28 సంస్థల అమ్మకాలు 21 శాతం డౌన్‌

India’s real estate market saw a 21% decline in pre-sales among 28 major listed developers in Q1 FY2026–27. Combined bookings stood at ₹39,964 crore, down from ₹50,900 crore in the same quarter last year.

Aug 31, 2026 - 02:56
 0  3
28 సంస్థల అమ్మకాలు 21 శాతం డౌన్‌
india-real-estate-pre-sales-decline-28-listed-developers

దేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాల బుకింగ్స్‌ మందగించాయి. ఏప్రిల్‌–జూన్‌ మధ్యకాలంలో దేశంలోని 28 ప్రధాన లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మొత్తం ప్రీ-సేల్స్‌ రూ.39,964 కోట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.50,900 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం తగ్గుదల. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడం, విక్రయాల పరిమాణం పడిపోవడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ టాప్‌

ఈ త్రైమాసికంలో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ అత్యధిక అమ్మకాల బుకింగ్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ రూ.8,651 కోట్ల విలువైన ప్రీ-సేల్స్‌ నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.7,082 కోట్లు. దీంతో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ మరోసారి దేశంలోని లిస్టెడ్‌ డెవలపర్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ రూ.6,579.3 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే గత ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.12,126.4 కోట్ల ప్రీ-సేల్స్‌ నమోదు చేసింది. లోధా డెవలపర్స్‌ రూ.4,630 కోట్లు, శోభా లిమిటెడ్‌ రూ.3,656 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

19 సంస్థలకు పెరిగిన అమ్మకాలు

మొత్తం మార్కెట్‌ 21 శాతం క్షీణించినప్పటికీ 28 సంస్థల్లో 19 కంపెనీలు ప్రీ-సేల్స్‌లో వృద్ధి సాధించాయి. లోధా, శోభా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, పూర్వాంకర, కల్పతరు, మాక్స్‌ ఎస్టేట్స్‌, మహీంద్రా లైఫ్‌స్పేస్‌, ఎంబసీ డెవలప్‌మెంట్స్‌, రేమండ్‌ రియాల్టీ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా మాక్స్‌ ఎస్టేట్స్‌ అమ్మకాల బుకింగ్స్‌ గత ఏడాది రూ.217 కోట్ల నుంచి ఈసారి రూ.1,093 కోట్లకు భారీగా పెరిగాయి. మహీంద్రా లైఫ్‌స్పేస్‌ కూడా రూ.449 కోట్ల నుంచి రూ.925 కోట్లకు చేరుకుంది. అయితే, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా దేశంలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయిన డీఎల్‌ఎఫ్‌ అమ్మకాల బుకింగ్స్‌ మాత్రం భారీగా పడిపోయాయి.

గత ఏడాది ఏప్రిల్‌–జూన్‌లో రూ.11,425 కోట్లుగా ఉన్న ప్రీ-సేల్స్‌ ఈసారి కేవలం రూ.657 కోట్లకు తగ్గాయి. తొలి త్రైమాసికంలో సంస్థ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇక ఎంబసీ డెవలప్‌మెంట్స్‌ అమ్మకాల బుకింగ్స్‌ రూ.198 కోట్ల నుంచి రూ.868 కోట్లకు పెరిగాయి. రేమండ్‌ రియాల్టీ రూ.306 కోట్ల నుంచి రూ.700 కోట్లకు, టార్క్‌ రూ.225 కోట్ల నుంచి రూ.602 కోట్లకు చేరాయి. శ్రీ లోటస్‌ డెవలపర్స్‌ కూడా రూ.61 కోట్ల నుంచి రూ.409 కోట్లకు పెరిగింది. మరోవైపు ఓబెరాయ్‌ రియాల్టీ రూ.1,638.68 కోట్ల నుంచి రూ.1,049.88 కోట్లకు, సిగ్నేచర్‌ గ్లోబల్‌ రూ.2,640 కోట్ల నుంచి రూ.1,970 కోట్లకు తగ్గాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0