కోకాపేట్‌లోని ట్రెండ్‌సెట్ జయభేరి ఎలివేట్ ప్రాజెక్టులో అనుమతించిన ప్లాన్‌లో మార్పులు చేసి, వాటిని కొనుగోలుదారులకు సరిగా వెల్లడించలేదన్న కేసులో తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (REAT) కీలక తీర్పు ఇచ్చింది. ప్రాజెక్ట్ ప్రమోటర్‌పై విధించిన రూ.27.5 లక్షల జరిమానాను ట్రిబ్యునల్ సమర్థించింది.
ఈ ప్రాజెక్టులో ఒక కొనుగోలుదారు తొలుత 2,835 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.1.89 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుని రూ.1.55 కోట్లు చెల్లించారు. ఆ లావాదేవీ రద్దు కాగా, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించారు. అనంతరం 4,094 చదరపు అడుగుల మరో ఫ్లాట్‌ను రూ.2.41 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి 2022 ఏప్రిల్‌లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ జరిగింది.
అసలు అనుమతిలో ప్రాజెక్ట్‌లోని అమెనిటీస్ బ్లాక్ గ్రౌండ్+2 అంతస్తులుగా ఉంది. 2023 మే 25న జారీ చేసిన సవరించిన అనుమతిలో దాన్ని గ్రౌండ్+3 అంతస్తులుగా మార్చారు. అయితే ఈ సవరించిన ప్లాన్‌ను 2023 జూన్ 6న జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో సరిగా వెల్లడించలేదని ట్రిబ్యునల్ పేర్కొంది.
ప్రాజెక్ట్‌లో కీలక మార్పులకు అవసరమైన మూడింట రెండొంతుల మంది కొనుగోలుదారుల సమ్మతి పొందినట్లు ప్రమోటర్ నిరూపించలేకపోయారని కూడా రీట్ తెలిపింది. అంతేకాకుండా, క్లబ్‌హౌస్‌లో అదనపు అంతస్తు నిర్మించినందున, దానికి సంబంధించిన ఉమ్మడి హక్కును అలాటీల సంఘానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రమోటర్‌పై ఉందని స్పష్టం చేసింది.
కొనుగోలుదారులకు ముఖ్యమైన విషయం: బ్రోచర్‌లో చూపించిన ఫ్లాట్ లేదా అమెనిటీస్ మాత్రమే కాకుండా, ఆ ప్రాజెక్ట్‌కు మంజూరైన ప్లాన్, సవరించిన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, కామన్ ఏరియాల వివరాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. మీరు కొనుగోలు చేస్తున్నది బ్రోచర్‌లో హామీ ఇచ్చినదేనా, అధికారికంగా అనుమతించినదేనా, తర్వాత మార్పులు జరిగితే వాటికి అవసరమైన సమ్మతి తీసుకున్నారా? అనే మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లడం సురక్షితం.