- అనుమతి తీసుకోకుండా బిల్డర్లు కడితే
- మున్సిపల్ అధికారులు ఊరుకుంటారా?
- కాస్త ప్లాన్‌కు విరుద్ధంగా కడితే.. ఓసీ జారీలో
- ఇబ్బంది పెడుతుంటారు కదా..
- 50 అంతస్తుల్లో జి+6 అంతస్తులు కడితే
- ఎలా కళ్లు మూసుకుంటారు?
ఆర్ఈజీ న్యూస్:
ఒక ఇంటి యజమాని కక్కుర్తి వల్ల ఇద్దరు వ్యక్తుల దుర్మరణం.. మరికొంత మంది పరిస్థితి ఆందోళనకరం.. యాభై గజాల్లో జి+ఆరు అంతస్తుల భవనం కట్టేందుకు ఎవరు అనుమతిచ్చారు? ఎవరి సహకారంతో ఇన్నిన్ని అంతస్తుల్లో సదరు వ్యక్తి భవనాల్ని కడుతున్నాడు? స్థానిక ప్రజాప్రతినిధుల అండ లేకుండా.. మున్సిపల్ అధికారుల ప్రమేయం లేకుండా.. యాభై గజాల్లో జి ప్లస్ ఆరు అంతస్తుల్ని కట్టడం ఒక సాధారణ వ్యక్తికి సాధ్యమేనా? ఆరు అంతస్తుల భవనాన్ని కడుతుంటే.. విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నట్లు? క్రమం తప్పకుండా వెళ్లడం... సదరు భవన యజమాని వద్దకెళ్లడం.. లంచాలు తీసుకుని రావడం.. ఇదే తతంగం కాకుండా ఇంకేం జరుగుతుంది చెప్పండి? అయినా, అనుమతులు లేకుండా నిర్మాణాల్ని కట్టడం పశ్చిమ హైదరాబాద్‌లో కొత్తేం కాదు.. మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే. ఎందుకో తెలుసా?
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ, ఖానామెట్, అంజయ్య నగర్.. ఇలా ఏ బస్తీలో అనుమతుల్లేకుండా అపార్టుమెంట్లను కట్టాలన్నా.. ఆ బ్రదర్స్‌కు ఆమ్యామ్యాలిస్తే సరిపోతుంది. ఏ కాలనీలో అయినా సరే.. స్థానిక సంస్థల అనుమతుల్లేకుండా.. అసలు వారి పర్మిషన్ తీసుకోకుండానే.. చాలామంది అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. అవి తక్కువ రేటుకు వస్తుంటాయి కాబట్టి.. ప్రజలు కూడా ఎలాగోలా వాటిని కొనుగోలు చేస్తుంటారు. పొరపాటున ఏ చిన్న బిల్డర్ అయినా.. సదరు బ్రదర్స్ అడిగినంత సొమ్ము చెల్లించకపోతే అంతే సంగతులు.
ఆ భవన నిర్మాణ పనుల్లో ఒక్క ఇటుక కూడా ముందు పడదు. అవసరమైతే ఒక అంతస్తు అదనంగా వేసి అయినా.. తమకు సొమ్ము చెల్లించాల్సిందేనని వీరు హుకుం జారీ చేస్తుంటారు. వీరి అక్రమ నిర్మాణాల జాబితా స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు తెలుసు, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తెలుసు, హైడ్రాకు అంతేకంటే ఎక్కువ తెలుసు. స్థానిక రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. అయినా, అధికారంలో ఉన్నవారేం చేసినా చెల్లుతుందనే రీతిలో.. వీరంతా చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఏదీఏమైనా, ఒక భవన నిర్మాణ యజమాని దురాశ వల్ల.. ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు అకారణంగా దుర్మరణం చెందారు. మరణించిన వారి కుటుంబాల నేపథ్యం ఏమిటి? వారి కుటుంబానికి అండగా నిలిచేదెవరు?
* స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకునే బిల్డర్లు.. కొంత డీవియేషన్ చేస్తేనే.. ఎన్వోసీ ఇవ్వకుండా బిల్డర్లను అధికారుల్ని వేధిస్తుంటారు కదా.. అలాంటప్పుడు, అసలు అనుమతి తీసుకోకుండా.. ఐదారు అంతస్తులు వేస్తుంటే.. మున్సిపల్ అధికారులు కళ్లు మూసుకుని అక్రమార్కులను ఎలా వదిలేస్తుంటారు?