వృద్ధాప్యంలో కొత్త ఇల్లు..  సీనియర్‌ హౌసింగ్‌కు భారీ డిమాండ్

India’s senior housing market is poised for rapid growth, driven by an ageing population, changing family structures and rising demand for healthcare and assisted living.

Aug 22, 2026 - 09:02
 0  39
వృద్ధాప్యంలో కొత్త ఇల్లు..   సీనియర్‌ హౌసింగ్‌కు భారీ డిమాండ్
india-senior-housing-market-2030
  • 2030 నాటికి రూ.లక్ష కోట్లను దాటే అవకాశం
  • కొలియర్స్ నివేదిక అంచనా

దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, మారుతున్న కుటుంబ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణపై పెరుగుతున్న శ్రద్ధతో సీనియర్‌ లివింగ్‌ (వృద్ధుల కోసం ప్రత్యేక గృహాలు) రియల్‌ ఎస్టేట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా మారుతోంది. కొలియర్స్‌ ఇండియా నివేదిక ప్రకారం ప్రస్తుతం సుమారు రూ.30 వేల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2030 నాటికి రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశం ఉంది. 2024తో పోలిస్తే ఇప్పటికే ఈ విభాగం దాదాపు 70 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశంలో సీనియర్‌ లివింగ్‌ ఇళ్లకు సుమారు 20–22 లక్షల యూనిట్ల డిమాండ్‌ ఉంది. 2030 నాటికి ఇది దాదాపు 28–30 లక్షల యూనిట్లకు చేరుతుందని అంచనా. అయితే ప్రస్తుతం వ్యవస్థీకృత సీనియర్‌ హౌసింగ్‌ సరఫరా కేవలం 25 వేల యూనిట్లకే పరిమితమైంది. డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న సరఫరాకు మధ్య భారీ అంతరం ఉండటంతో డెవలపర్లు ఈ రంగంపై దృష్టి పెడుతున్నారు.

నాలుగు రెట్లు పెరగనున్న సరఫరా

సీనియర్‌ హౌసింగ్‌లో ఆర్గనైజ్డ్‌ ఇన్వెంటరీ 2030 నాటికి ప్రస్తుత 25 వేల యూనిట్ల నుంచి సుమారు లక్ష యూనిట్లకు చేరుతుందని కొలియర్స్‌ అంచనా వేసింది. అంటే మూడు నాలుగేళ్లలో సరఫరా దాదాపు నాలుగు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం ఆర్గనైజ్డ్‌ సీనియర్‌ లివింగ్‌ వ్యాప్తి కేవలం 1.3 శాతం ఉండగా, 2030 నాటికి ఇది దాదాపు 4 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు సీనియర్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులు ప్రధానంగా టైర్‌-1 నగరాల్లోనే ఎక్కువగా ఉండేవి.

ఇకపై టైర్‌-2, టైర్‌-3 నగరాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ భారీగా ప్రాజెక్టులు రానున్నాయి. కొయంబత్తూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్‌, వడోదరతో పాటు తిరుపతి, వృందావన్‌, అయోధ్య వంటి ఆధ్యాత్మిక నగరాలు సీనియర్‌ హౌసింగ్‌కు అనుకూల మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. 2030 నాటికి కొత్త ప్రాజెక్టుల్లో 30–40 శాతం ఈ నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే రావచ్చని నివేదిక పేర్కొంది. తక్కువ జీవన వ్యయం, మెరుగైన వైద్య సదుపాయాలు, తక్కువ స్థిరాస్తి ధరలు, ప్రశాంత వాతావరణం ఇందుకు కారణాలుగా ఉన్నాయి.

రూ.13 వేల కోట్ల పెట్టుబడులు

సీనియర్‌ లివింగ్‌ రంగంపై పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 2025 నుంచి ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ప్రకటించారు. రానున్న మూడు నాలుగేళ్లలో ఈ నిధులు సీనియర్‌ హౌసింగ్‌ ప్రాజెక్టుల్లోకి ప్రవహించనున్నాయి. డెవలపర్లతోపాటు సంస్థాగత పెట్టుబడిదారులు, ఆరోగ్య సేవల సంస్థలు కూడా భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టుల రూపకల్పనలోనూ మార్పులు వస్తున్నాయి. కేవలం నివాసానికి పరిమితం కాకుండా వైద్య సేవలు, వెల్‌నెస్‌, సామాజిక కార్యక్రమాలు, అత్యవసర సేవలు, పునరావాసం వంటి సదుపాయాలను ఒకే చోట అందించే విధంగా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు.

 టెలిమెడిసిన్‌, రిమోట్‌ హెల్త్‌ మానిటరింగ్‌, ఏఐ ఆధారిత అత్యవసర స్పందన వ్యవస్థలు కూడా భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా సీనియర్‌ హౌసింగ్‌ ప్రత్యేక కాలనీలకే పరిమితం కాకుండా పెద్ద విల్లా ప్రాజెక్టులు, మిక్స్‌డ్‌ యూజ్‌ డెవలప్‌మెంట్లు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లలో ప్రత్యేక సీనియర్‌ లివింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసే ధోరణి పెరుగుతోంది. 1, 2, 3 బీహెచ్‌కే ఇళ్లు ఈ విభాగంలో ప్రధానంగా ఉండగా.. భవిష్యత్తులో డిమెన్షియా కేర్‌, అత్యవసర వైద్యం, రిహాబిలిటేషన్‌, వెల్‌నెస్‌ సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది.

పెరుగుతున్న వృద్ధుల సంఖ్య

దేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య ప్రస్తుతం సుమారు 17 కోట్లుగా ఉండగా, 2050 నాటికి అది 34 కోట్లకు పైగా పెరగవచ్చని అంచనా. ఈ జనాభా మార్పు సీనియర్‌ హౌసింగ్‌, కేర్‌ ఫెసిలిటీలకు దీర్ఘకాలిక డిమాండ్‌ను పెంచనుంది. పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలు లేదా దేశాలకు వెళ్లడం, ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గడం వంటి సామాజిక మార్పులు కూడా వృద్ధులకు స్వతంత్రంగా, కానీ భద్రతతో జీవించే ప్రత్యేక నివాసాల అవసరాన్ని పెంచుతున్నాయి. సీనియర్‌ లివింగ్‌ రంగానికి సంబంధించి నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.

2019లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్‌ మార్గదర్శకాలు, రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) నిబంధనల అమలు ఈ రంగంలో ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే అవకాశం ఉంది. హరియాణా, మహారాష్ట్ర ఇప్పటికే సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులకు ప్రత్యేక మార్గదర్శకాలు లేదా విధానాల దిశగా చర్యలు చేపట్టాయి. మొత్తంగా చూస్తే.. భారత రియల్‌ ఎస్టేట్‌లో ఇప్పటివరకు చిన్న విభాగంగా ఉన్న సీనియర్‌ హౌసింగ్‌ ఇక ప్రధాన మార్కెట్‌గా మారే దిశగా సాగుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0