మాటిచ్చి తప్పుతారా?
MahaRERA has ruled that developers cannot backtrack on commitments made to homebuyers at the time of booking.
- స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కడతామని చెప్పి మాట మార్చిన బిల్డర్
- రెరాను ఆశ్రయించిన కొనుగోలుదారు..
- టైపింగ్ తప్పిదం అంటూ వాదించిన బిల్డర్.. తోసిపుచ్చిన అథార్టీ
- ఆ హామీకి కట్టుబడి ఉండాలని ఆదేశం
ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు సమయంలో డెవలపర్ ఇచ్చే హామీలను తర్వాత మార్చడం కుదరదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను తామే భరిస్తామని హామీ ఇచ్చిన డెవలపర్.. తర్వాత ఆ ఖర్చులను కొనుగోలుదారుడిపై మోపలేరని కీలక తీర్పు ఇచ్చింది. అంతేకాదు, బుకింగ్ పత్రాల్లో చేసిన హామీని ‘టైపింగ్ తప్పిదం’గా పేర్కొంటూ తప్పించుకునే ప్రయత్నాన్ని కూడా తిరస్కరించింది.
ముంబై సమీపంలోని రాయ్‌గఢ్‌లోని ఓ ప్లాటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. ఓ కొనుగోలుదారు 2025 మార్చిలో ప్లాట్‌ను బుక్ చేసుకున్నారు. విక్రయ ధరతో పాటు మెయింటెనెన్స్ సెక్యూరిటీ డిపాజిట్, కార్పస్ ఫండ్ కలిపి మొత్తం రూ.1.66 కోట్లు చెల్లించారు. 2025 మార్చి 11న డెవలపర్ నుంచి అలాట్‌మెంట్ లెటర్ జారీ అయింది. అదే తేదీన సేల్ అగ్రిమెంట్ కూడా రూపొందించినప్పటికీ అది రిజిస్టర్ కాలేదు.
అలాట్‌మెంట్ లెటర్‌లో మాత్రం ప్లాట్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను డెవలపర్ భరిస్తారని పేర్కొన్నారు. కొంతకాలం తర్వాత సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ఖర్చులను కొనుగోలుదారుడే భరించాలని డెవలపర్ కోరారు. దీనిపై కొనుగోలుదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుకింగ్ సమయంలో ఒక విధంగా చెప్పి, రిజిస్ట్రేషన్ సమయంలో మరో విధంగా వ్యవహరించడం సరికాదని మహారెరాను ఆశ్రయించారు.
అయితే డెవలపర్ మాత్రం తన వాదనను సమర్థించుకునేందుకు అలాట్‌మెంట్ లెటర్‌లో ‘స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మేమే చెల్లిస్తాం’ అనే నిబంధన టైపింగ్ తప్పిదం వల్ల వచ్చిందని పేర్కొంది. తర్వాత రూపొందించిన అగ్రిమెంట్‌లో ఆ బాధ్యత కొనుగోలుదారుడిదేనని, అందువల్ల తాము ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని వాదించింది. ఈ వాదనను మహారెరా అంగీకరించలేదు. కొనుగోలుదారుడికి అలాట్‌మెంట్ లెటర్ ఇచ్చిన విషయాన్ని, అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బు స్వీకరించిన విషయాన్ని అథారిటీ పరిగణనలోకి తీసుకుంది.
2025 జనవరి 7న డెవలపర్ మహారెరా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన డివియేషన్ రిపోర్ట్‌లో కూడా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను డెవలపరే భరిస్తారని స్పష్టంగా పేర్కొంది. అంటే అలాట్‌మెంట్ లెటర్‌లోని నిబంధన ఒక్కచోట మాత్రమే కనిపించిన పొరపాటు కాదని, ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లలోనూ అదే అంశం ఉందని అథారిటీ గుర్తించింది. అందువల్ల, ‘టైపింగ్ మిస్టేక్’ అంటూ తర్వాత బాధ్యతను కొనుగోలుదారుడిపైకి నెట్టడం సాధ్యం కాదని మహారెరా తేల్చింది. డెవలపర్ తన ప్రాజెక్టు డిస్క్లోజర్లు, అలాట్‌మెంట్ పత్రాల్లో చేసిన హామీలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0