హైదరాబాద్‌లో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ట్రెండ్‌..

Hyderabad’s real estate market is witnessing growing demand for senior living communities designed specifically for people aged 60 and above.

Sep 28, 2026 - 03:21
 0  1
హైదరాబాద్‌లో కొత్త రియల్‌ ఎస్టేట్‌ ట్రెండ్‌..
hyderabad-senior-living-communities

సీనియర్‌ లివింగ్‌ కు సూపర్ డిమాండ్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఇప్పటివరకు యువ ఉద్యోగులు, కుటుంబాలు, ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకుని గృహ ప్రాజెక్టులు ఎక్కువగా వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త విభాగం వేగంగా విస్తరిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ‘సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీలు’ నగరంలో కొత్త హౌసింగ్‌ ట్రెండ్‌గా మారుతున్నాయి. వృద్ధులకు సురక్షితమైన వాతావరణంతో పాటు వైద్యం, ఆహారం, వినోదం, సామాజిక అనుబంధం వంటి సేవలను ఒకే చోట అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత.

క్రెడాయ్‌ అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు 5,000 సీనియర్‌ లివింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటి ప్రస్తుత స్టాక్‌ విలువ సుమారు రూ.2,000–3,000 కోట్లుగా ఉంది. అయితే నగర అవసరాలకు అనుగుణంగా మరో 10,000–15,000 యూనిట్లు అవసరమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ రంగంలో కొత్త ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి.

ఎందుకు పెరుగుతోంది డిమాండ్‌?

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా చిన్న కుటుంబాలుగా మారడం, పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలు లేదా విదేశాలకు వెళ్లడం వంటి మార్పులు సీనియర్‌ లివింగ్‌ డిమాండ్‌ను పెంచుతున్నాయి. తమ పిల్లలపై పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా, భద్రతతో జీవించాలనే ఆకాంక్ష వృద్ధుల్లో పెరుగుతోంది. సాధారణ వృద్ధాశ్రమాలకు భిన్నంగా ఈ కమ్యూనిటీల్లో నివాసితులకు ప్రత్యేక ఇళ్లు, సామాజిక కార్యక్రమాలు, వైద్య సదుపాయాలు, భద్రత, నిర్వహణ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో ‘రిటైర్‌మెంట్‌ హోమ్‌’ అనే భావన నుంచి ‘స్వతంత్ర జీవనశైలి’ వైపు ఈ రంగం మారుతోంది.

సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టుల్లో సాధారణ అపార్ట్‌మెంట్‌ సదుపాయాలకు మించి వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేస్తున్నారు. నర్సులు, వైద్యుల సంప్రదింపులు, అంబులెన్స్‌, ఫిజియోథెరపీ, అత్యవసర స్పందన వ్యవస్థలు వంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. హౌస్‌కీపింగ్‌, పోషకాహారం, నిర్వహణ సేవలు కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఇక ఇళ్లలో యాంటీ-స్కిడ్‌ ఫ్లోరింగ్‌, వృద్ధులు సులభంగా నడిచేందుకు వాకింగ్‌ ట్రాక్‌లు, వెల్‌నెస్‌ సెంటర్లు, వినోద సదుపాయాలు, అత్యవసర అలర్ట్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒకే ప్రాంగణంలో ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, సామాజిక జీవితం కలిసేలా ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు.

గచ్చిబౌలి నుంచి కొకాపేట్‌ వరకు..

హైదరాబాద్‌లో సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులకు పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. గచ్చిబౌలి, కొకాపేట్‌, నార్సింగి, తెల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో డెవలపర్లు అవకాశాలను పరిశీలిస్తున్నారు. మంచి వైద్య సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, ఐటీ ఉద్యోగుల కుటుంబాల ఉనికి వంటి అంశాలు ఈ ప్రాంతాలకు అనుకూలంగా మారుతున్నాయి.

సీనియర్‌ లివింగ్‌ రంగంలో దక్షిణ భారతదేశం ఇప్పటికే కీలక మార్కెట్‌గా ఎదుగుతోంది. ఒక అధ్యయనం ప్రకారం దేశంలోని ఆర్గనైజ్డ్‌ సీనియర్‌ లివింగ్‌ మార్కెట్‌లో దక్షిణ భారతదేశం వాటా దాదాపు 60 శాతంగా ఉంది. మారుతున్న కుటుంబ నిర్మాణం, విదేశాల్లో స్థిరపడుతున్న పిల్లలు, ఆరోగ్యం–వెల్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహన ఇందుకు ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0