నిర్మాణ స్థలంలో..  బిల్డింగ్‌ పర్మిట్‌ తప్పనిసరి

The Telangana High Court has directed the GHMC to ensure that building permission details are clearly displayed at construction sites in Hyderabad, so residents, buyers and officials can verify whether construction is authorised.

Sep 19, 2026 - 01:38
 0  6
నిర్మాణ స్థలంలో..   బిల్డింగ్‌ పర్మిట్‌ తప్పనిసరి
telangana-high-court-ghmc-building-permission-display-construction-sites
  • జీహెచ్‌ఎంసీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
  • అనుమతులు లేని నిర్మాణాలు నిలిపివేయాలి..
  • నిబంధనలు ఉల్లంఘిస్తే సీలింగ్‌ చేయాలని స్పష్టీకరణ

నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హైదరాబాద్‌లోని నిర్మాణ స్థలాల్లో బిల్డింగ్‌ అనుమతులను స్పష్టంగా ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)ని ఆదేశించింది. చిన్న ప్లాట్లకు కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ.. నిర్మాణ అనుమతుల వివరాలను స్థలంలో అందరికీ కనిపించేలా ఉంచాలని స్పష్టం చేసింది. 

నిర్మాణ స్థలంలో అనుమతి వివరాలు కనిపించేలా ఉంటే స్థానికులు, కొనుగోలుదారులు, అధికారులు భవనం చట్టబద్ధంగా నిర్మిస్తున్నారా లేదా అనేది సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే వాటిని నిలిపివేయాలని కూడా కోర్టు జీహెచ్ఎంసీకి సూచించింది. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలను సీల్‌ చేసే చర్యలు చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

 ముఖ్యంగా సిద్దియంబర్‌ బజార్‌, బేగంబజార్‌ సర్కిళ్ల పరిధిలో నిర్మాణాలను పరిశీలించి, అనుమతులు లేని పనులను నిలిపివేయాలని సూచించింది. చేపట్టిన చర్యలపై కోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. సిద్దియంబర్‌ బజార్‌కు చెందిన వ్యాపారి రాజ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. భవనంలో అదనపు అంతస్తులకు క్రమబద్ధీకరణ కోరుతూ తాను చేసిన దరఖాస్తులపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని ఆయన కోర్టును ఆశ్రయించారు.

అయితే సంబంధిత భవన అనుమతుల దరఖాస్తులను లోపాలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా తిరస్కరించినట్లు జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. షోకాజ్‌ నోటీసులు ఇచ్చినప్పటికీ నిర్మాణం కొనసాగిందని పేర్కొంది. ఈ కేసులో చిన్న ప్లాట్లకు వర్తించే ఒక రూపాయి టోకెన్‌ ఫీజు నిబంధన కూడా ప్రస్తావనకు వచ్చింది. 

75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు తెలంగాణ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ చట్టం, 2020 కింద ఈ వెసులుబాటు ఉంది. పిటిషనర్‌ మొత్తం 114.14 చదరపు గజాల భూమిపై హక్కు ఉందని చెబుతుండగా.. కేవలం 43.29 చదరపు మీటర్లకు తన పేరుతో అనుమతి కోరారని జీహెచ్ఎంసీ తెలిపింది. మిగిలిన భాగాలను మరో ముగ్గురి పేర్లకు విభజించి ఈ నిబంధనను ఉపయోగించుకునే ప్రయత్నం జరిగిందని పేర్కొంది.

సంబంధిత స్థలం పరిమాణానికి నిబంధనల ప్రకారం గ్రౌండ్‌ ప్లస్‌ రెండు అంతస్తులు మాత్రమే నిర్మించేందుకు అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన తర్వాత క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా హక్కు ఏర్పడదని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు ఆదేశాలతో నగరంలో కొనసాగుతున్న నిర్మాణాలపై జీహెచ్ఎంసీ తనిఖీలు పెంచే అవకాశం ఉంది.

 ముఖ్యంగా అనుమతుల వివరాలను నిర్మాణ స్థలంలోనే ప్రదర్శించాల్సి రావడంతో బిల్డింగ్‌ ఎత్తు, అనుమతించిన అంతస్తులు, సంబంధిత అనుమతి వంటి అంశాలపై పారదర్శకత పెరగనుంది. అక్రమ నిర్మాణాలను మొదటి దశలోనే గుర్తించి నిలిపివేయడమే ఈ ఆదేశాల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో నిర్మాణ అనుమతులు పొందిన తర్వాత వాటికి విరుద్ధంగా అదనపు అంతస్తులు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టే అవకాశాలపైనా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0