సోషల్ మీడియా హైప్‌.. రియల్‌ ఎస్టేట్‌ ట్రాప్‌

Social media promotions and attractive project videos are increasingly being used to lure real estate investors with promises of high returns.

Nov 13, 2026 - 07:40
Nov 16, 2026 - 01:59
 0  21
సోషల్ మీడియా హైప్‌.. రియల్‌ ఎస్టేట్‌ ట్రాప్‌
సోషల్ మీడియా హైప్‌.. రియల్‌ ఎస్టేట్‌ ట్రాప్‌. (AI)

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు స్థలం ఎక్కడుంది? రోడ్డు సౌకర్యం ఉందా? భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయి? అని పరిశీలించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మొబైల్‌లో ఓ వీడియో కనిపిస్తే చాలు.. అందులో చెప్పిన ప్రాజెక్ట్‌ ఎంత అద్భుతంగా ఉందో, భవిష్యత్తులో ఎంత లాభం వస్తుందో విని చాలామంది పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు.

యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికలు రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు సోషల్‌ మీడియా హైప్‌ను మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. చూడటానికి ఆకర్షణీయమైన వీడియోలు.. డ్రోన్‌ షాట్లు, విశాలమైన రోడ్లు, గ్రీన్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టుల విజువల్స్‌.. ఇలా తెరపై ఓ అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తున్నారు.

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భూమి యాజమాన్య వివాదాలు, అనుమతుల లోపాలు, అసంపూర్తి మౌలిక వసతులు ఉండొచ్చు. ప్రచార వీడియోలో కనిపించే ప్రాజెక్టుకు, వాస్తవంగా స్థలంలో ఉన్న పరిస్థితికి పొంతన లేకపోవడమే అసలు ప్రమాదం.

ప్రమోషన్ల వెనుక పెయిడ్‌ గేమ్‌

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ప్రచారం కల్పించేందుకు కొందరు డెవలపర్లు భారీ ఫాలోయింగ్‌ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆశ్రయిస్తున్నారు. ఆయా వెంచర్లను సందర్శించినట్లు వీడియోలు చేస్తూ.. త్వరలోనే ధరలు రెట్టింపు అవుతాయని, ఇప్పుడే పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు.

పరిమిత ప్లాట్లు మాత్రమే మిగిలాయని, వెంటనే అడ్వాన్స్‌ చెల్లించాలని హడావుడి సృష్టిస్తున్నారు. అయితే ఇవి నిజమైన రివ్యూలా? లేక డబ్బులు తీసుకుని చేస్తున్న పెయిడ్‌ ప్రమోషన్లా? అన్నది కొనుగోలుదారులకు స్పష్టంగా తెలియడం లేదు.

ఇదీ చదవండి: రూ.50 లక్షలు దాటిన ఆస్తుల  కొనుగోలుపై టీడీఎస్‌ జాగ్రత్తలు

రెరా అనుమ‌తి ఉందా?

రియల్‌ ఎస్టేట్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం, వర్తించే ప్రాజెక్టులకు టీజీ రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్‌ చేయడం, విక్రయించడం అనుమతించబడదు.

సెక్షన్‌ 11(2) ప్రకారం ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, అధికారిక వెబ్‌సైట్‌ వివరాలు ఉండాలి. తెలంగాణలో టీజీ రెరా వెబ్‌సైట్‌ ద్వారా ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్‌, అనుమతుల వివరాలు పరిశీలించవచ్చు. అధికారిక పోర్టల్‌లో 11,210 రిజిస్టర్డ్‌ ప్రాజెక్టులు, 5,231 రిజిస్టర్డ్‌ ఏజెంట్లు, 2,958 ఫిర్యాదుదారుల వివరాలు నమోదయ్యాయి.

అయితే టీజీ రెరా రిజిస్ట్రేషన్‌ ఉందని మాత్రమే భూమి పూర్తిగా వివాదరహితమని భావించకూడదు. భూమి యాజమాన్య పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు, హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ వంటి సంస్థల లేఅవుట్‌ అనుమతులు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ వంటి అంశాలను విడిగా పరిశీలించాలి.

  • కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే.
  • సోషల్‌ మీడియా వీడియో చూసి ప్లాట్‌ కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దు.
  • టీజీ రెరాలో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పరిశీలించాలి.
  • హెచ్ఎండీఏ, డీటీసీపీ లేదా సంబంధిత సంస్థల అనుమతులు ధ్రువీకరించాలి.
  • లింక్‌ డాక్యుమెంట్లు, భూమి యాజమాన్య హక్కులను న్యాయ నిపుణుడితో పరిశీలించాలి.
  • వెంచర్‌ను ప్రత్యక్షంగా సందర్శించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, తాగునీటి సదుపాయాలు చూడాలి.
  • తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామనే ఆఫర్లకు, వెంటనే అడ్వాన్స్‌ చెల్లించాలనే ఒత్తిడికి లొంగవద్దు.

డిజిటల్‌ నమ్మకమే పెట్టుబడికి హామీ కాదు.

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి అనేది జీవితకాల సంపాదనతో ముడిపడిన నిర్ణయం. అందమైన వీడియోలు, లక్షల వ్యూస్‌, వేలాది లైకులు ఒక ప్రాజెక్టుకు చట్టబద్ధతను తీసుకురావు. సోషల్‌ మీడియాలో కనిపించే హైప్‌కు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాను గుర్తించలేకపోతే నష్టపోయేది కొనుగోలుదారులే.

ప్రచారం చేసే వారి బాధ్యత, ప్రాజెక్టు యజమానుల జవాబుదారీతనం, ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ బలపడాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. రీల్‌లో కనిపించే వెంచర్‌ను నమ్మే ముందు.. రియల్‌గా వెళ్లి పరిశీలించండి.

ఇదీ చదవండి: టైర్‌-2 నగరాల్లో స్థిరాస్తి పెట్టుబడి.. ప్లాటా? ఇల్లా?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0