హైద‌రాబాద్ రియాల్టీలో  పండ‌గ క‌ళ క‌నిపించేనా?

With Dasara and Diwali approaching, Hyderabad’s residential market is gearing up for the festive season.

Oct 24, 2026 - 03:45
 0  37
హైద‌రాబాద్ రియాల్టీలో  పండ‌గ క‌ళ క‌నిపించేనా?
hyderabad-festive-season-property-sales

దసరా, దీపావళి పండగలు దగ్గరపడుతున్న వేళ..  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో పండగ సందడి మొదలైంది. సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే కుటుంబాలు.. ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల కోసం అన్వేషణ ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలు ప్రత్యేక ఫెస్టివల్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉచిత పార్కింగ్‌, మాడ్యులర్‌ కిచెన్‌, రిజిస్ట్రేషన్‌ లేదా ఇతర ప్రయోజనాలతో ప్రచారాలు చేపడుతున్నాయి. దీంతో దసరా నుంచి దీపావళి వరకు హౌసింగ్‌ మార్కెట్‌లో అమ్మకాలు ఊపందుకుంటాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండగలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభించడం, ఆస్తులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో పండగ సీజన్‌ ప్రారంభం కాగానే ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే కొంతకాలంగా ఇంటి కోసం చూస్తున్న కుటుంబాలు.. పండగల సమయంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. కొందరు అడ్వాన్స్‌ చెల్లించి ప్రాజెక్టులో యూనిట్‌ను బుక్‌ చేసుకోవాలని చూస్తుంటే.. మరికొందరు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధమవుతున్నారు.

ఆఫర్లతో కొనుగోలుదారులను

సాధారణంగా పండగ సీజన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కీలకమైన కాలం. ఈ సమయంలో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఫ్లాట్‌ ధరలో ప్రత్యేక రాయితీ.. ఫ్రీ పార్కింగ్‌.. మాడ్యులర్‌ కిచెన్‌.. రిజిస్ట్రేషన్‌ ఖర్చులపై ప్రయోజనాలు.. ఫర్నిషింగ్‌ ప్యాకేజీలు.. తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలపై భాగస్వామ్య ఆఫర్లు.. ఇలా ఒక్కో ప్రాజెక్టు ఒక్కో విధమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. అయితే ఆఫర్‌ పేరుతో చూపించే తగ్గింపుకంటే యూనిట్‌ తుది ధర, నిర్మాణ నాణ్యత, రెరా రిజిస్ట్రేషన్‌, అనుమతులు, మెయింటెనెన్స్‌ ఖర్చులు, డెలివరీ టైమ్‌లైన్‌ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్..

హైదరాబాద్ రెసిడెన్షియ‌ల్‌ మార్కెట్‌ గత కొన్నేళ్లుగా స్థిరమైన డిమాండ్‌ను చూపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగం విస్తరణ, మెరుగైన రహదారి కనెక్టివిటీ, మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ చుట్టూ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో హౌసింగ్‌ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో కోకాపేట్‌, నార్సింగి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, పుప్పాలగూడ వంటి ప్రాంతాలతో పాటు.. బాచుపల్లి, పటాన్‌చెరు, కొంపల్లి, శంకర్‌పల్లి, బండ్లగూడ జాగీర్‌, మహేశ్వరం వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ వివిధ బడ్జెట్‌ సెగ్మెంట్లకు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి.

మధ్యతరగతి బడ్జెట్‌.. 

ఇటీవల కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లోనూ మార్పు కనిపిస్తోంది. కేవలం నాలుగు గోడల ఇల్లు కాకుండా.. సెక్యూరిటీ, పార్కింగ్‌, క్లబ్‌హౌస్‌, జిమ్‌, పిల్లల ఆటస్థలాలు, వాకింగ్‌ ట్రాక్‌ వంటి సదుపాయాల్ని కోరుతున్నారు. దీంతో మధ్యతరగతి బడ్జెట్‌లో లభించే గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులకూ డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలు.. పిల్లల భద్రత, కమ్యూనిటీ లైఫ్‌, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

మార్కెట్‌ ముందున్న అసలు పరీక్ష

పండగ సెంటిమెంట్‌ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇళ్ల ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కొనుగోలుదారులు ధర విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు నిర్మాణ వ్యయాలు, భూమి ధరలు పెరుగుతుండగా.. మరోవైపు కొనుగోలుదారులు తమ ఈఎంఐ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే ఈ పండగ సీజన్‌లో అమ్మకాల సంఖ్య కంటే.. వాస్తవంగా ఎంతమంది కొనుగోలు నిర్ణయానికి వస్తారు, ఎంతమంది బుకింగ్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ దశకు వెళ‌తార‌న్నది మార్కెట్‌ దిశను నిర్ణయించే అంశంగా మారనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0