రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్తుపై కోల్‌కతాలో క్రెడాయ్ జాతీయ సదస్సు
CREDAI will host its 24th national convention, NATCON 2026, from October 2 to 4 at ITC Royal Bengal in Kolkata. More than 1,100 builders, investors, bankers, business leaders and industry experts are expected to participate.
అక్టోబర్ 2 నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు..
ఏఐ, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధిపై చర్చలు
కింగ్ జాన్సన్ కొయ్యడ | 9030034591
ఆర్ఈజీ న్యూస్, కోల్‌కతా: భారత రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే మార్పులు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు క్రెడాయ్ (CREDAI) 24వ జాతీయ సదస్సు NATCON 2026ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 2 నుంచి 4 వరకు కోల్‌కతాలోని ఐటీసీ రాయల్ బెంగాల్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా 1,100 మందికి పైగా బిల్డర్లు, పెట్టుబడిదారులు, బ్యాంకర్లు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఇందులో పాల్గొంటారు.
‘ది ఇండియన్ రియల్ ఎస్టేట్ డైలాగ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో గృహ నిర్మాణం, కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, భవిష్యత్తు నగరాల నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సు మొదటి రోజు భారత రియల్ ఎస్టేట్ రంగంలో రానున్న వృద్ధి అవకాశాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార నాయకత్వంపై చర్చలు జరగనున్నాయి. అనరాక్ సంస్థ ఛైర్మన్, వ్యవస్థాపకుడు అనుజ్ పురి సహా పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
రెండో రోజు ఏఐ, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏఐ వినియోగం, మార్కెటింగ్‌లో కొత్త పద్ధతులు, గృహ రుణాలు, బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు, బిల్డర్లు ఐపీఓల ద్వారా నిధులు సమీకరించే అవకాశాలపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి, భవిష్యత్తు నగరాల నిర్మాణం కూడా సదస్సులో కీలక అంశాలుగా ఉండనున్నాయి. 2047 నాటికి పట్టణాల అభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ సలహాదారు కుల్దీప్ నారాయణ్, యూఎన్-హ్యాబిటాట్ ప్రతినిధి పాట్రిక్ కనగసింగం, క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ పటేల్ చర్చించనున్నారు.
చివరి రోజు లగ్జరీ గృహాలు, బ్రాండెడ్ నివాసాలు, గృహ నిర్మాణ రంగంలో కొత్త ధోరణులపై చర్చలు జరగనున్నాయి. లోధా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా ముఖ్య ప్రసంగం చేయనున్నారు. ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా, డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ, ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి, నటులు జిమ్ సర్బ్, అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు, కొత్త పెట్టుబడి అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దేశ, విదేశీ నిపుణులు తమ అనుభవాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదిక కానుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0