- ఆరు నెలల్లో 1.91 లక్షల సీట్ల లీజింగ్.. 68.4 శాతం వృద్ధి
- బెంగళూరు టాప్.. హైదరాబాద్‌లో ఏకంగా 171 శాతం పెరిగిన డిమాండ్
దేశంలోని ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయంగా ఒక సంస్థ మొత్తం భవనాన్ని లేదా అంతస్తులను దీర్ఘకాలానికి లీజుకు తీసుకునే విధానానికి బదులుగా.. అవసరానికి తగ్గట్టుగా సీట్లు, కేబిన్లు, ఫ్లోర్ స్పేస్‌ను తీసుకునే ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ విధానానికి కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. 2026 తొలి అర్ధభాగంలో ఈ రంగం రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.
కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక ప్రకారం.. 2026 జనవరి–జూన్ మధ్య దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ ఆపరేటర్లు ఏకంగా 1,91,306 సీట్లను లీజుకు ఇచ్చారు. 2025 తొలి అర్ధభాగంలో లీజైన సీట్లతో పోలిస్తే ఇది 68.4 శాతం అధికం. దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ తొలి అర్ధభాగపు పనితీరు ఇదే. సీట్ల లీజింగ్‌తో పాటు ఫ్లెక్సీ ఆఫీస్ ఆపరేటర్లు 2026 తొలి ఆరు నెలల్లో 84 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ వాల్యూమ్ నమోదు చేశారు.
2025 తొలి అర్ధభాగంలో నమోదైన 54 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది 55 శాతం వృద్ధి. ఇదే సమయంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో మొత్తం ఆఫీస్ లీజింగ్ దాదాపు 43 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇందులో ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ ఆపరేటర్ల వాటా దాదాపు 20 శాతానికి చేరింది. 2025 తొలి అర్ధభాగంలో ఈ వాటా కేవలం 13 శాతంగా ఉండటం గమనార్హం. అంటే.. దేశంలోని ప్రతి ఐదు చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్‌లో దాదాపు ఒక భాగం ఫ్లెక్సీ స్పేస్ ఆపరేటర్ల ద్వారా జరుగుతున్నదన్నమాట.
బెంగళూరు నంబర్ వన్
నగరాల వారీగా చూస్తే బెంగళూరు దేశంలోనే అతిపెద్ద ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ మార్కెట్‌గా కొనసాగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో నగరంలో 57,487 సీట్లు లీజయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సీట్లలో బెంగళూరు వాటా 30 శాతం. అయితే సీట్ల సంఖ్యలోనే కాకుండా వృద్ధి వేగంలోనూ ఇతర నగరాలు బెంగళూరును అధిగమిస్తున్నాయి. బెంగళూరులో సీట్ల లీజింగ్ ఏడాదితో పోలిస్తే 31.8 శాతం పెరిగింది. ఐటీ, స్టార్టప్‌లు, గ్లోబల్ కంపెనీల కార్యాలయాలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ దూకుడు.. 170.8 శాతం వృద్ధి
దేశంలోని ఫ్లెక్సీ ఆఫీస్ మార్కెట్‌లో హైదరాబాద్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. 2026 తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌లో 40,451 సీట్లు లీజయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సీట్ల లీజింగ్‌లో ఏకంగా 170.8 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ, టెక్నాలజీ కంపెనీలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌లో విస్తరిస్తుండటం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంటోంది. కంపెనీలు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో మూలధనం ఖర్చు చేయకుండా, అవసరానికి అనుగుణంగా సీట్లు పెంచుకోవడానికి ఫ్లెక్సీ ఆఫీసులను ఎంచుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో జీసీసీల విస్తరణ, ఐటీ కారిడార్లలో కార్యాలయ డిమాండ్, కొత్త కంపెనీల ప్రవేశం, ఉద్యోగుల సంఖ్యను బట్టి ఆఫీస్ స్థలాన్ని పెంచుకునే వెసులుబాటు వంటి అంశాలు ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ మార్కెట్‌కు అనుకూలంగా మారుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముంబైలో ఫ్లెక్సీ సీట్ల లీజింగ్ 130 శాతం పెరగ్గా.. దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 152.7 శాతం వృద్ధి నమోదైంది. ఇక పుణెలో 27.8 శాతం, చెన్నైలో 3.6 శాతం, కోల్‌కతాలో 48 శాతం వృద్ధి నమోదైంది. చిన్న స్థాయి మార్కెట్ అయినప్పటికీ అహ్మదాబాద్ అత్యధికంగా 570.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. తక్కువ బేస్ నుంచి ఈ పెరుగుదల రావడంతో శాతం భారీగా కనిపిస్తోంది.
హైదరాబాద్‌కు మరింత కలిసొచ్చే అవకాశం
ప్రస్తుతం హైదరాబాద్ ఫ్లెక్సీ ఆఫీస్ మార్కెట్ దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. నగరంలో ఐటీ, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాలతో పాటు జీసీసీల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వీటి కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోసం తక్షణమే కార్యాలయ స్థలం అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ, కో-వర్కింగ్, మేనేజ్డ్ ఆఫీస్ సంస్థలకు హైదరాబాద్‌లో మరింత విస్తరణకు అవకాశం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.