నిర్మాణ రంగంలోకి రోబోలొస్తాయ్

CREDAI Chairman Boman Rustom Irani said the use of AI and robotics in real estate construction is expected to increase significantly.

Oct 6, 2026 - 05:53
 0  53
నిర్మాణ రంగంలోకి రోబోలొస్తాయ్
robots-enter-construction-skilled-jobs-to-gain-importance

-      కానీ ఉద్యోగాలు పోవు, నైపుణ్యానికి మరింత డిమాండ్‌

-      క్రెడాయ్‌ ఛైర్మన్‌ బొమన్ ఇరానీ వెల్లడి

రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ వినియోగం రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనుందని క్రెడాయ్‌  ఛైర్మన్‌ బోమన్‌ రుస్తమ్‌ ఇరానీ తెలిపారు. నిర్మాణ పనుల్లో ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన, అత్యంత కచ్చితత్వం అవసరమయ్యే పనులను రోబోలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అయితే దీనివల్ల మానవ శ్రమకు విలువ తగ్గదని.. నైపుణ్యం కలిగిన కార్మికులకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పెరుగుతుందని స్పష్టం చేశారు.

కోల్‌కతాలో జరిగిన క్రెడాయ్ నాట్ కాన్ 2026 ముగింపు కార్యక్రమంలో నిర్మాణ రంగ భవిష్యత్తుపై ఇరానీ మాట్లాడారు. నిర్మాణ ప్రదేశాల్లో పలు దశల్లో కార్మికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, అలాంటి పనులను రోబోలతో చేయించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో పనులు, భారీ వస్తువుల నిర్వహణ, పదేపదే చేయాల్సిన పనులు, అత్యంత కచ్చితత్వంతో చేయాల్సిన కార్యకలాపాల్లో రోబోటిక్స్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

యంత్రాలు మనుషులతో కలిసి పనిచేస్తే భద్రత, నాణ్యత, వేగం మెరుగుపడటంతో పాటు నిర్మాణంలో జరిగే పొరపాట్లు, వృథా కూడా తగ్గే అవకాశం ఉందని వివరించారు. రోబోటిక్స్‌ వల్ల నిర్మాణ పనుల్లో మరింత ఏకరీతి, కచ్చితత్వం సాధ్యమవుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ ఎంత అవసరం, ఏ దశలో ఎంత పని చేయాలి వంటి అంశాలను ముందుగానే అంచనా వేయడానికి సాంకేతికత సహాయపడుతుందని తెలిపారు.

కార్మికుల ఉద్యోగాలకు ముప్పు ఉండదా?

నిర్మాణ రంగంలో ఆటోమేషన్‌ పెరుగుతుండటంతో కార్మికుల ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోబోలు మనుషులను పూర్తిగా భర్తీ చేయడం లక్ష్యం కాదని, యంత్రాలు-మానవ వనరులు పరస్పరం సహకరించే విధంగా నిర్మాణ రంగం మారుతుందని తెలిపారు. యంత్రాలను నిర్వహించడం, వాటి పనితీరును పర్యవేక్షించడం, క్లిష్టమైన నిర్మాణ నిర్ణయాలు తీసుకోవడం, సైట్‌లో అనూహ్య పరిస్థితులను పరిష్కరించడం వంటి వాటికి అనుభవం, నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే సాధారణ శారీరక శ్రమకు బదులుగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నైపుణ్య కార్మికుల అవసరం పెరగనుంది.

AIతో పాటు 3డీ ప్రింటింగ్‌ కూడా

నిర్మాణ రంగంలో మార్పు కేవలం రోబోలకే పరిమితం కాకుండా AI, డ్రోన్‌ మానిటరింగ్‌, 3డీ ప్రింటింగ్‌, డిజిటల్‌ క్వాలిటీ చెక్స్‌ వంటి టెక్నాలజీల వినియోగం కూడా పెరుగుతోంది. నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయా? నాణ్యతలో ఏమైనా లోపాలున్నాయా? షెడ్యూల్‌ నుంచి పని ఎక్కడైనా తప్పుతోందా? వంటి అంశాలను సాంకేతికత ద్వారా నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంది. 3డీ ప్రింటింగ్‌ ద్వారా ఒకే రకమైన నిర్మాణ భాగాలను ఎక్కువ కచ్చితత్వంతో, పునరావృతంగా తయారు చేయడం సాధ్యమవుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నిర్మాణ సమయం, వృథా, మానవ తప్పిదాలు తగ్గే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0