- ఈ 7 భద్రతా ప్రమాణాలు సరిచూసుకోకపోతే ప్రమాదమే!
స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, 18వ అంతస్తు నుంచి నగర సౌందర్యాన్ని తిలకించే దృశ్యం.. హైరైజ్ (ఎత్తైన) అపార్ట్‌మెంట్లలో నమూనా ప్లాట్ చూడగానే చాలామంది గృహ కొనుగోలుదారులు ముగ్ధులవుతుంటారు. వెంటనే ఇంటీరియర్ డిజైన్స్, గృహప్రవేశం తేదీల గురించి ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభిస్తారు. కానీ, లగ్జరీ సౌకర్యాలకు ఇచ్చే ప్రాధాన్యం అత్యవసర భద్రతా ప్రమాణాలకు ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి.
సాధారణ స్వతంత్ర గృహాలతో పోలిస్తే ఎత్తైన భవనాల్లో నివసించడం సంపూర్ణంగా భిన్నమైనది. ఒక ఇండిపెండెంట్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే బయటకు రావడానికి నేరుగా తలుపులు, ఖాళీ స్థలం ఉంటాయి. కానీ 24వ అంతస్తులో ప్రమాదం జరిగితే దట్టమైన పొగ, మెట్ల మార్గం, బిల్డర్ భద్రత కోసం చేసిన ఏర్పాట్లు మాత్రమే దిక్కు.
నిర్మాణం పూర్తయిన రోజు భవనం ఎంత అందంగా ఉందనే దానికంటే.. ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని ఎంతవరకు కాపాడుతుందనేదే అసలైన ప్రశ్న. భవనం భద్రతా తనిఖీల్లో విఫలమైనా లేదా ప్రమాదాలకు గురైనా కొనుగోలుదారులు కోట్లాది రూపాయల ఆస్తిని నష్టపోవడమే కాకుండా ప్రాణాలకే ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే బుకింగ్ అడ్వాన్స్ చెల్లించే ముందే ప్రతి కొనుగోలుదారుడు 7 కీలక అంశాలను చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..?
1. అగ్నిప్రమాద గుర్తింపు వ్యవస్థ
భవనంలో కేవలం స్మోక్ డిటెక్టర్లు (పొగను గుర్తించే పరికరాలు) ఉంటే సరిపోదు. అవి సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్‌కు అనుసంధానించబడి ఉన్నాయో లేదో చూడాలి. 'అడ్రసబుల్ అలారమ్ సిస్టమ్' ఉంటే, అర్ధరాత్రి 19వ అంతస్తులో పొగ వచ్చినా కంట్రోల్ రూమ్‌కు ఖచ్చితంగా ఏ ప్లాట్‌లో సమస్య ఉందో క్షణాల్లో సమాచారం అందుతుంది. డెవలపర్‌ను ఈ సిస్టమ్ గురించి అడిగి తెలుసుకోవాలి. తనిఖీ చేయని డిటెక్టర్ కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమేనని గుర్తుంచుకోండి.
2. స్ప్రింక్లర్ వ్యవస్థ & నీటి ఒత్తిడి
స్ప్రింక్లర్లు సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీటి ఒత్తిడి అవసరం. కాగితాలపై అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, ఫైర్ పంప్‌లను సరిగ్గా నిర్వహించకపోయినా లేదా వేసవిలో వాటర్ ట్యాంకులు ఎండిపోయినా ప్రమాద సమయంలో అవి పనిచేయవు. భవనంలో ఫైర్ సేఫ్టీ కోసం ఎంత నీటిని రిజర్వ్‌గా ఉంచారు? పంప్‌ల సామర్థ్యం ఎంత? బేస్‌మెంట్ పార్కింగ్, యుటిలిటీ షాఫ్ట్‌ల వరకు స్ప్రింక్లర్ల నెట్‌వర్క్ ఉందా లేదా అని స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి.
3. అత్యవసర నిష్క్రమణ మార్గాలు
హైరైజ్ భవనాల్లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లిఫ్ట్ వాడకూడదు. మెట్ల మార్గమే ఏకైక దిక్కు. మెట్ల మార్గంలోకి దట్టమైన పొగ రాకుండా ప్రత్యేక ఒత్తిడి విధానం ఉందో లేదో చూడాలి. ప్రతి ఫ్లోర్ ల్యాండింగ్ వద్ద ఉండే ఫైర్ డోర్లు మంటలు త్వరగా వ్యాపించకుండా ఆపుతాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా మెట్ల మార్గం కనిపించేలా ఎమర్జెన్సీ లైటింగ్ ఉండాలి. సైట్ విజిట్‌కు వెళ్లినప్పుడు స్వయంగా మెట్ల మార్గంలో నడిచి, ఫైర్ డోర్లు సరిగ్గా మూసుకుంటున్నాయో లేదో గమనించడం శ్రేయస్కరం.
4. ఆధునిక విద్యుత్ అవసరాలు - లోడ్ సామర్థ్యం
దేశంలో జరిగే మెజారిటీ అగ్నిప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లే ప్రధాన కారణం. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఇళ్లలో ఏసీలు, ఈవీ ఛార్జర్లు, భారీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం బాగా పెరిగింది. భవనం ఎలక్ట్రికల్ డిజైన్ ప్రస్తుత, భవిష్యత్తు లోడ్‌ను తట్టుకోగలదా? వైరింగ్ అంతా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఉందా? విడివిడిగా ప్యానెల్ లెవల్‌లో ఫాల్ట్ ఐసోలేషన్ ఉందా అని సరిచూసుకోవాలి.
5. ఈవీ బ్యాటరీ మంటలను తట్టుకునే సన్నద్ధత
ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిన ఈ రోజుల్లో వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలు మండే ప్రమాదం కొత్త సవాల్‌గా మారింది. ఈ మంటలను సాధారణ నీటితో ఆర్పడం కష్టం; పైగా అవి తీవ్రమైన విష వాయువులను విడుదల చేస్తాయి. బేస్‌మెంట్ పార్కింగ్‌లో ఈవీ ఛార్జింగ్ సదుపాయం ఇస్తున్నప్పుడు, అక్కడ తగిన ప్రత్యేక వెంటిలేషన్ మరియు మంటలను అదుపు చేసే ప్రత్యేక ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయో లేదో సేల్స్ టీమ్‌ను అడిగి తెలుసుకోవాలి.
6. ఆటోమేటిక్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
ఆటోమేటెడ్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది భవనం యొక్క ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ వ్యవస్థలను ఒకేచోట పర్యవేక్షిస్తుంది. ప్రమాదం జరగగానే ఇది ఆటోమేటిక్‌గా విద్యుత్ సర్క్యూట్లను వేరు చేయడం, ఫైర్ డోర్లను విడుదల చేయడం మరియు నిర్దిష్ట ప్రాంతాల్లో అలారమ్‌లను మోగించడం వంటివి చేస్తుంది. బిల్డర్ కేవలం ప్లాట్ అప్పగించడమే కాకుండా భవిష్యత్తు నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పడానికి ఈ సిస్టమ్ ఒక నిదర్శనం.
7. అధికారిక పత్రాలు & ఎన్‌ఓసీల పరిశీలన
అన్నింటికంటే ముఖ్యమైనది.. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ), థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ రిపోర్టులు, అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణ లాగ్‌బుక్ చూపించమని డెవలపర్‌ను కోరాలి. భద్రతా ప్రమాణాలు పాటించే ఏ మంచి ప్రాజెక్ట్ అయినా ఈ పత్రాలను చూపించడానికి వెనుకాడదు. ఒకవేళ డాక్యుమెంట్లు ప్లాట్ హ్యాండోవర్ సమయంలో ఇస్తామని దాటవేస్తే, అడ్వాన్స్ చెల్లించే ముందు పునరాలోచించడం అవసరం.
ఎత్తైన భవనంలో నివసించడం అనేది ఆధునిక జీవనశైలికి, హోదాకు చిహ్నం. అయితే, భద్రత లేని భవనంలో చేసే పెట్టుబడి ప్రమాదకరమైనది. రూపానికి ప్రాధాన్యమిచ్చే ముందు, భవిష్యత్తులో మీ కుటుంబ భద్రతకు భరోసానిచ్చే ఈ 7 రక్షణ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని రియల్ ఎస్టేట్, ఫైర్ సేఫ్టీ నిపుణులు సూచిస్తున్నారు.