నిర్మాణ వ్యయం 34%.. ఇళ్ల ధరలు 59% జంప్‌

Home prices across India’s seven major cities increased 59% between 2021 and 2025, almost twice the pace of construction costs, which rose 34%, according to a latest ANAROCK report.

Sep 11, 2026 - 03:50
 0  3
నిర్మాణ వ్యయం 34%.. ఇళ్ల ధరలు 59% జంప్‌
home-prices-rise-59-percent-construction-costs-34-percent-anarock
  • ఐదేళ్లలో భారీగా పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు
  • భూమి విలువలు, డిమాండ్‌ పెరగడమే ప్రధాన కారణాలు
  • అనరాక్ తాజా నివేదిక వెల్లడి

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో నిర్మాణ వ్యయంతో పోలిస్తే దాదాపు రెండింతల వేగంతో పెరిగాయి. 2021 నుంచి 2025 మధ్యకాలంలో సాధారణం కంటే మెరుగైన (స్టాండర్డ్ ప్లస్) రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగటున 34 శాతం పెరగ్గా.. అదే సమయంలో ఇళ్ల సగటు ధరలు ఏకంగా 59 శాతం పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. 2021లో ఒక స్టాండర్డ్‌-ప్లస్‌ నివాస ప్రాజెక్టును నిర్మించేందుకు చదరపు అడుగుకు సగటున రూ.2,681 ఖర్చయ్యేది. 2025 నాటికి ఇది రూ.3,604కు చేరింది. అంటే ఐదేళ్లలో 34 శాతం పెరుగుదల నమోదైంది. నిర్మాణ వ్యయం వార్షిక సగటు వృద్ధి రేటు సుమారు 6.9 శాతంగా ఉంది. ఇదే కాలంలో ఇళ్ల సగటు విలువ చదరపు అడుగుకు రూ.5,826 నుంచి రూ.9,260కు పెరిగింది. అంటే 59 శాతం వృద్ధి నమోదైంది. ఇళ్ల ధరల వార్షిక సగటు వృద్ధి రేటు సుమారు 12 శాతంగా ఉంది.

నిర్మాణ వ్యయం ఒక్కటే కారణం కాదు

ఇళ్ల ధరలు పెరగడానికి నిర్మాణ సామగ్రి ధరలు మాత్రమే కారణం కాదని నివేదిక స్పష్టం చేసింది. ఇళ్ల ధరల పెరుగుదలలో సుమారు 66 శాతం నిర్మాణ వ్యయాల ప్రభావం ఉండగా.. మిగిలిన 34 శాతం భూమి ధరలు, డెవలపర్ల మార్జిన్లు, డిమాండ్‌-సప్లై పరిస్థితులు, ప్రాంతీయ ప్రీమియం వంటి ఇతర అంశాల వల్ల వచ్చినట్లు అనరాక్ పేర్కొంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త రహదారులు, మెట్రో రైలు మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలు భూముల విలువలను గణనీయంగా పెంచుతున్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాకముందే డెవలపర్ల భూసేకరణ వ్యయం భారీగా పెరుగుతోంది. 2021 నుంచి 2026 తొలి అర్ధభాగం వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో భూముల ధరలు సాధారణంగా 50-120 శాతం వరకు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూముల ధరలు సుమారు 70-130 శాతం, బెంగళూరులో 60-120 శాతం వరకు పెరిగినట్లు అన‌రాక్ డేటా సూచిస్తోంది. అందువల్ల ఇంటి నిర్మాణానికి అయ్యే అసలు ఖర్చు ఒక భాగమే కాగా.. ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, భూమి విలువ, కనెక్టివిటీ, మార్కెట్‌ డిమాండ్‌ వంటి అంశాలు తుది విక్రయ ధరను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఉక్కు, రవాణా ఖర్చులు మరింత భారం

ఇటీవలి పశ్చిమాసియా ఉద్రిక్తతలు నిర్మాణ రంగంపై మరోసారి ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో నిర్మాణ వ్యయాల్లో మరో 8-10 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ముఖ్యంగా ఉక్కు, ఇంధన ఆధారిత రవాణా ఖర్చులు ఎక్కువగా పెరిగాయి. దిగుమతి చేసుకునే ఫినిషింగ్‌ మెటీరియల్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ (ఎంఈపీ) ఖర్చులూ పెరిగాయి. టైల్స్‌, గ్లాస్‌, హార్డ్‌వేర్‌ వంటి ఫినిషింగ్‌ మెటీరియల్స్‌ ధరలు సుమారు 8-12 శాతం, ఎంఈపీ ఖర్చులు 9-13 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. నిర్మాణ ప్రాజెక్టులో అత్యధిక వ్యయ భాగమైన కార్మిక వ్యయం సుమారు 25-30 శాతం ఉండగా, అది 5-6 శాతం మేర పెరిగింది. సిమెంట్‌ ధరలు మాత్రం సుమారు 4-5 శాతం మాత్రమే పెరిగాయి.

డెవలపర్లపై మార్జిన్‌ ఒత్తిడి

నిర్మాణ వ్యయాలు పెరిగినప్పటికీ ఇప్పటికే ప్రారంభించి, విక్రయించిన ప్రాజెక్టుల్లో డెవలపర్లు వెంటనే ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపడం కష్టం. దీంతో వారి లాభాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో మాత్రం ప్రస్తుత భూమి, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సవరించే అవకాశం డెవలపర్లకు ఉంటుంది. అయితే మధ్యతరగతి, అందుబాటు గృహాల విభాగంలో ధరలు మరింత పెరిగితే కొనుగోలు సామర్థ్యం తగ్గి డిమాండ్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇక నిర్మాణ వ్యయం 34 శాతం పెరిగిన సమయంలో ఇళ్ల ధరలు 59 శాతం పెరగడం గృహ కొనుగోలుదారులపై పడుతున్న భారాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా వేతనాలు, ఆదాయాలు ఇళ్ల ధరల స్థాయిలో పెరగని సందర్భంలో మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత ఖరీదవుతోంది. లగ్జరీ, ప్రీమియం గృహాలకు అధిక ధరలను భరించగల కొనుగోలుదారులు ఉండటంతో అక్కడ ధరల పెరుగుదల ప్రభావం కొంత తక్కువగా ఉండొచ్చు. కానీ మధ్యతరగతి, అందుబాటు గృహాల విభాగంలో చిన్నపాటి ధర పెరుగుదల కూడా కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0