర్ సమర్పించలేకపోయిందని కమిషన్ తెలిపింది.
ఫ్లాట్ కోసం చెల్లించిన రూ.42,13,678పై 2018 జులై 30 నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన తుది ఆక్యుపెన్సీ, కంప్లీషన్ సర్టిఫికెట్లు పొందే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీ చెల్లించాలని తీర్పులో పేర్కొంది. దీనికి అదనంగా రూ.75 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ప్రీలాంచ్లో ఫుల్ సేల్స్.. రెరా తర్వాత నిల్ సేల్స్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0