విదేశాల్లో అనిశ్చితి.. భారత్‌లో సొంతింటిపై ఎన్నారైల చూపు!

Growing geopolitical and economic uncertainty around the world may encourage NRIs to invest in residential real estate in India, viewing a home in the country as a secure “home base” for the future.

Aug 23, 2026 - 00:37
 0  49
విదేశాల్లో అనిశ్చితి.. భారత్‌లో సొంతింటిపై ఎన్నారైల చూపు!
global-uncertainty-nris-interest-in-owning-homes-in-india
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు భారతీయుల రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భవిష్యత్తుకు భద్రమైన ‘హోమ్‌ బేస్‌’గా భారత్‌లో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకునే దిశగా మొగ్గు చూపే అవకాశం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో వలస విధానాలకు సంబంధించిన ఆందోళనలు కూడా అక్కడి భారతీయ కొనుగోలుదారులను భారత్‌వైపు మళ్లించే అవకాశముందని అంటున్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం, అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పరిణామాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న అనిశ్చితి వంటి అంశాలు విదేశాల్లో స్థిరపడిన భారతీయులను ప్రత్యామ్నాయంగా భారత్‌లో ఆస్తులు కొనుగోలు చేసేలా ప్రోత్సహించవచ్చని చెబుతున్నారు. విదేశాల్లో తమ నివాసం, ఉద్యోగం లేదా భవిష్యత్‌ స్థిరత్వంపై స్పష్టత తగ్గినప్పుడు భారత్‌లో ఒక సొంత ఇల్లు ఉండటం భద్రతగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
 
గత ఏడాది భారత్‌ నుంచి దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోకి సుమారు రూ.35,000 కోట్ల పెట్టుబడులు వెళ్లగా.. అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో ఈ మొత్తంలో గణనీయమైన భాగం ఇకపై భారత్‌లోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తన్నారు. దీంతో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో ఎన్నారైల నుంచి గృహ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఏ నగరంలో ఎంత మేరకు పెట్టుబడులు పెరుగుతాయన్నది అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి, కరెన్సీ మారకం రేట్లు, ఆస్తుల ధరలపై ఆధారపడి ఉంటుంది. మధ్యప్రాచ్య పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో అక్కడి కొనుగోలుదారుల నిర్ణయాలు ఆలస్యం కావచ్చని అంటున్నారు.
 
భారత్‌ ఎందుకు ఆకర్షణీయంగా మారుతోంది?
 
విదేశాల్లో నివసించే భారతీయులకు భారత్‌లో ఆస్తి కొనుగోలు అనేది కేవలం పెట్టుబడి అంశం మాత్రమే కాదు. కుటుంబానికి భవిష్యత్తులో నివాసం, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండే అవకాశం, పదవీ విరమణ తర్వాత తిరిగి భారత్‌కు వచ్చే ఆలోచన, ఆస్తి విలువ పెరిగే అవకాశాలు వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా మారుతున్న కొద్దీ స్వదేశంలో ఒక స్థిరమైన ఆస్తి ఉండటం ఎన్నారైలకు భద్రతా భావనను కలిగించవచ్చని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు భావిస్తున్నారు.
 ముఖ్యంగా అధిక ఆదాయం కలిగిన ఎన్నారైలు, గ్లోబల్‌ కంపెనీల్లో పనిచేసే భారతీయ నిపుణులు, వ్యాపారవేత్తలు ప్రీమియం, లగ్జరీ గృహాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు సాధారణ ఇళ్ల కంటే మెరుగైన సదుపాయాలు, భద్రత, బ్రాండెడ్‌ రెసిడెన్సీలు, మెరుగైన లొకేషన్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో విదేశాల్లోని అనిశ్చితి భారత్‌వైపు పెట్టుబడులను మళ్లిస్తే లగ్జరీ హౌసింగ్‌ విభాగానికి అదనపు ప్రయోజనం కలగవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యంగా అభివృద్ధి చేస్తున్న లగ్జరీ నివాస ప్రాజెక్టులకు డిమాండ్‌ కనిపిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0