ఇతర మెట్రోలతో పోలిస్తే  హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువే

Hyderabad’s real estate market has witnessed a dramatic rise in land prices over the past three decades, with rates in areas such as Nizampet and Mallampet increasing from a few lakh rupees per acre to tens of crores.

Oct 25, 2026 - 06:14
 0  10
ఇతర మెట్రోలతో పోలిస్తే   హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువే
hyderabad-real-estate-land-prices-prr-developers
  • భూముల ధరలు లక్షల నుంచి కోట్లకు
  • మూడు దశాబ్దాల్లో భారీ మార్పు..
  • పీఆర్‌ఆర్‌ డెవలపర్స్‌ ఎండీ అంజనేయ రాజు

ఆర్ఈజీ న్యూస్‌, హైద‌రాబాద్: 
హైదరాబాద్ నగరంలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో భూముల ధరలు గత మూడు దశాబ్దాల్లో భారీగా పెరిగాయి. ఒకప్పుడు ఎకరం లక్షల రూపాయల్లో లభించగా.. ఇప్పుడు అదే భూమి విలువ కోట్ల రూపాయలకు చేరింది. దీంతో నిర్మాణ ఖ‌ర్చు పెరిగి.. అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌ను అందించ‌డం బిల్డ‌ర్ల‌కూ స‌వాలుగా మారుతోంది. బెంగళూరు, గురుగ్రామ్‌, ఢిల్లీ, పుణె వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నేటికీ.. అద్దెలు, నిర్మాణ వ్యయం, భూముల ధరలు.. ఇర‌వై నుంచి ఇర‌వై శాతం దాకా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని పీఆర్ఆర్ డెవ‌ల‌ప‌ర్స్ ఎండీ ఆంజ‌నేయ రాజు తెలిపారు. మ‌రి, రియ‌ల్ రంగంలో త‌న ప్ర‌స్థానం.. మార్కెట్ అభివృద్ధి.. భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌పై ఆయ‌న ఏమ‌న్నారంటే.. 

‘‘1993లో నేనీ రంగంలోకి వచ్చినప్పుడు ఎకరం భూమి ధర కొన్ని లక్షల రూపాయలుగా ఉండేది. ఇప్పుడేమో కోట్ల రూపాయ‌ల‌కు ఎగ‌బాకింది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఈ మూడు దశాబ్దాల్లో ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో అభివృద్ధి చెందింద‌ని అన్నారు. అంజనేయ రాజు 1993లో తన సోదరుడికి చెందిన నిర్మాణ సంస్థలో పని చేస్తూ ఈ రంగంలోకి ప్రవేశించారు. అదే సంస్థ‌లో 2007లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి పలు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమయ్యారు. అనంతరం 2023లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భూముల ధరలు, బిల్డర్ల మధ్య పోటీ, ఇళ్ల కొనుగోలుదారుల బడ్జెట్లలో వచ్చిన మార్పులను ఆయన దగ్గరగా గమనించారు.

లక్షల్లో ఉన్న ధరలు.. ఇప్పుడు కోట్లలో!

నిజాంపేటలో 1993లో ఎకరం భూమి ధర సుమారు రూ.4–5 లక్షలు ఉండేదని, ప్రస్తుతం దాని విలువ రూ.45–50 కోట్లకు చేరిందని అంజనేయ రాజు వివరించారు. మల్లంపేటలో 2000 సంవత్సరంలో ఎకరం భూమి రూ.4–5 లక్షలకు లభించేదని, ప్రస్తుతం దాని విలువ రూ.20–22 కోట్లకు చేరిందని తెలిపారు. ‘‘మేం మల్లంపేటలో ప్రారంభించినప్పుడు అక్కడ ఒకే భవనం ఉండేది. ఇప్పుడు సుమారు 20 మంది బిల్డర్లు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నివాస ప్రాజెక్టులకు కీలక కేంద్రాలుగా మారాయని వివరించారు.

పీఆర్‌ఆర్‌ డెవలపర్స్‌ ప్రస్తుతం ప్రీమియం గృహ విభాగంలో ‘పీఆర్‌ఆర్ వెనీషియా’ పేరుతో విల్లాల ప్రాజెక్టును చేపడుతోంది. శంకర్‌పల్లిలో 9.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 77 విల్లాలు ఉన్నాయి. ఒక్కో విల్లా 4,500 చదరపు అడుగులు, 5,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. మోకిలా–శంకర్‌పల్లి మార్గానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంజనేయ రాజు తెలిపారు. 

* ప్రీమియం విల్లాలతోపాటు మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించడంపైనా సంస్థ దృష్టి సారిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎగ్జిట్‌ 4 సమీపంలోని మల్లంపేట, భౌరంపేట ప్రాంతాల్లో రెండు పడక గదుల అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. ‘‘ఈ ప్రాంతాల్లో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల ధరల శ్రేణిలో రెండు పడక గదుల ఇళ్లకు డిమాండ్‌ ఉంది. అందుకే ఆ ధరల్లో ఫ్లాట్ల‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. ఇదే సమయంలో పటాన్‌చెరులో 12 ఎకరాల విస్తీర్ణంలో 160 విల్లాలతో ప్రాజెక్టును చేపట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని అంజనేయ రాజు తెలిపారు.

ట్రంప్ ఆంక్ష‌ల‌తో.. 

పీఆర్‌ఆర్‌ డెవలపర్స్‌ కొనుగోలుదారుల్లో వ్యాపారవేత్తలు, ఎన్నారైలు ఎక్కువగా ఉన్నారు. విశాలమైన ఇళ్లను కోరుకునే వీరు ప్రీమియం గృహాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఎన్నారై కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ కొంత తగ్గిందని అంజనేయ రాజు పేర్కొన్నారు. కాక‌పోతే, తాజాగా ఎనిమిది ఐటీ కంపెనీల‌పై అమెరికా ఆంక్ష‌లు విధించ‌డం వ‌ల్ల అక్క‌డి ఐటీ నిపుణుల్లో కొంత‌మంది వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అలాంటి వారిలో కొంద‌రు నియోపోలిస్ నుంచి నాలుగైదు మీట‌ర్ల రేడియ‌స్‌లో ల‌గ్జ‌రీ విల్లాల్ని ఎంచుకోవ‌డానికి ఆస్కార‌ముందని చెప్పారు. 

* రానున్న ఐదేళ్లలోనూ హైదరాబాద్‌ ఇతర ప్రధాన నగరాల రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లతో పోటీపడగలదని అంజనేయ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ నాణ్యతను కాపాడటంతోపాటు, కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ధరల్లో ఇళ్లను అందించగలిగితేనే డిమాండ్‌ను కొనసాగించగలమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న భూముల ధరలు, మారుతున్న కొనుగోలుదారుల అవసరాల మధ్య సమతుల్యత సాధించడం బిల్డర్లకు కీలకంగా మారనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0