హైద‌రాబాద్‌లో కొత్త‌గా  2 వంతెన‌లు.. 1 ర్యాంప్‌.

Hyderabad’s H-City project has received a major boost with approval for the construction of two six-lane bridges and a new ramp to ease traffic congestion in South Hyderabad and the Old City.

Aug 26, 2026 - 08:24
 0  13
హైద‌రాబాద్‌లో కొత్త‌గా  2 వంతెన‌లు.. 1 ర్యాంప్‌.
Hyderabad to Get 2 New Bridges and 1 Ramp

పాతబస్తీ ట్రాఫిక్‌కు చెక్‌ పెట్టేందుకు 
ప్రభుత్వం మరో కీలక అడుగు

నిర్మాణాల అంచ‌నా వ్య‌యం.. రూ.385 కోట్లు

ఓవైసీ ఫ్లైఓవర్‌ నుంచి 
సంతోష్‌నగర్‌ వైపు కొత్త ర్యాంప్‌

హఫీజ్‌బాబానగర్‌-బాలాపూర్‌ 
మధ్య ఆరు లేన్ల వంతెన

బండ్లగూడ-ఎర్రకుంట వద్ద 
మరో ఆరు లేన్ల వంతెన

పనులకు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 
ఎంపికకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

నిర్మాణాలు పూర్తయితే పాతబస్తీ నుంచి 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సులువు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌-సిటీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. పాతబస్తీతో పాటు దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేలా.. మరో రెండు భారీ వంతెనలు, ఓ ర్యాంప్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. హఫీజ్‌బాబానగర్‌ నుంచి బాలాపూర్‌ వరకు.. బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు ఆరు లేన్ల వంతెనలు రానున్నాయి. ఓవైసీ ఫ్లైఓవర్‌ నుంచి సంతోష్‌నగర్‌ వైపు వెళ్లేందుకు కొత్త ర్యాంప్‌ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా 385 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే.. పాతబస్తీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా పాతబస్తీ ట్రాఫిక్‌పై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లైఓవర్‌కు అదనంగా.. సంతోష్‌నగర్‌ వైపు వెళ్లేలా లెఫ్ట్‌ ర్యాంప్‌ నిర్మించనున్నారు. దీంతో ఫ్లైఓవర్‌ నుంచి దిగే వాహనాలకు మరింత సులభమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. మరోవైపు హఫీజ్‌బాబానగర్‌ జంక్షన్‌ నుంచి బాలాపూర్‌ 100 అడుగుల రోడ్డు వరకు ఆరు లేన్ల వంతెన నిర్మించనున్నారు. అలాగే బండ్లగూడ-ఎర్రకుంట ఎక్స్‌రోడ్‌ వద్ద మరో ఆరు లేన్ల వంతెన రానుంది.

ఈ రెండు ప్రాంతాలు ప్రస్తుతం ట్రాఫిక్‌ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కీలక జంక్షన్లు కావడంతో.. కొత్త వంతెనలు అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకల్లో వేగం పెరగనుంది. మూడు పనులను ఒకే ప్యాకేజీగా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 231.87 కోట్లుగా అంచనా వేసిన నిర్మాణ వ్యయానికి.. 4.68 శాతం అధికంగా 242.72 కోట్లకు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బిడ్‌ దాఖలు చేసింది. రెండుసార్లు టెండర్లు పిలిచినా సింగిల్‌ బిడ్‌ రావడంతో.. అదే సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

నిర్మాణ వ్యయంతో పాటు ఆస్తుల సేకరణను కలుపుకుంటే.. మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.385 కోట్లు అవసరమవుతాయని అంచనా. పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సంబంధిత సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయితే పాతబస్తీ, సంతోష్‌నగర్‌, బాలాపూర్‌, బండ్లగూడ, ఎర్రకుంట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

ముఖ్యంగా పాతబస్తీ నుంచి బాలాపూర్‌, శంషాబాద్‌ వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గాలు కీలకంగా మారనున్నాయి. జంక్షన్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా.. ఫ్లైఓవర్లు, ర్యాంప్‌ల ద్వారా ట్రాఫిక్‌ను వేగంగా తరలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. హెచ్‌-సిటీ కింద నగరవ్యాప్తంగా చేపడుతున్న మౌలిక వసతుల పనుల్లో.. ఈ మూడు నిర్మాణాలు దక్షిణ హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు ఎంతవరకు ఊరటనిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0