మంచిరేవుల‌లో మంచి డిమాండ్‌

Manchirevula is emerging as a premium real estate hotspot in West Hyderabad, driven by its proximity to major IT hubs, growing demand for luxury villas and gated communities, and peaceful residential surroundings.

Nov 13, 2026 - 04:52
Nov 13, 2026 - 04:53
 0  44
మంచిరేవుల‌లో మంచి డిమాండ్‌

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ విస్తరణకు మరో కీలక కేంద్రంగా మంచిరేవుల ఎదుగుతోంది. నార్సింగి, గండిపేట, కోకాపేట్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాలకు చేరువలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన బలంగా మారింది. నగర రద్దీకి కొంత దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివాసం కోరుకునే కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలు మంచిరేవుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, ఓపెన్‌ ప్లాట్లకు ఈ ప్రాంతంలో ప్రత్యేక మార్కెట్‌ ఏర్పడుతోంది.

మంచిరేవుల రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో విల్లాలు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు రెండింటికీ ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా విశాలమైన 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు, స్విమ్మింగ్‌ పూల్‌, క్లబ్‌హౌస్‌, జిమ్‌, ఇండోర్‌ గేమ్స్‌, పిల్లల ఆటస్థలాలు, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లు, 24 గంటల భద్రత వంటి సదుపాయాలతో గేటెడ్‌ కమ్యూనిటీలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. విల్లాల విషయంలోనూ మంచిరేవుల ప్రత్యేకతను చాటుకుంటోంది. స్వతంత్ర నివాసం, ఎక్కువ ప్రైవసీ, సొంత స్థలం కోరుకునే కుటుంబాలకు ఇక్కడి విల్లా ప్రాజెక్టులు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. రాజపుష్ప ఇన్ఫినియా, శ్రీ ఆదిత్య వాంటేజ్‌, హాల్‌మార్క్‌ సన్నీసైడ్‌, గోల్డ్‌ఫిష్‌ వ్యోమా వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని నివాస మార్కెట్‌ వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.

ఐటీ హబ్‌లకు చేరువ.. కనెక్టివిటీ ప్రధాన బలం

మంచిరేవులకు నార్సింగి, గండిపేట, పుప్పాలగూడ, కోకాపేట్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాలతో రహదారి అనుసంధానం ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అందుబాటులో ఉండటంతో గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ వంటి ఐటీ ఉద్యోగ కేంద్రాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్‌ పరిస్థితులను బట్టి ప్రయాణ సమయం మారుతుంది. మరోవైపు గండిపేట చెరువు పరిసరాలు, పచ్చదనం, నగర రద్దీకి కొంత దూరంగా ఉండే వాతావరణం ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. నార్సింగి, గండిపేట పరిసరాల్లోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ కేంద్రాలు నివాస అవసరాలకు ఉపయోగపడుతున్నాయి.

నార్సింగి, కోకాపేట్‌, పుప్పాలగూడతో పోటీ

మంచిరేవులను ఒక ప్రాంతంగా మాత్రమే కాకుండా.. నార్సింగి, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట్‌, అల్కాపూర్‌ టౌన్‌షిప్‌, నెక్నాంపూర్‌ వంటి ప్రాంతాలతో కలిపి పరిశీలించాలి. కోకాపేట్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పరిసరాల్లో ప్రీమియం ధరలు కనిపిస్తుంటే.. మంచిరేవులలో వాటితో పోలిస్తే కొంత అందుబాటు ధరల్లో అపార్ట్‌మెంట్లు లభించే అవకాశముంది. విల్లాలు, విశాలమైన అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఒకే బడ్జెట్‌లో నార్సింగిలో ఫ్లాట్‌ కొనాలా? మంచిరేవులలో పెద్ద విస్తీర్ణం ఉన్న అపార్ట్‌మెంట్‌ తీసుకోవాలా? లేక విల్లా వైపు వెళ్లాలా? అనే అంశాలపై కొనుగోలుదారులు పోల్చి చూస్తున్నారు.

రేట్లు ఎలా ఉన్నాయ్‌?

మంచిరేవులలో స్థిరాస్తి ధరలు ప్రాజెక్టు, నిర్మాణ నాణ్యత, ఫ్లాట్‌ విస్తీర్ణం, సదుపాయాలు, నిర్మాణ దశను బట్టి మారుతున్నాయి. ప్రస్తుతం మంచిరేవులలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు సుమారు రూ.7,800 నుంచి రూ.9,200 మధ్య కనిపిస్తోంది. కాస్త ప్రీమీయం ప్రాజెక్టులలో చదరపు అడుగు రూ.9,500 నుంచి రూ.12,000 వరకు రేటుంది. ఈ వ్యత్యాసం రోడ్డు, ప్రాజెక్టు, లగ్జరీ, సదుపాయాలు వంటి వాటి  ఆధారంగా మారచ్చు. 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరలు కూడా విస్తీర్ణం, ప్రాజెక్టు స్థాయిని బట్టి మారుతున్నాయి. విల్లాల విషయంలో స్థలం, నిర్మాణ విస్తీర్ణం, ప్రాజెక్టు ప్రత్యేకతను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మంచిరేవులలో కొన్ని విల్లా ప్రాజెక్టుల్లో రూ.10.50 కోట్ల‌కు పైగా ధర ఉండగా, అత్యంత ప్రీమియం విల్లాల ధర మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్‌

ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కార్పొరేట్‌ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కార్యాలయాలకు చేరువలో నివాసం అవసరం. ఈ నేపథ్యంలో మంచిరేవులలోని గేటెడ్‌ కమ్యూనిటీలు, పెద్ద విస్తీర్ణం కలిగిన అపార్ట్‌మెంట్లకు అద్దె మార్కెట్‌లోనూ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబాలు, సీనియర్‌ ఉద్యోగులు, విదేశాల నుంచి తిరిగి వచ్చే వారు 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే గృహాలపై ఆసక్తి చూపుతున్నారు. మంచిరేవులలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు నెలకు సుమారు రూ.50 వేల నుంచి అద్దెలు ఉన్నాయి. ఫ్లాట్‌ విస్తీర్ణం, ఫర్నిషింగ్‌, ప్రాజెక్టు సదుపాయాలు, ఐటీ కార్యాలయాలకు దూరం ఆధారంగా అద్దెల్లో మార్పులు ఉంటాయి.

పెట్టుబడిదారులకు మరో ప్రత్యామ్నాయం

మొత్తంగా చూస్తే.. మంచిరేవుల కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా, పశ్చిమ హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌కు చేరువలో ప్రీమియం అపార్ట్‌మెంట్లు, విల్లాలు కోరుకునే వారికి మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. కోకాపేట్‌, నార్సింగి వంటి ప్రాంతాలతో పోలిస్తే ధరల పరంగా కొన్ని ప్రాజెక్టుల్లో అందుబాటు ఉండటం కూడా కొనుగోలుదారుల ఆసక్తికి కారణమవుతోంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్‌, హెచ్ఎండీఏ లేదా సంబంధిత సంస్థల అనుమతులు, భూమి టైటిల్‌ పత్రాలు, రహదారి సదుపాయాలు, నీటి వనరులు, డ్రైనేజీ వ్యవస్థ, ధరల సమంజసతను క్షేత్రస్థాయిలో పరిశీలించడం అవసరం. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0