పుప్పాలగూడలో రెండు భారీ ప్రాజెక్టులకు టీజీ రెరా ఊరట
SUMMARY The Telangana Real Estate Appellate Tribunal has upheld TG-RERA registrations for Phoenix Global Spaces' Triton and Sumadhura Constructions' Sumadhura Palace Royale projects in Puppalaguda, dismissing an appeal over alleged land overlap and lake-related violations.
- భూ వివాదంపై ట్రిబ్యునల్ కీలక తీర్పు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుప్పాలగూడలోని ఫీనిక్స్ గ్లోబల్ స్పేసెస్, సుమధుర కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులకు ఇచ్చిన టీజీ రెరా రిజిస్ట్రేషన్లను రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సమర్థించింది.
భూమి వివాదం, నార్సింగి చెరువు-2పై నిర్మాణ ఆరోపణలతో దాఖలైన అప్పీల్‌ను మెజారిటీ సభ్యులు కొట్టివేశారు. అయితే, ట్రిబ్యునల్‌లోని మరో సభ్యుడు మాత్రం భూమి వివరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ భిన్నాభిప్రాయం తెలిపారు. అసలు ఈ వివాదం ఏమిటి? ట్రిబ్యునల్ ఏం చెప్పింది?
పుప్పాలగూడలో ఫీనిక్స్ గ్లోబల్ స్పేసెస్ చేపట్టిన కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రిటాన్’, సుమధుర కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘సుమధుర ప్యాలెస్ రాయల్’ టీజీ రెరా రిజిస్ట్రేషన్లపై వివాదం నెలకొంది. సర్వే నంబర్లు 272/P, 273/Pలో ఒకే భూమికి సంబంధించి రెండు ప్రాజెక్టులకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్లు ఇచ్చారని డాక్టర్ లుబ్నా సర్వత్ అప్పీల్ దాఖలు చేశారు.
ఈ భూమి నార్సింగి చెరువు-2 పరిధిలో ఉందని, భూ వివాదాలు, కోర్టు కేసులు, హెచ్చరిక నోటీసుల వివరాలను వెల్లడించలేదని ఆమె ఆరోపించారు. అయితే, డెవలపర్లు మాత్రం రెండు ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో, వేర్వేరు అవసరాల కోసం చేపట్టినవని వాదించారు.
సంబంధిత సర్వే నంబర్లలో చెరువు ఉన్నట్లు ఆధారాలు లేవని 2023లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. ఆ తీర్పుపై లుబ్నా సర్వత్ దాఖలు చేసిన అప్పీల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఈ కేసును విచారించిన ట్రిబ్యునల్ ఛైర్పర్సన్ జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ వేముల శ్రీకర్ మెజారిటీ అభిప్రాయంతో అప్పీల్‌ను కొట్టివేశారు. రెరా చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం అప్పీలుదారు బాధిత వ్యక్తి కాదని పేర్కొన్నారు. చెరువు, భూ వినియోగం, అనుమతులకు సంబంధించిన అంశాలు ఇతర చట్టాలు, సంబంధిత ఫోరమ్‌ల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేస్తూ రెండు ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లను సమర్థించారు.
అయితే, జ్యుడీషియల్ మెంబర్ పి. ప్రదీప్ కుమార్ రెడ్డి మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నంబర్లలో, ఒకే భూమి విస్తీర్ణంతో రెండు ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్లు ఎలా ఇచ్చారో ప్రశ్నించారు. భూమి సరిహద్దుల స్పష్టత, జియో ఫెన్సింగ్ వివరాలు లేవని అభ్యంతరం తెలిపారు.
అంతేకాకుండా, డెవలప్మెంట్ అగ్రిమెంట్లో పేర్కొన్న భూమికి, ప్రాజెక్ట్ రికార్డుల్లో చూపిన విస్తీర్ణానికి మధ్య తేడా ఉందని ప్రస్తావించారు. అవసరమైన వివరాలు వెల్లడించే వరకు రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని, మార్కెటింగ్, బుకింగ్స్, అడ్వాన్స్ వసూళ్లను ఆపాలని, టీజీ రెరా స్థలాన్ని తనిఖీ చేసి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.
అయితే ఇవి ఆయన భిన్నాభిప్రాయంలోని సూచనలు మాత్రమే. మెజారిటీ తీర్పులో ఇవి భాగం కావు. ఈ తీర్పు నేపథ్యంలో ప్రాపర్టీ కొనుగోలుదారులు, కమర్షియల్ ఇన్వెస్టర్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
రెరా రిజిస్ట్రేషన్ ఉందని మాత్రమే పెట్టుబడి పెట్టకుండా, సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, టైటిల్ డాక్యుమెంట్లు, డెవలప్మెంట్ అగ్రిమెంట్లు, భవన నిర్మాణ అనుమతులను ధృవీకరించుకోవాలి. భూమి వివరాలు, వాస్తవ స్థల పరిస్థితులు సరిపోతున్నాయో లేదో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: వంద ఫీట్ల రోడ్డు.. సెవెన్ హిల్స్, మిడోస్ వాసుల్లో ఆందోళన
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0