ఆధునిక జీవనశైలికి భారతీయ నిర్మాణ శైలుల మేళవింపు
Architect V. Suresh Kumar, Principal Architect at Vaid Architects and Interiors, believes that good architecture balances tradition, comfort and sustainability.
- సంప్రదాయం, సౌకర్యం, సుస్థిరత కలిస్తేనే మంచి ఆర్కిటెక్చర్
- వాస్తుశిల్పి వి. సురేశ్ కుమార్
భారతీయ సంప్రదాయ నిర్మాణ శైలులను ఆధునిక జీవన అవసరాలకు అనుగుణంగా మలచడం అనేది మన సాంస్కృతిక వారసత్వం, మారుతున్న జీవనశైలి, ఆయా ప్రదేశాల్లో నివసించే ప్రజల అవసరాలపై అవగాహనతో కూడుకున్నది. సంప్రదాయ విలువలను కాపాడుతూనే.. సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన, పరిసరాలకు అనుగుణమైన నిర్మాణాలను రూపొందించడమే తన లక్ష్యమని ప్రముఖ వాస్తుశిల్పి వి. సురేశ్ కుమార్ చెబుతున్నారు.
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌వీసీఏ)లో చదివిన ఆయన.. 2008లో బంగారు పతకం సాధించారు. అనంతరం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎం.ఆర్క్ పూర్తి చేశారు. అదే ఏడాది తన భార్య ఐశ్వర్యతో కలిసి ‘వైద్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్’ సంస్థను స్థాపించారు. ఇందులో ఆయన ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్‌గా, ఐశ్వర్య ప్రిన్సిపల్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఐశ్వర్య.. అందం, రోజువారీ అవసరాలకు మధ్య సమతుల్యతను సాధించే ఇంటీరియర్ డిజైన్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగి ఉన్నారు.
30 మందికి పైగా నిపుణులతో కూడిన ఈ సంస్థ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ప్లానింగ్, త్రీడీ విజువలైజేషన్ వంటి విభాగాల్లో సేవలందిస్తోంది. నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, హోటళ్లు, విద్యాసంస్థలు, పారిశ్రామిక, ఇతర సంస్థాగత నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులను చేపడుతోంది.
క్లయింట్ల అవసరాలే ప్రాధాన్యం
సురేశ్ కుమార్ దృష్టిలో ప్రతి డిజైన్ రూపకల్పనకు ముందు క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కుటుంబ జీవనశైలి, బడ్జెట్, రోజువారీ అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిజైన్‌ను రూపొందిస్తారు. కొందరు ఆధునిక, మినిమలిస్ట్ శైలులను కోరుకుంటే.. మరికొందరు విలాసవంతమైన ఇంటీరియర్లను ఇష్టపడతారు. ప్రదేశం వినియోగం, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా డిజైన్‌లో మార్పులు ఉంటాయి. ‘‘క్లయింట్ల ఆకాంక్షలు, చుట్టూ ఉన్న పర్యావరణం, స్థానిక పరిస్థితులు, ప్రజలు ఒక ప్రదేశాన్ని ఎలా అనుభవిస్తారనే అంశాల నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. సృజనాత్మకత, వినియోగ సౌలభ్యం, సుస్థిరత, సాంస్కృతిక ప్రాధాన్యాలను సమన్వయం చేసినప్పుడే అత్యుత్తమ డిజైన్ ఆలోచనలు రూపుదిద్దుకుంటాయని నేను నమ్ముతాను’’ అని ఆయన వివరించారు.
సంప్రదాయానికి ఆధునికత జోడించి..
భారతీయ సంప్రదాయ నిర్మాణ వారసత్వాన్ని ఆధునిక జీవనశైలితో మేళవించడానికి రూపొందించిన ప్రాజెక్టుల్లో ‘మండువా హౌస్’ ఒకటి. ఇందులో సాంస్కృతిక గుర్తింపును కాపాడుతూనే.. ఆధునిక కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు, వినియోగానికి అనుగుణమైన ఏర్పాట్లకు ప్రాధాన్యమిచ్చారు. జీనోమ్ వ్యాలీలోని ఐకర్ ఫార్మా ప్రాజెక్టు కూడా ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టులలో ఒకటి. ప్లాస్మా నుంచి ఉత్పత్తి చేసే చికిత్సా విధానాలపై దృష్టి సారించే ప్రత్యేక బయోఫార్మాస్యూటికల్ సంస్థకు సంబంధించిన ఈ ప్రాజెక్టు.. ఆయన వృత్తిపరమైన అనుభవ పరిధిని తెలియజేస్తుంది. ‘‘గొప్ప వాస్తుశిల్పం అంటే కేవలం మనం నిర్మించే భవనాలు మాత్రమే కాదు.. అవి ప్రజల జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుస్తాయన్నదే అసలైన విషయం. ప్రతి ప్రాజెక్టు ఈ విషయాన్ని మాకు నేర్పిస్తుంది’’ అని సురేశ్ కుమార్ పేర్కొన్నారు.
సుస్థిర నిర్మాణాలే భవిష్యత్తు
ఆయన డిజైన్ ప్రక్రియలో పర్యావరణ సుస్థిరతకు కీలక స్థానం ఉంది. సహజ కాంతి, గాలి ప్రసరణకు అనువుగా నిర్మాణాలను రూపొందించడం ద్వారా ఇంటీరియర్లను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన నిర్మాణ ప్రణాళికలు, స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ అవసరాలను తగ్గించవచ్చు. తగిన నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడం, పరిసర పరిస్థితులను అర్థం చేసుకోవడం కూడా భవనాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ అంశాలను నిర్మాణం పూర్తయ్యాక కాకుండా.. ప్రణాళిక దశ నుంచే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
డిజైన్‌లో సాంకేతికత కీలకం
కృత్రిమ మేధ (ఏఐ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం), త్రీడీ విజువలైజేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు వాస్తుశిల్ప రంగంలో కీలకంగా మారుతున్నాయి. వీటి సాయంతో వివిధ డిజైన్లను పరిశీలించడం, సాంకేతిక అంశాల మధ్య సమన్వయం సాధించడం, నిర్మాణం ప్రారంభానికి ముందే సంభవించే సమస్యలను గుర్తించడం సులభమవుతుంది. ‘‘సృజనాత్మకతను భర్తీ చేయడానికి మేం సాంకేతికతను ఉపయోగించడం లేదు. మరింత తెలివైన, సమాచార ఆధారిత డిజైన్ పరిష్కారాలను రూపొందించేందుకు దాన్ని వినియోగిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. డిజైన్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను నియంత్రించడం, సుస్థిరతను వినియోగ సౌలభ్యంతో సమన్వయం చేయడం, నిర్మాణ పనుల అమలులో వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడం వాస్తుశిల్పులకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు డిజైన్ బృందం, క్లయింట్లు, ఇతర నిపుణుల మధ్య సమర్థమైన ప్రణాళిక, సమన్వయం అవసరమని సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవనానికి
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. వాస్తుశిల్పులు వ్యక్తిగత భవనాలకే పరిమితం కాకుండా, నగర విస్తృత అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. పచ్చదనంతో కూడిన ప్రదేశాలు, సమర్థమైన నీటి నిర్వహణ, వాతావరణానికి అనుగుణమైన నిర్మాణాలు, నడిచేందుకు అనువైన పరిసరాలు, మెరుగైన అనుసంధానంతో కూడిన నివాస ప్రాంతాలు నగరాన్ని మరింత సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా మారుస్తాయని చెబుతున్నారు. రానున్న పదేళ్లలో ఇళ్ల నిర్మాణంలో ఆరోగ్యం, సౌకర్యం, మార్పులకు అనుగుణంగా మార్చుకోగలిగే గదుల అమరికలు, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
వాణిజ్య ప్రదేశాలు కూడా మారుతున్న పని విధానాలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకోనున్నాయి. స్మార్ట్ సాంకేతికత, అనువైన డిజైన్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలు నివసించే, పనిచేసే, పరస్పరం అనుసంధానమయ్యే విధానాలను మెరుగుపరిచే నిర్మాణాలే తన దీర్ఘకాలిక లక్ష్యమని సురేశ్ కుమార్ చెబుతున్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరత, సాంస్కృతిక గుర్తింపులను సమన్వయం చేస్తూ.. ఎన్నో ఏళ్లపాటు ఉపయోగకరంగా, అర్థవంతంగా నిలిచే ప్రదేశాలను సృష్టించడమే మంచి వాస్తుశిల్పమని ఆయన అభిప్రాయపడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0