సమస్యల ఫ్లాట్.. బైబ్యాక్ ఉంటుందా?

The Maharashtra Real Estate Regulatory Authority (MahaRERA) rejected a homebuyer’s plea seeking a buyback of his flat along with a refund and interest, after he complained of repeated water seepage, dampness, plaster cracks, poor waterproofing and finishing defects.

Sep 11, 2026 - 00:48
 0  3
సమస్యల ఫ్లాట్.. బైబ్యాక్ ఉంటుందా?
maharera-flat-buyback-rera-homebuyer-complaint
  • రెరా ఏం చెబుతోంది?

ఫ్లాట్‌లో పదేపదే నీటి లీకేజీలు, గోడల్లో తేమ, ప్లాస్టర్ పగుళ్లు, నాణ్యత లేని ఫినిషింగ్‌ వంటి సమస్యలు ఉన్నాయని ఆరోపిస్తూ.. డెవలపర్ తన ఫ్లాట్‌ను తిరిగి కొనుగోలు చేసి డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని కోరిన ఓ ఇంటి కొనుగోలుదారుడికి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా)లో చుక్కెదురైంది. డెవలపర్‌ను ఫ్లాట్‌ను ‘బైబ్యాక్’ చేయాలని ఆదేశించడం రెరా పరిధిలోని ఉపశమనాల్లో లేదని, అలాగే లీకేజీకి నిర్మాణ లోపమే కారణమని నిరూపించే తగిన ఆధారాలను కొనుగోలుదారు సమర్పించలేకపోయారని పేర్కొంటూ ఫిర్యాదును మహారేరా కొట్టివేసింది.

ముంబై సమీపంలోని ఓ ప్రాజెక్టులో ఫిర్యాదుదారు సుమారు రూ.30 లక్షలకు ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 2021 జూన్ 30న ఆ ఫ్లాట్‌కు స్వాధీనం తీసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత ఇంట్లో గోడలు, పైకప్పుల్లో తేమ, నీటి చొరబాటు, ప్లాస్టర్ పగుళ్లు వంటి సమస్యలు మొదలయ్యాయని మహారెరాను ఆశ్రయించారు. ఫ్లాట్‌లో వాటర్ సీపేజ్, డ్యాంప్‌నెస్, సరైన వాటర్‌ప్రూఫింగ్ లేకపోవడం, ప్లాస్టర్ క్రాక్స్, ఫినిషింగ్‌లో లోపాలు కనిపించాయని.. ఈ సమస్యలు సాధారణ మరమ్మతులతో పరిష్కరించలేనివని, ఫ్లాట్‌లో ఉండటం ఇబ్బందిగా మారిందని ఆయన వాదించారు.

అయితే, ఫ్లాట్‌ను 2021 జూన్‌లో స్వాధీనం చేసుకున్నప్పటికీ, నీటి లీకేజీపై మొదటి ఫిర్యాదు 2022 సెప్టెంబర్‌లో, అంటే దాదాపు 15 నెలల తర్వాత చేసినట్లు మహారేరా గుర్తించింది.  కొనుగోలుదారు సమస్యలను చూపిస్తూ ఫొటోలను సమర్పించినప్పటికీ, ఆ ఫొటోలు మాత్రమే లీకేజీకి అసలు కారణం ఏమిటి? అది నిర్మాణ లోపం వల్లే వచ్చిందా? డెవలపర్ పనితీరులో లోపం ఉందా? అనే విషయాలను నిర్ధారించడానికి సరిపోవని అథారిటీ అభిప్రాయపడింది.

కొనుగోలుదారు ఆరోపణలను డెవలపర్ ఖండించాడు. ఫ్లాట్‌లోకి నీరు రావడానికి నిర్మాణ నాణ్యత లోపం కారణం కాదని, పై అంతస్తులోని ఫ్లాట్‌లో బాత్రూమ్‌కు సంబంధించిన లీకేజీ, అలాగే బాల్కనీలో వర్షపు నీరు చేరడం వంటి కారణాలు ఉండొచ్చని వాదించాడు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత ఫ్లాట్లలో పరిశీలనలు నిర్వహించి, అవసరమైన చోట రిపేర్, రెక్టిఫికేషన్ పనులు చేపట్టినట్లు డెవలపర్ మహారేరాకు తెలిపాడు. అంతేకాకుండా, పై ఫ్లాట్‌లో నివసించే వ్యక్తితో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కొనుగోలుదారుకు సూచించినప్పటికీ, ఆయన అవసరమైన చర్యలు తీసుకోలేదని డెవలపర్ ఆరోపించాడు.

కన్సిలియేషన్ ప్రక్రియలో కూడా మరమ్మతుల కోసం కొనుగోలుదారు పూర్తిస్థాయిలో సహకరించలేదని డెవలపర్ వాదించాడు. దీనికి మద్దతుగా జాబ్ కార్డులు, ఈమెయిల్ కమ్యూనికేషన్లు, చేపట్టిన మరమ్మతుల వివరాలను సమర్పించాడు. వాదనలు విన్న రెరా.. ఇంట్లో తేమ లేదా నీటి మరకలు ఉన్నాయని చూపించే ఫొటోలు సమర్పించినంత మాత్రాన అవి నిర్మాణ లోపం వల్లే ఏర్పడ్డాయని నిర్ధారించలేమని అభిప్రాయపడింది. కొనుగోలుదారు తరఫున సాంకేతిక పరిశీలన నివేదిక, స్వతంత్ర నిపుణుడి అభిప్రాయం, ఇంజినీరింగ్ అసెస్‌మెంట్ లేదా నిర్మాణ లోపాన్ని నిర్ధారించే ఇతర ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో డెవలపర్‌ను ఫ్లాట్ బైబ్యాక్ చేయమని ఆదేశించడం రెరా చట్టం కింద మహారేరా ఇవ్వగల ఉపశమనాల పరిధిలో లేదని అథారిటీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, స్వాధీనం తీసుకున్న తర్వాత కూడా ఫ్లాట్‌లో కొనసాగుతున్న పరిస్థితుల్లో లావాదేవీని రద్దు చేసి మొత్తం డబ్బును తిరిగి ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0