బ్రోకరేజీలో ఒక శాతం ఇవ్వాల్సిందే
MahaRERA has ruled that a real estate agent must honour a written promise to share 1% of the brokerage with a homebuyer. The case involved a Mumbai buyer who purchased a flat in a high-rise project in Kandivali East.
- మాట నిలబెట్టుకోని రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు మహారెరా షాక్
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇచ్చే హామీలను తేలిగ్గా తీసుకోరాదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) కీలక తీర్పు ఇచ్చింది. ఒక ఫ్లాట్ కొనుగోలు వ్యవహారంలో తనకు వచ్చిన బ్రోకరేజీలో 1 శాతం వాటాను ఇంటి కొనుగోలుదారుడికి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, ఆ తర్వాత మాట తప్పిన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. రాతపూర్వక హామీని నెరవేర్చకపోవడం మోసపూరిత ప్రతినిధిత్వం, అన్యాయ వాణిజ్య విధానం కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను సంప్రదించారు. కాందివలి ఈస్ట్ ప్రాంతంలోని ఓ హై-రైజ్ ప్రాజెక్టులో ఆయన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీని పూర్తి చేయడంలో సహకరించిన ఏజెంట్‌కు డెవలపర్ నుంచి 2.5 శాతం వరకు కమిషన్ లభించాల్సి ఉంది. అయితే, కొనుగోలుదారుడు–ఏజెంట్ మధ్య జరిగిన అవగాహన ప్రకారం ఆ కమిషన్‌లో ఒక శాతాన్ని కొనుగోలుదారుడికి తిరిగి చెల్లించాలి. ఈ హామీని ఏజెంట్ తన రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ద్వారా కూడా ధ్రువీకరించాడు.
అయితే, ఇల్లు కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత తనకు రావాల్సిన 1 శాతం మొత్తాన్ని చెల్లించాలని కొనుగోలుదారుడు పలుమార్లు ఏజెంట్‌ను సంప్రదించారు. అయితే ఏజెంట్ డబ్బు చెల్లించకపోవడంతో పాటు, కొంతకాలానికి ఫోన్ కాల్స్, ఇతర కమ్యూనికేషన్లకు కూడా స్పందించడం మానేశాడని కొనుగోలుదారుడు మహారెరాను ఆశ్రయించారు. దీంతో ఈ హామీని చట్టపరంగా అమలు చేయవచ్చా? రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇచ్చిన రాతపూర్వక హామీకి అతను కట్టుబడి ఉండాలా? అన్న అంశాలపై మహారేరా విచారణ చేపట్టింది. అనంతరం రియల్ ఎస్టేట్ ఏజెంట్ తన రాతపూర్వక హామీని తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది.
కొనుగోలు లావాదేవీని పూర్తి చేయించేందుకు ఏజెంట్ ఇచ్చిన హామీ కేవలం మాటగా పరిగణించలేమని, రాతపూర్వకంగా చేసిన నిబద్ధతకు అతను బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం రెరా చట్టంలోని సెక్షన్ 10(సీ) ను ప్రాతిపదికగా తీసుకుంది. రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తాము అందించే సేవలకు సంబంధించి అన్యాయ వాణిజ్య విధానాలకు పాల్పడటం, తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే హామీలు ఇవ్వడాన్ని ఈ నిబంధన నిరోధిస్తుంది. ఈ వ్యవహారంలో ఏజెంట్ ప్రవర్తన సెక్షన్ 10(సీ) కింద తప్పుదోవ పట్టించే ప్రతినిధిత్వం, అన్యాయ వాణిజ్య విధానంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. వెంటనే కొనుగోలుదారుకు బ్రోకరేజీలో ఒక శాతం మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0