ముంబయిలో లగ్జరీ ఇళ్ల జోరు.. రోజుకు 17 లావాదేవీలు

Mumbai’s luxury housing market recorded 3,145 transactions worth ₹32,623 crore for homes priced above ₹5 crore during the first half of FY2026 (April–September), averaging around 17 sales a day, according to a report by Lighthouse Luxury.

Oct 27, 2026 - 06:41
Oct 28, 2026 - 06:43
 0  39
ముంబయిలో లగ్జరీ ఇళ్ల జోరు.. రోజుకు 17 లావాదేవీలు
ముంబయిలో లగ్జరీ ఇళ్ల జోరు.. రోజుకు 17 లావాదేవీలు.
  • ఆరు నెలల్లో రూ.32,623 కోట్ల విక్రయాలు
  • రూ.50 కోట్లకు పైబడిన ఇళ్లపైనా పెరిగిన డిమాండ్‌

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విలాసవంతమైన ఇళ్ల మార్కెట్‌ దూసుకెళ్తోంది. రూ.5 కోట్లకు పైబడిన ధర కలిగిన ఇళ్ల విభాగంలో 2026 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఏకంగా 3,145 లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.32,623 కోట్లు. అంటే సగటున రోజుకు 17 ఇళ్ల విక్రయాలు జరిగాయి.

లైట్‌హౌస్‌ లగ్జరీ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)తో పోలిస్తే రెండో త్రైమాసికంలో (జులై–సెప్టెంబర్‌) రూ.5 కోట్లకు పైబడిన ఇళ్ల లావాదేవీలు 10.5 శాతం పెరిగి 1,651కి చేరాయి. వీటి విలువ 17.1 శాతం పెరిగి రూ.17,600 కోట్లుగా నమోదైంది.

తొలి త్రైమాసికంలో 1,499 లావాదేవీల ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా విలువైన విక్రయాలు జరిగాయి. జులై నెలలో అత్యధికంగా 618 ఇళ్ల విక్రయాలు జరిగి, వాటి విలువ రూ.6,669 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్‌ ఆంక్షలతో భారత్‌కు తిరిగొస్తారా?

రూ.50 కోట్లకు పైబడిన ఇళ్లకూ గిరాకీ

ముంబయి లగ్జరీ గృహ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇళ్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. రూ.50 కోట్లకు పైబడిన ధర కలిగిన ఇళ్ల విభాగంలో ఆరు నెలల్లో 29 లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.2,536 కోట్లు. తొలి త్రైమాసికంలో ఈ విభాగంలో 9 ఇళ్లు అమ్ముడవగా, రెండో త్రైమాసికంలో ఆ సంఖ్య 20కి పెరిగింది.

సెప్టెంబర్‌ నెలలోనే 9 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ధనవంతుల నుంచి అత్యంత ఖరీదైన నివాసాలపై డిమాండ్‌ పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రూ.20 కోట్లకు పైబడిన ఇళ్ల విక్రయాలు మొత్తం లావాదేవీల్లో పరిమాణం పరంగా 7 శాతమే అయినప్పటికీ, మొత్తం విక్రయ విలువలో వాటి వాటా 26 శాతంగా ఉంది.

ధరల విభాగాల వారీగా చూస్తే రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్ల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఈ విభాగంలో 2,212 ఇళ్లు అమ్ముడవగా, వాటి మొత్తం విలువ రూ.14,845 కోట్లు. ఒక్కో ఇంటి సగటు ధర రూ.6.7 కోట్లుగా ఉంది. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య ధర కలిగిన విభాగంలో 703 ఇళ్లు విక్రయమయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.9,399 కోట్లు.

ఒక్కో ఇంటి సగటు ధర రూ.13.4 కోట్లు. రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర ఉన్న విభాగంలో 201 ఇళ్ల విక్రయాలు జరిగాయి. వీటి విలువ రూ.5,842 కోట్లు కాగా, ఒక్కో ఇంటి సగటు ధర రూ.29.1 కోట్లుగా నమోదైంది.

ఇదీ చదవండి: మూడు కమర్షియల్ యూనిట్లు.. రూ.17 కోట్లు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0