గోడకు పగులు వస్తే భయపడాలా?

Cracks in walls are not always a sign of structural danger. Minor hairline cracks may develop due to plaster drying, temperature changes or moisture.

Oct 23, 2026 - 03:31
 0  4
గోడకు పగులు వస్తే భయపడాలా?
wall-cracks-causes-and-home-safety-tips
  • చిన్న పగుళ్లన్నీ ప్రమాదకరం కావు
  • కానీ నిర్లక్ష్యం చేయొద్దు
 
ఇంట్లో గోడకు చిన్న పగులు కనిపిస్తే చాలామందికి వెంటనే ఆందోళన మొదలవుతుంది. ఇల్లు బలహీనపడుతోందా? భవిష్యత్తులో ప్రమాదం ఉందా? అనే సందేహాలు వస్తాయి. అయితే గోడపై కనిపించే ప్రతి పగులు నిర్మాణపరమైన సమస్యకు సంకేతం కాదు.
కొన్ని పగుళ్లు ప్లాస్టర్‌ ఎండిపోవడం, ఉష్ణోగ్రత మార్పులు, తేమ వంటి కారణాలతో ఏర్పడే సాధారణ పగుళ్లు కావచ్చు. అదే సమయంలో కొన్ని రకాల పగుళ్లు భవనం నిర్మాణం, పునాది లేదా నేల కదలికకు సంబంధించిన సమస్యలను సూచించే అవకాశం ఉంది.
భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) కూడా భవనాల్లో పగుళ్లు సాధారణంగా కనిపిస్తాయని, వాటికి నిర్మాణంపై పడే భారం, పునాది కూర్చోవడం, ఉష్ణోగ్రత మార్పులు, తేమ, రసాయన ప్రభావాలు తదితర కారణాలు ఉండవచ్చని పేర్కొంటోంది. పగులు ప్లాస్టర్‌ లేదా పెయింట్‌ పొరలో మాత్రమే ఉందా? లేక ఇటుక గోడ, కాంక్రీట్‌, బీమ్‌, పిల్లర్‌ వరకు వెళ్లిందా? అనేది చాలా ముఖ్యం.
చాలా పలుచగా, జుట్టు తీగలా కనిపించే పగుళ్లు ప్లాస్టర్‌ లేదా పెయింట్‌ పొరలో ఏర్పడితే సాధారణంగా పెద్ద నిర్మాణపరమైన ప్రమాదానికి సంకేతం కాకపోవచ్చు. కొత్తగా నిర్మించిన ఇళ్లలో ప్లాస్టర్‌ ఎండే సమయంలో వచ్చే క్రాక్స్ కూడా సాధారణమే. అయితే పగులు రోజులు గడిచేకొద్దీ వెడల్పవుతుంటే, పొడవవుతుంటే లేదా అదే ప్రాంతంలో కొత్త పగుళ్లు ఏర్పడుతుంటే మాత్రం నిపుణుడి పరిశీలన అవసరం.
 
ఇవి కనిపిస్తే అప్రమత్తం
 
1. తలుపులు, కిటికీల మూలల నుంచి వచ్చే వాలుగా ఉన్న పగుళ్లు:
తలుపు లేదా కిటికీ మూల నుంచి గోడలోకి వికర్ణంగా వెళ్లే పగుళ్లు భవనం కదలిక లేదా అసమానంగా కూర్చోవడం వంటి సమస్యలకు సంబంధించినవై ఉండొచ్చు.
 
2. ఇటుక గోడల్లో మెట్ల ఆకారంలో పగుళ్లు:
ఇటుకల మధ్య సిమెంట్‌ జాయింట్ల వెంట మెట్ల మాదిరిగా ఏర్పడే క్రాక్స్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గోడ లేదా పునాది కదలికకు సంకేతం కావచ్చు.
 
3. బీమ్‌, పిల్లర్‌ లేదా స్లాబ్‌పై పగుళ్లు:
గోడ ప్లాస్టర్‌కు పరిమితమైన పగులుతో పోలిస్తే.. బీమ్‌, పిల్లర్‌, స్లాబ్‌ వంటి ప్రధాన నిర్మాణ భాగాల్లో కనిపించే పగుళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకంగా పగులు పెరుగుతుంటే నిపుణుడిని సంప్రదించాలి. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం భవనంలో స్టక్చరల్ క్రాక్స్ వంటివి కనిపిస్తే నిర్మాణ భద్రతను అంచనా వేయడం అవసరం.
 
4. గోడతోపాటు నేల కూడా అసమంగా మారడం:
పగుళ్లతో పాటు ఫ్లోర్‌ వాలుగా మారడం, తలుపులు సరిగ్గా మూసుకోకపోవడం, కిటికీలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే విషయం మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
 
5. పగులతో పాటు తేమ, నీటి మరకలు:
పగులు ఉన్న ప్రాంతంలో తేమ లేదా నీటి మరకలు ఉంటే.. నీరు గోడలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల ప్లాస్టర్‌ దెబ్బతినడంతో పాటు, కాంక్రీట్‌లోని రీన్‌ఫోర్స్‌మెంట్‌ స్టీల్‌కు తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది.
 
పగులు కనిపించగానే పెయింట్‌ కొట్టేయొద్దు
 
చాలామంది చేసే మొదటి పని పగులు కనిపించిన వెంటనే వాల్‌ పుట్టీ వేసి పెయింట్‌ చేయడం. ఇది ఉపరితల పగుళ్లకు సరైన పరిష్కారం కావచ్చు. కానీ నిర్మాణపరమైన సమస్య ఉంటే మాత్రం పగులు మూసివేయడం వల్ల అసలు సమస్య పరిష్కారం కాదు. పగులు కనిపించిన వెంటనే దాన్ని ఫొటో తీసి, తేదీ నమోదు చేసి, వెడల్పును కొలిచి ఉంచడం మంచిది.
కొన్ని వారాల తర్వాత మళ్లీ పరిశీలిస్తే మార్పు వచ్చిందో లేదో తెలుస్తుంది. పగులు పెరుగుతున్నట్లయితే లేదా దాని వెంట ఇతర నిర్మాణ సమస్యలు కనిపిస్తే నిపుణులను సంప్రదించాలి. అపార్ట్‌మెంట్‌లో ఉంటే.. పగులు మీ ఫ్లాట్‌ గోడకే పరిమితమా, లేక కామన్ వాల్ /బీమ్‌/పిల్లర్‌ ప్రాంతంలోనిదా అనేది కూడా తెలుసుకోవాలి. నిర్మాణ భాగానికి సంబంధించిన సమస్య అనుమానం ఉంటే అసోసియేషన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయడం మంచిది.
 
కొత్త ఫ్లాట్‌లో పగుళ్లు వస్తే?
 
కొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో పగుళ్లు కనిపిస్తే వాటిని చిన్న సమస్యగా తీసుకోకుండా హ్యాండోవర్‌/పొజెషన్‌ సమయంలోనే ఫొటోలు, వీడియోలతో రికార్డు చేయడం ఉపయోగకరం. గోడలు, సీలింగ్‌, బీమ్‌లు, పిల్లర్లు, కిటికీ-తలుపుల మూలలను పరిశీలించాలి. సమస్య పునరావృతమవుతుంటే కేవలం పుట్టీతో సరి చేయకుండా కారణాన్ని గుర్తించాలి. గోడకు పగులు వచ్చింది అంటే ఇల్లు కూలిపోతుందని కాదు.
అలాగే ప్రతి పగులును “సాధారణమే” అని కొట్టిపారేయడం కూడా సరికాదు. పగులు ఎక్కడ ఉంది? ఏ దిశలో ఉంది? ఎంత వెడల్పుగా ఉంది? పెరుగుతోందా? దానితోపాటు తేమ, నేల వాలు, తలుపులు-కిటికీల సమస్యలు ఉన్నాయా? అన్నింటినీ కలిపి చూడాలి. సందేహం ఉంటే రంగులు, పుట్టీలతో దాచడం కంటే నిర్మాణ నిపుణుడితో పరీక్ష చేయించడం ఇంటిని కాపాడుకోవడానికి సరైన మార్గం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0