ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్
Summary Housing sales across India’s nine major residential markets declined 6% year-on-year in Q3 2026, with 1,03,170 homes sold compared with 1,09,420 units in the same quarter of 2025, according to PropEquity.
- దేశవ్యాప్తంగా 6 శాతం మేర తగ్గిన విక్రయాలు
- హైదరాబాద్ లో మాత్రం 11 శాతం పెరుగుదల
దేశంలోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఇళ్ల అమ్మకాలు స్వల్పంగా మందగించాయి. 2026 జులై–సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. అమ్మకాలతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇళ్ల సంఖ్య కూడా తగ్గింది.
2025 జులై–సెప్టెంబరులో 1,00,330 యూనిట్లుగా ఉన్న కొత్త ఇళ్ల సరఫరా.. ఈ ఏడాది ఇదే కాలంలో 98,165 యూనిట్లకు పడిపోయింది. త్రైమాసిక ప్రాతిపదికన కొత్త సరఫరా ఏకంగా 15 శాతం తగ్గింది. అమ్మకాలు మాత్రం అంతకంటే తక్కువగా 4 శాతం మాత్రమే తగ్గినట్లు నివేదిక విశ్లేషించింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కొనుగోలుదారుల డిమాండ్‌లో కొంత మందగమనం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా జులై–సెప్టెంబరు కాలం వర్షాకాలం కావడంతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొంత నెమ్మదించడం కూడా ఈ గణాంకాలపై ప్రభావం చూపుతుంది. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో పండుగల సీజన్ కారణంగా ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు, ఆఫర్లను పెంచుతుంటారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఊరట
దేశవ్యాప్తంగా అమ్మకాలు తగ్గినప్పటికీ హైదరాబాద్ మాత్రం వృద్ధిని నమోదు చేసింది. 2025 జులై–సెప్టెంబరులో 13,890 ఇళ్లు అమ్ముడవగా.. 2026లో ఈ సంఖ్య 15,470 యూనిట్లకు పెరిగింది. అంటే ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదైంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో అమ్మకాల పరంగా హైదరాబాద్ కీలక మార్కెట్‌గా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో మరో ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. కొత్త ఇళ్ల లాంచ్‌లు ఏడాది ప్రాతిపదికన 68 శాతం పెరిగి 22,090 యూనిట్లకు చేరాయి.
అదే సమయంలో అమ్మకాలు 15,470 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే కొత్త సరఫరా.. త్రైమాసిక అమ్మకాల కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది. మార్కెట్లో కొత్త ఇన్వెంటరీ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో విక్రయ వేగం, ఇన్వెంటరీ స్థాయిలను డెవలపర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం చెన్నై, కోల్‌కతాల్లో అమ్మకాలు 17 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 16 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్లో 12 శాతం, థానెలో 11 శాతం, ముంబయిలో 8 శాతం క్షీణత నమోదైంది. మరోవైపు నవీ ముంబయిలో 12 శాతం, హైదరాబాద్‌లో 11 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో మాత్రం 1 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0